
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను వేసింది. తాజా బిల్లుతో కోటా పరిమితి 50 శాతం దాటిపోతుందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. 124వ రాజ్యాంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లును రద్దుచేయాలని, అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందని, రిజర్వేషన్లకు ఆర్థిక స్థోమత ఒక్కటే ప్రాతిపదిక కావొద్దని అన్నారు.
ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లను జనరల్ కేటగిరీకే పరిమితం చేయొద్దని, అదే సమయంలో కోటా పరిమితి 50 శాతం దాటిపోకూడదని అభిప్రాయపడ్డారు. తాజా సవరణలతో ఆర్థికపరంగా రిజర్వేషన్ల పరిధి నుంచి ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలను తొలగించడం ద్వారా జనరల్ కేటగిరీలోని పేదలకే లబ్ధిచేకూరుతుందని ఆరోపించారు. ఓబీసీలకు అందిస్తున్న 27 శాతం రిజర్వేషన్లను కూడా ఆర్థిక ప్రాతిపదిక కిందికి తీసుకురావాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment