'ఆ మూడు రోజులు అనుమతివ్వండి'
న్యూఢిల్లీ: తమిళనాడులో అత్యంత పురాతన క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా 14, 15, 16 తేదీల్లో మూడు రోజుల పాటు జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు. కాగా సంబంధిత బెంచ్ ముందు పిటిషన్ వేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ఆదేశించారు.
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జస్టిస్ దీపక్ మిశ్రా, ఎన్వీ రమణలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం స్టే విధించిన సంగతి తెలిసిందే. సుప్రీం స్టేతో తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తాయి. జల్లికట్టు అభిమానుల ఆందోళనతో పలుచోట్ల జనజీవనం స్తంభించింది. జల్లికట్టును నిర్వహించేలా ఆర్డినెన్సు తీసుకురావాలని సీఎం జయలలిత, డీఎంకే చీఫ్ కరుణానిధి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.