
చండీగఢ్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హర్యానాలోని రోహ్‌తక్‌లో శుక్రవారం యోగా డే కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. యోగా శరీరంతోపాటు మనసును ఆరోగ్యంగా ఉంచుతుందని, ఇది ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన జీవితం వైపు నడిపిస్తోందని అన్నారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. భారతీయ ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగా మన బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో హర్యానాలో యోగా మండలిని ఏర్పాటు చేసినందుకు మనోహర్ లాల్‌ను అమిత్ షా అభినందించారు. వీరితో పాటు హర్యానా మంత్రి అంజి విజ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా తదితరులు యోగా డేలో పాల్గొన్నారు.
కాగా ముఖ్య అతిథులు కార్యక్రమ ప్రాంగణాన్ని వీడిన తర్వాత అక్కడ గందరగోళం నెలకొంది. స్థానిక ప్రజలు వేదికపై యోగా మ్యాట్‌ల కోసం గొడవ పడ్డారు. కొంతమంది మ్యాట్‌లతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ప్రజలు యోగా మాట్స్ కోసం ఎలా గొడవ పడుతున్నారో చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment