'నా తండ్రి అమాయకుడు'
ముంబై: షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన పీటర్ ముఖర్జియా కొడుకు, షీనా బోరా ప్రియుడు రాహుల్ స్పందించాడు. తన తండ్రి అమాయకుడనీ, ఈ కేసుతో ఆయనకేమీ సంబంధం లేదని వ్యాఖ్యానించాడు. తన తండ్రిపై చేసిన ఆరోపణలు దారుణమన్నాడు. నిన్న సీబీఐ అదుపులోకి తీసుకున్న తండ్రి పీటర్ ను సీబీఐ ఆఫీసులో కలవడానికి వచ్చిన రాహుల్ శనివారం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయి, షీనాబోరా తల్లి ఇంద్రాణి శుక్రవారం మీడియాముందు నోరు విప్పింది. ఎప్పటిలాగానే తాను అమాయకురాలినని వాదించింది. ఈ కేసుతో పీటర్ ముఖర్జియాకు ఉన్న సంబంధంపై మాట్లాడానికి నిరాకరించింది. అటు పీటర్ కూడా సీబీఐ ఆరోపణలను ఖండించాడు.
కాగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో మీడియా టైకూన్, ఇంద్రాణీ భర్త పీటర్ ముఖర్జియా ను నిందితుడుగా పేర్కొంటూ చార్జ్ షీట్ దాఖలు చేసింది. హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ కుట్ర కేసు అభియోగాలను నమోదు చేసింది. షీనా హత్య గురించి తెలిసినా కొడుకు రాహుల్ ను తెలియకుండా దాచిపెట్టారన్నది సీబీఐ వాదన. మరోవైపు ముగ్గురు ప్రధాన నిందితుల జ్యుడీషియల్ కస్టడీని డిసెంబర్ 3 వ తేదీవరకు పొడిగించింది సీబీఐ కోర్టు.