ఆదివాసీలను వీడని మూఢ నమ్మకాలు
► పార్వతీదేవిగా భావించి యువతిని కొలుస్తున్న ప్రజలు
జయపురం(ఒడిశా): సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచం కుగ్రామంగా మారిపోతున్న తరుణంలో కూడా ఆదివాసీ ప్రజలను మూఢనమ్మకాలు ఇంకా వెంటాడుతున్నాయి. ఆంగ్లేయుల పాలనా కాలంలో వారి ఆగడాలకు తాళలేక వారిపై యుద్ధం ప్రకటించిన కొరాపుట్ జిల్లా పాడువ ఆదివాసీ మహిళ ఖొరపార్వతి తనకు శ్రీకృష్ణుడు జన్మించి ఆంగ్లేయుల పీచమణచమని కలలో కనిపించి తెలిపాడని అందుచేత ప్రతి ఒక్కరు ఆగ్లేయులపై యుద్ధం చేసేందుకు ఒక్కొక్క గట్టి వెదురు దుంగలను పట్టుకుని వస్తే ఆంగ్లేయులపై జరిపే యుద్ధంలో అవి తుపాకులుగా మారుతాయని తెలిపింది. దీంతో వారు వెదుర్లు పట్టుకుని ఆంగ్లేయులపై తిరగబడ్డారు. అయితే ఖొరాపార్వతి చెప్పినట్లు వెదురులు తుపాకులు కాలేదు సరికదా పోలీసుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఆ సంఘటనలో పార్వతి భర్త ఖొరా మల్లన్న నేల కూలాడు. పరాజయంతో పార్వతితో పాటు మిగతా వారంతా అడవిలోకి పారిపోయారు. ఆనాటి ఆమె మూఢనమ్మకంలో దేశ భక్తి ఉంది.
అమ్మవారిగా పూజలు
కానీ నేడు పార్వతి దేవి తనకు కనిపించిందని తెలిపి అడవిలో దైవధ్యానం చేస్తున్న యువతిని ఆదివాసీలు పార్వతీదేవిగా పూజిస్తున్నారు. ఈ సంఘటన నవరంగ్‌పూర్ జిల్లా పపడహండి సమితి తుంబరల గ్రామ పంచాయతీ ధనశులి గ్రామంలో వెలుగు చూసింది. ఆ గ్రామానికి చెందిన భగత్ మాలి కుమార్తె డాలింబమాలి(20) తనను çపార్వతీదేవి పిలిచిందని చెప్పకుంటోంది. గత 5 రోజులుగా ఆమె ఈ విదంగా ప్రవర్తిస్తూ ఇంటిని వీడి అడవి పట్టింది. కొద్ది రోజుల కిందట డాలింబ మాలి అడవిలో పుట్టకొక్కు సేకరించేందుకు గ్రామంలోని మరికొంత మందితో కలిసి వెళ్లింది. అడవి నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఆమె ముభావంగా ఉంటూ ఎవరితోను మాట్లాడడం లేదు. ఇంటిలో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఏమైందని ఇంటి వారు ఆమెను ప్రశ్నించగా తాను అడవికి పుట్టగొడుగు సేకరించేదుకు వెళ్లిన సమయంలో మాత పార్వతీదేవి కనిపించిందని ఇక తాను ఇంటిలో ఉండనని, పార్వతీ దేవి వద్దకు వెళ్లిపోతానని చెప్పిందట.
దీంతో భయపడిన ఆమె కుటుంబీకులు గ్రామంలో గల పెద్దలకు డాలింబ తెలిపిన విషయాన్ని వివరించి ఏం చేయాలని అడిగారు. కొంతమంది సూచన మేరకు వారు తమ గ్రామ సమీపంలో గల జుటికిగుడ గ్రామానికి వెళ్లి అక్కడి మంత్రగాడిని కలిసి తమ బిడ్డ పరిస్థితిని వివరించారు. మంత్రగాడిని కలిసి వారు ఇంటికి వచ్చే సమయానికి డాలింబ ఇంటిలో కనిపించలేదు. ఆమె ఎక్కడికి వెళ్లిందీ తెలియక వెతకడం ప్రారంభించారు. ఆ మరునాడు కూడా వారు వివిధ ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోయింది. అయితే అప్పటికే డాలింబ మాలి ధనశులి అడవిలోకి వెళ్లిపోయింది. ఆమె అడవిలో ఒకరాయిపై కూర్చుని భగవంతుని ధ్యానిస్తోందని సమాచారం.
ఈ విషయం తెలిసిన ఆమె బంధువులు, కొంతమంది భక్తులు అక్కడికి వెళ్లారు. ఆమె దట్టమైన అడవిలో నిద్రాహారాలు లేకుండా ఉండడం చూసి ఆమె కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. తమ బిడ్డ విషయాన్ని గ్రామంలో చెప్పారు. నిజంగానే ఆమెను పార్వతీదేవి అని ప్రజలంతా భావించారు. ఇంకేముంది ఆమెకు ఒక తాత్కాలిక గుడిసె వేశారు అందులో ఆమెను ఉంచి పూజలు చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు కాపలాగా ఉంటన్నారు. ఈవిషయం అన్ని గ్రామాలకు పాకింది. అంతే పార్వతీదేవిగా అమెను భావించి పూజలు చేసేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఇది మూఢ నమ్మకమో లేక మూఢభక్తో వారికే తెలియాలి.