ఆవేదన వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : గుజరాత్లోని రాజ్కోట్లో తన విగ్రహాన్ని ప్రతిష్టించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్కోటలో మద్దతుదారులు తనకు గుడి కట్టారని వార్త చూసి ఒక్కసారిగా షాక్ అయ్యానంటూ ఆయన గురువారం ట్వీట్టర్లో ట్వీట్ చేశారు. తనకు ఆలయం నిర్మించడం వ్యక్తిగతంగా చాలా బాధించిందని మోదీ అన్నారు.
ఇటువంటివి భారతీయ సమున్నత సాంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. ఇదా మన సంస్కృతి మనకు నేర్పిందంటూ మోదీ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీకు తీరిక, సమయం ఉంటే దయచేసి.. మన దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలన్న కలను నెరవేర్చడానికి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం చేపట్టాలని మోదీ తన మద్దతుదారులకు ట్వీట్టర్లో సలహా ఇచ్చారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం చేయరాదంటూ సూచించారు.
కాగా, రాజ్‌కోట్‌లోని మోదీ మద్దతుదారులు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టారు. ఫిబ్రవరి 16న ఆలయ ప్రతిష్ఠాపన చేయనున్న విషయం తెలిసిందే.