మృతులు లక్ష్మినారాయణ, తోట రత్నం, గ్రంధి సుబ్బారావు
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/చాగల్లు/కాకినాడ: ఆధ్యాత్మిక యాత్రల్లో విషాదాలు చోటుచేసుకున్నాయి. కైలాస మానస సరోవరం, అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి అక్కడ కురుస్తున్న మంచు తుపాన్ వల్ల చైనా–నేపాల్ సరిహద్దులోని హిల్సా బేస్ క్యాంప్‌లో చిక్కుకున్న 1,500 మందికి పైగా ఉన్న భారతీయ యాత్రికుల్లో ఎనిమిది మంది మృతిచెందగా.. 104 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణమైన తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రముఖ ఇంజినీర్, ఆర్కిటెక్చర్, బిల్డర్ గ్రంధి వీవీఎస్‌ఎల్‌ఎన్ సుబ్బారావు (58) టిబెట్ సరిహద్దులో గుండెపోటుతో మృతి చెందినట్లు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
కేరళకు చెందిన నారాయణం లీలా(56) మృతి చెందినట్టు ఎంబసీ పేర్కొంది. మరోవైపు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72), అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ గుండెపోటుతో కన్నుమూశారు. అనంతపురానికి చెందిన మరో వ్యక్తి మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. కాగా, అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. బల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. రైల్‌పత్రి, బ్రారిమార్గ్ మధ్య కొండచరియలు విరిగిపడడంతో ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు..
కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లి చైనా–నేపాల్ సరిహద్దులోని హిల్సా బేస్ క్యాంప్‌లో చిక్కుకున్న యాత్రికుల తరలింపు ఏర్పాట్లు ఓ కొలిక్కి వస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న మంచు తుపాను వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్ర ముందుకు సాగలేదు. బేస్‌క్యాంపుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన 1500 మందికి పైగా(సిమిల్‌కోట్525, హిల్సా550, టిబెట్ 500) యాత్రికులు ఉన్నారు. వీరిలో ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లా, విజయవాడకు చెందిన సుమారు 100 మంది, తెలంగాణకు చెందిన 110మంది తెలుగువారు ఉన్నారు.
మంగళవారం సాయంత్రానికి వాతావరణం అనుకూలించడంతో వీరందరినీ సిమిల్‌కోట్, నేపాల్ గంజ్‌కు తరలించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. నేపాల్ ఆర్మీ హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సిమిల్‌కోట్ నుంచి నేపాల్‌గంజ్‌కు 7 ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల్లో ఇప్పటి వరకు 104 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలుగు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఏఆర్సీ శ్రీకాంత్ ఎప్పటికప్పుడు నేపాల్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హిల్సా నుంచి సమికోట్‌కు అక్కడి నుంచి నేపాల్‌గంజ్‌కు తరలించి యాత్రికులను లక్నో చేరుస్తున్నారు.
యాత్రికుల తరలింపునకు చర్యలు
మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ట్వీటర్‌లో పేర్కొన్నారు. హాట్‌లైన్ ఏర్పాటు చేసి తెలుగు, మళయాళం, తమిళ్, కన్నడ భాషల్లో యాత్రికుల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలుగు వారికోసం 977–9808082292 హాట్‌లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రాష్ట్ర యాత్రికులు క్షేమం
సాక్షి, హైదరాబాద్: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన రాష్ట్ర యాత్రికులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెల 27 నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల యాత్రకు ఆటంకం కలిగింది. కొందరు యాత్రికులు మార్గం మధ్యలో చిక్కుకుపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో పాటు అక్కడి రాయబార కార్యాలయాన్ని సంప్రదించి యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి, ఎంపీ వినోద్ యాత్రికులకు సౌకర్యాలు అందేలా చూస్తున్నారు. యాత్రలో ఉన్న కరీంనగర్ వాసి గౌరెశెట్టి మునిందర్‌తో అధికారులు మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర యాత్రికుల కు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం సిమఖోట్ లో సురక్షితంగా ఉన్నట్లు మునిందర్ చెప్పారు. సిమఖోట్ నుంచి గమ్యస్థానానికి చేర్చేందుకు అక్క డి యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. మూడ్రోజుల్లో రాష్ట్ర యాత్రికులు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశముందని తెలిసింది.
వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: మానస సరోవర్ యాత్రకు వెళ్లి హిల్సా శిబిరంలో చిక్కుకుపోయిన తెలుగువారిని క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చేలా సత్వర చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రా యాత్రికుల భద్రతపై ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికులను క్షేమంగా తెచ్చే చర్యలను వేగవంతం చేయడంతో పాటుగా అవసరమైన వారికి ఆరోగ్య సేవలు కూడా అందించాలని వైఎస్ జగన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment