కార్యవర్గ సమావేశం సందర్భంగా కరుణానిధికి నివాళులర్పిస్తున్న స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణంతో మంగళవారం చెన్నైలో జరిగిన కార్యవర్గ అత్యవసర సమావేశం ఉద్వేగభరితంగా సాగింది. కరుణ కొడుకు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ సందర్భంగా పలుమార్లు తండ్రిని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చెన్నై మెరీనా బీచ్‌లో కలైజ్ఞర్‌కు సమాధి స్థలం దక్కకుంటే ఏమై ఉండేదని నన్ను చాలామంది అడిగారు, ఏముంది.. కరుణ సమాధి పక్కనే నాదీ ఉండేది. కానీ, ఆ అవసరం రాలేదు’ అని ఈ సందర్భంగా స్టాలిన్ అన్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బగళన్ సమక్షంలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దురైమురుగన్, కనిమొళి, టీఆర్‌బాలు తదితర ముఖ్య నేతలతోపాటు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టగానే అందరూ లేచి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాప తీర్మానంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కరుణానిధి సాధించిన విజయాలు, తీసుకున్న సంచలన నిర్ణయాలు, ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.
అధినేతతోపాటు తండ్రిని కోల్పోయా
పలువురు పార్టీ నేతల ప్రసంగాల అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మీరంతా పార్టీ అధినేతను మాత్రమే కోల్పోయారు. కానీ, నేను అధినేతతో పాటు తండ్రికి సైతం దూరమయ్యా. గత ఏడాదిన్నరగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నపుడు నన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. మీ అందరి సహకారంతో పార్టీ కార్యకలాపాలను నెట్టుకొస్తున్నా. పార్టీలో పునరుత్తేజం కోసం ప్రయత్నించా. ఆయనను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చా.
డీఎంకేను మళ్లీ గెలిపించి అధికారం ఆయన చేతిలో పెట్టాలని అహర్నిశలు కృషి చేశా. అన్నా సమాధి పక్కనే కలైజ్ఞర్ సమాధి ఉండాలని నిర్ణయించాం. ఇది మన ఆశ కాదు, కరుణ కోరిక. అయితే కరుణ చివరి కోర్కెను తీర్చేందుకు ఈ ప్రభుత్వం నిరాకరించింది. సీఎం చేతులు పట్టుకుని బతిమాలినా సానుకూలంగా స్పందించకుండా ‘చూద్దాం’ అని మాత్రమే సమాధానమిచ్చారు. దురై మురుగన్‌ను పంపినా స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాం.
ఒకవేళ మెరీనా బీచ్‌లో సమాధికి స్థలం కేటాయించకుంటే ఏమయ్యేదని అందరూ ప్రశ్నించారు. ఏముంది.. కరుణ సమాధి పక్కనే నన్ను సమాధి చేయాల్సి వచ్చేదని చెప్పా. కానీ, ఆ పరిస్థితి రాలేదు. కరుణ జీవించిఉన్నపుడేకాదు మరణించిన తర్వాతా గెలిచారు. ఆయన పార్టీని కాపాడుకుందాం, కరుణ ఆశయాలు సాధించేలా ప్రతినబూనాలి’ అని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆయన తన ప్రసంగంలో తరచూ ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నేతలంతా పార్టీ అధ్యక్షుడుగా స్టాలినే ఉండాలని కోరుకుంటున్నామని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment