షోలాపూర్, న్యూస్‌లైన్ : షోలాపూర్ పట్టణంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా షోలాపూర్‌లోనే పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలకు విక్రయాలు సాగుతున్నాయి. పట్టణ వ్యాప్తంగా 16 పెట్రోల్ బంకులున్నాయి. వీటి ద్వారా రోజూ 48 వేల లీటర్ల పెట్రోలు, 20 వేల డీజిల్‌లు విక్రయాలు జరుగుతున్నాయి. పట్టణంలో పెట్రోల్ లీటరు ధర 86.55 రూపాయలు, పట్టణం వెలుపల రూ. 78.66 ఉంది. ప్రతి లీటరుకు రూ. 7.89 తేడా ఉంది. డీజిల్ ధర పట్టణంలో రూ. 72.45, వెలుపల రూ. 65.18. రూ.7.34 పైసలు తేడా ఉంది. ఇక్కడ పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలకు విక్రయాలు చేయాల్సి వస్తోందని బంక్ డీలర్ల అసోషియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
11వ తేదీన బంక్‌ల బంద్ : డీలర్స్ అసోసియేషన్ వెల్లడి
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఫెడరేషన్ ఆఫ్ మహారాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. సునీల్ చవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికిఈ నెల 11వ తేదీన పెట్రోల్ బంకుల బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు.
చైనా వస్తువులకు 0.1 శాతం మేర ఎల్‌బీటీ అమలు చేస్తున్న ప్రభుత్వం, పెట్రోల్, డీజిల్‌పై 5 శాతం మేర ఎల్‌బీటీ పన్ను విధించడం సరైందికాదన్నారు. ఈ పన్నుల వలనే వినియోగదారులపై అదనపు భారం పడుతోందని ఆయన చెప్పారు. తక్షణమే ఎల్‌బీటీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పెట్రోల్ బంక్‌ల యజమానులు నందకిషోర్ బాలుదావా, సిద్దేశ్వర్ వాళే, కేదార్ బావి తదితరులు పాల్గొన్నారు.
పెట్రో మంటలు
Published Wed, Aug 6 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement