న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత పెద్ద నోట్లతో ప్రజలు రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ముందు బారులు తీరారు. రద్దయిన రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను డిపాజిట్ చేసేందుకు జనం దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఆర్బీఐ బ్యాంకు శాఖల ముందు వరుస కట్టారు. ఎటువంటి వివరణ లేకుండా రద్దయిన నోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు నేటితో ముగియనుండడంతో ప్రజలు ఆర్బీఐ ప్రధాన కార్యాలయంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల ముందు భారీ ఎత్తున నిలబడ్డారు. దీంతో పలుచోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. రద్దీ నేపథ్యంలో ఆర్బీఐ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా, సైన్యంలో పనిచేసేవారు, విదేశాల్లో ఉంటున్నవారు మాత్రం తమ వద్ద ఉన్న పాత నోట్లను నేరుగా ఆర్బీఐ వద్ద జమ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. ఇతరులు కూడా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.