Karunanidhi death
-
కరుణ సమాధి పక్కనే నాది ఉండేది!
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణంతో మంగళవారం చెన్నైలో జరిగిన కార్యవర్గ అత్యవసర సమావేశం ఉద్వేగభరితంగా సాగింది. కరుణ కొడుకు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ సందర్భంగా పలుమార్లు తండ్రిని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చెన్నై మెరీనా బీచ్‌లో కలైజ్ఞర్‌కు సమాధి స్థలం దక్కకుంటే ఏమై ఉండేదని నన్ను చాలామంది అడిగారు, ఏముంది.. కరుణ సమాధి పక్కనే నాదీ ఉండేది. కానీ, ఆ అవసరం రాలేదు’ అని ఈ సందర్భంగా స్టాలిన్ అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బగళన్ సమక్షంలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దురైమురుగన్, కనిమొళి, టీఆర్‌బాలు తదితర ముఖ్య నేతలతోపాటు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టగానే అందరూ లేచి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాప తీర్మానంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కరుణానిధి సాధించిన విజయాలు, తీసుకున్న సంచలన నిర్ణయాలు, ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అధినేతతోపాటు తండ్రిని కోల్పోయా పలువురు పార్టీ నేతల ప్రసంగాల అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మీరంతా పార్టీ అధినేతను మాత్రమే కోల్పోయారు. కానీ, నేను అధినేతతో పాటు తండ్రికి సైతం దూరమయ్యా. గత ఏడాదిన్నరగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నపుడు నన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. మీ అందరి సహకారంతో పార్టీ కార్యకలాపాలను నెట్టుకొస్తున్నా. పార్టీలో పునరుత్తేజం కోసం ప్రయత్నించా. ఆయనను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చా. డీఎంకేను మళ్లీ గెలిపించి అధికారం ఆయన చేతిలో పెట్టాలని అహర్నిశలు కృషి చేశా. అన్నా సమాధి పక్కనే కలైజ్ఞర్ సమాధి ఉండాలని నిర్ణయించాం. ఇది మన ఆశ కాదు, కరుణ కోరిక. అయితే కరుణ చివరి కోర్కెను తీర్చేందుకు ఈ ప్రభుత్వం నిరాకరించింది. సీఎం చేతులు పట్టుకుని బతిమాలినా సానుకూలంగా స్పందించకుండా ‘చూద్దాం’ అని మాత్రమే సమాధానమిచ్చారు. దురై మురుగన్‌ను పంపినా స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాం. ఒకవేళ మెరీనా బీచ్‌లో సమాధికి స్థలం కేటాయించకుంటే ఏమయ్యేదని అందరూ ప్రశ్నించారు. ఏముంది.. కరుణ సమాధి పక్కనే నన్ను సమాధి చేయాల్సి వచ్చేదని చెప్పా. కానీ, ఆ పరిస్థితి రాలేదు. కరుణ జీవించిఉన్నపుడేకాదు మరణించిన తర్వాతా గెలిచారు. ఆయన పార్టీని కాపాడుకుందాం, కరుణ ఆశయాలు సాధించేలా ప్రతినబూనాలి’ అని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆయన తన ప్రసంగంలో తరచూ ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నేతలంతా పార్టీ అధ్యక్షుడుగా స్టాలినే ఉండాలని కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. -
జ్ఞాపకాలు
-
కిటికీ ఎక్కి.. ఫెన్సింగ్ దూకి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ సీఎం, దివంగత కరుణానిధి అంతిమయాత్రలో అగ్రనేతలు నానా అవస్థలు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సైతం కరుణ అంత్యక్రియల సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తొలుత కరుణ భౌతికకాయానికి అంజలి ఘటించేందుకు రాజాజీ హాల్ వద్దకు రాహుల్ చేరుకున్న సమయంలో అక్కడ వీఐపీల మార్గం కిక్కిరిసి ఉంది. దీంతో ముందుకు వెళ్లేదారిలేక రాహుల్ అక్కడే ఆగిపోయారు. ఇంతలో కొందరు సెక్యూరిటీ గార్డులు రాహుల్‌కు కుర్చీ ఏర్పాటుచేసి దారి క్లియర్ చేసేందుకు వెళ్లారు. ఇలా వెళ్లినవారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో రాహుల్ అక్కడే తచ్చాడారు. ఇలా దాదాపు 30 నిమిషాలు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రాహుల్ ఒక్కరే ఉన్నారని కేంద్ర హోంశాఖకు సమాచారం అందింది. కర్రల కింద నుంచి దూరి.. కరుణ అంత్యక్రియలు జరిగిన మెరీనా బీచ్‌కు చేరుకోవడానికీ రాహుల్ చాలా అవస్థలు పడ్డారు. అశేషజనవాహని మధ్య టీఎన్‌సీసీ చీఫ్ తిరునావుక్కరసర్, మాజీ ఎంపీ విశ్వనాథన్ తదితరులు రాహుల్ చుట్టూ వలయంగా ఏర్పడి ఆయన్ను అంత్యక్రియల వేదిక వద్దకు తీసుకెళ్లారు. అయినా జనం తాకిడితో రాహుల్ ఇబ్బంది పడ్డారు. కరుణ అంత్యక్రియలు ముగిశాక అక్కడ్నుంచి తిరిగివెళ్లడం రాహుల్‌కు మరో సవాలుగా మారింది. సమీపంలోని అన్నా స్మారక మందిరం పక్కనే ఉన్న పెయింట్ డబ్బాలపైకి ఎక్కి కిటీకి ఊచలు పట్టుకుని అవతలకు దూకారు. అక్కడ చిందరవందరగా ఉన్న పాత తుక్కు సామానుపైనే నడుచుకుంటూ ముందుకెళ్లారు. అనంతరం అడ్డుగా కట్టిన కర్రల కింద నుంచి దూరి సమీపంలోని కారు వద్దకు చేరుకుని బతుకుజీవుడా.. అంటూ బయటపడ్డారు. కాగా, రాహుల్ భద్రత విషయంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యంపై చెన్నై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేరళ సీఎం విజయన్, కేరళ గవర్నర్ తదితరులు జనసందోహంలో చిక్కుకుపోయారు. చివరికి భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. -
కలైజ్ఞర్‌పై గౌరవంతో...
హన్సిక బర్త్ డే గురువారం. బర్త్ డేకి గిఫ్ట్‌ను ఆశించకుండా తన ఫ్యాన్స్‌కే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశారామె. హీరోయిన్గా తాను చేస్తున్న 50వ సినిమా టైటిల్‌ను పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ప్రకటించాలనుకున్నారు. అయితే తమిళనాడు మాజీ సీయం కలైజ్ఞర్ కరుణానిధి మృతి చెందడంతో ఆయన మీద గౌరవంతో టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారు హన్సిక. లేడీ ఓరియంటెడ్ మూవీగా రూపొందబోయే ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. ఈ సినిమాను ఏడు దేశాల్లో షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. -
35 ఏళ్ల క్రితం కరుణానిధి సాయం
ముంబై: తమిళభాషపై అపార ప్రేమ ఉన్న కరుణానిధి, తమిళులు ఎక్కడ నుంచి సాయం కోరినా వెంటనే స్పందించేవారు. అన్నిరకాలుగా అదుకునేందుకు ప్రయత్నించేవారు. తాము కోరిన వెంటనే సమావేశానికి వచ్చిన కరుణానిధి, తమిళులకు ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ ఏర్పాటుకు సహకరించారని డీఎంకే ముంబై విభాగం చీఫ్ ఆర్.పళనిస్వామి గుర్తుచేసుకున్నారు. ‘ముంబైలో 1983లో తమిళులంతా కలసి నిర్వహించిన ఓ సమావేశానికి రావాల్సిందిగా మేము కరుణానిధిని ఆహ్వానించాం. ఆయన అందుకు అంగీకరించడమే కాకుండా మేం ఏయే కార్యక్రమాలు చేపడుతున్నామో, మాకు ఏం ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళులు గణనీయంగా ఉన్న ధారావి ప్రాంతంలో కమ్యూనిటీ స్కూల్ లేదనీ, నిధులు లేకపోవడం వల్లే దాని నిర్మాణం చేపట్టలేకపోయామని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. దీంతో స్కూల్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల్ని కరుణానిధి ఆదేశించారు. కేవలం ఆయన తీసుకున్న చొరవతో ఈ ప్రాంతంలో ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ కూడా ఏర్పాటైంది’ అని పళనిస్వామి చెప్పారు. ముంబై సమావేశానికి వచ్చిన సందర్భంగా కరుణ వేలాది మందిని కలుసుకున్నారన్నారు. 2010లోనే ఆసుపత్రి కోసం ఇల్లు దానం చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెన్నై గోపాలపురంలోని ఖరీదైన తన ఇంటిని ఆసుపత్రి స్థాపన కోసం 2010లోనే దానమిచ్చారు. ఆ ఏడాది తన 86వ జన్మదిన వేడుకల సందర్భంగా కరుణానిధి తన కొడుకులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధితోపాటు ఆయన భార్యలు కూడా చనిపోయిన తర్వాత ఈ ఆసుపత్రిని స్థాపించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కరుణానిధి తల్లి పేరిట అన్నై అంజుగమ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, కరుణ కుటుంబసభ్యులతోపాటు కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, ప్రముఖ తమిళ గేయరచయిత వైరముత్తు తదితరులు కూడా ట్రస్ట్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఆసుపత్రికి కలైజ్ఞర్ కరుణానిధి హాస్పిటల్ అని పేరుపెట్టనున్నారు. -
నీలో సగం నాకివ్వు నాన్నా!
తమిళనాడు శోకసంద్రంలో మునిగిఉన్న గత అర్థరాత్రి ఎంకె స్టాలిన్ తన తండ్రి కరుణానిధి ఆశీర్వాదాలను కోరుతూ ఆయనకు తమిళంలో రాసిన ఓ రాత ప్రతి ఫోటోని పోస్ట్ చేశారు. అప్పా అని సంభోదిస్తూ ఆ లేఖ ఉద్విగ్నభరితంగా సాగింది. ఆ లేఖ సారాంశం ఇదీ.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టినప్పుడల్లా తిరిగెప్పుడొస్తావో చెప్పిమరీ వెళ్ళే వారే! అలాంటిది ఒక్క మాటైనా నాతో చెప్పకుండా ఎలా నన్ను విడిచి వెళ్ళారు? తలైవా! ఓ నాయకుడా! మీరు నా మనస్సులోనూ, నా శరీరంలోనూ, నాలో ప్రవహించే ప్రతిరక్తబిందువులోనూ, నా ఆలోచనల్లోనూ, నా హృదయస్పందనలోనూ నాలోని అణువణువునా మీరే..నాలో భాగమైన మీరు మమ్మల్ని వీడి ఎక్కడికెళ్ళారు? ‘‘విరామం లేకుండా, అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తి ఇప్పుడిక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు’’ అంటూ సరిగ్గా ముప్ఫయ్ మూడేళ్ళ క్రితం మీ స్మృతి చిహ్నాన్ని మీరే లిఖించుకున్నారు. నిజంగా మీరు తమిళులకు చేయాల్సిందంతా చేసివెళుతున్నానన్న సంతృప్తితో వెళ్ళారా? తొమ్మిదిన్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రజాజీవితంలో మీదైన ముద్రవేసి ఎక్కడదాగుంటారు? మీరు సాధించినదానికి మించి ఎవరుచేస్తారా అని ఎదురుచూస్తున్నాం! జూన్ 3న తిరువరూర్ ఇసుకతిన్నెల్లో నీ తొంభయ్యైదవ పుట్టిన రోజు వేడుకల్లో నీలోని శక్తిని సగం నాకిమ్మని కోరాను. దానితో పాటు నీకు బహుతిగా ఇచ్చిన అన్నాదురై హృదయాన్ని కూడా నాకిస్తావా నాన్నా! అది నువ్వు నాకివ్వగలవా ఓ నా నాయకుడా! అదివ్వగలిగితే ఆ బహుమానంతో నీ కలలనూ, నీ ఆకాంక్షలనూ పరిపూర్తిచేస్తా! ఇక్కడే లక్షలాది మంది జనం మీకోసం తపిస్తున్నారు. ఆ జన హృదయ స్పందన మీకోసమే! వేనవేల వసంతాల పాటు తమిళ ప్రజల స్ఫూర్తిని సుస్థిరం చేసే ఆ మాటలను మీరు మళ్ళీ ఒక్కసారి... ఒకే ఒక్కసారి మాట్లాడండి నాన్నా! ’’ఉయైరినమ్ మేలన ఉదన్ పిరప్పు గలే ’’ నా జీవితం మొత్తంలో నిన్ను నాన్నా అని కాకుండా తలైవర్ (లీడర్) అని పిలిచిన నాకు యిప్పుడెందుకో ’నాన్నా’ అని పిలవాలనిపిస్తోంది నాన్నా! ఓ నా ప్రియతమ నాయకుడా నిన్ను ఒక్కసారి, దయచేసి ఒకేఒక్కసారి నాన్నా అని పిలవమంటారా! -
తండ్రికి తగ్గ తనయుడేనా?
కరుణ మరణంతో స్టాలిన్‌కు పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు తండ్రికి తగ్గ తనయుడేనని స్టాలిన్‌ను అభిమానులు కీర్తిస్తున్నా ఆయన పార్టీ బాధ్యతల్ని ఎంతవరకు మోయగలరు? కరుణ అండదండలు, సలహాలు సంప్రదింపులు లేకుండా స్టాలిన్ డీఎంకేని తిరిగి అధికారంలోకి తీసుకురాగలరా ? పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపై తీసుకు వచ్చే సామర్థ్యం ఆయనకు ఉందా? ద్రవిడ రాజకీయాల్లో ఇక డీఎంకే పయనమెటు? ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ.. స్టాలిన్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు. ఇన్నేళ్లకు ఆయనకు పూర్తిగా పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో 2014 లోక్‌సభ ఎన్నికలు, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ ప్రచార బాధ్యతలు తీసుకున్నప్పటికీ జయలలిత వంటి జనాకర్షక నాయకురాలిని పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోయారు. జయ మరణానంతరం ఏఐఏడీఎంకే చీలిపోవడం, పన్నీర్ సెల్వం, పళనిస్వామి ప్రభుత్వాలు బలహీనంగా మారిపోవడంతో స్టాలిన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. అసెంబ్లీలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహరచనలో కొంతవరకు పై చేయి సాధించగలిగారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో బలంగా చెప్పగలిగే స్థాయికి ఎదిగారు. కరుణానిధి మాదిరిగా అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం స్టాలిన్‌కు లేకపోయినప్పటికీ చెప్పదలచుకున్నదేదో స్పష్టంగా చెప్పగలరు. అలా నెమ్మది నెమ్మదిగా పార్టీపైనా, ప్రజల్లోనూ తన ముద్ర వేయడానికి స్టాలిన్ ప్రయత్నాలని చేస్తున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురు దెబ్బే జయలలిత మరణానంతరం పార్టీ రెండుగా చీలిపోయింది. జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే చీలిక వర్గాలు రెండూ తమ అభ్యర్థుల్ని నిలబెట్టడంతో అందరూ డీఎంకేకి లాభం చేకూరుతుందని అంచనా వేశారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో శశికళ మద్దతు వర్గం అభ్యర్థి దినకరన్ విజయకేతనం ఎగురవేశారు. ఎదురయ్యే సవాళ్లు ► ఒకవైపు దిగ్గజ నేతలైన జయలలిత, కరుణానిధిల మరణం, మరోవైపు రజనీకాంత్, కమలహాసన్ వంటి సినీ దిగ్గజాలు పొలిటికల్ స్టార్లుగా మారడం వంటి పరిణామాలతో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఊహకు అందకుండా ఉంది. ► ఇన్నాళ్లూ కరుణ అండదండలు ఉండడంతో అళగిరి మద్దతుదారుల్ని తనవైపునకు తిప్పుకోగలిగిన స్టాలిన్ ఇకపై సోదురుడిని ఎదుర్కోవడం కూడా ఒక సవాలే. ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఓటమి సమయంలోనే బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కిన అళగిరి అడుగులు ఎటు వేస్తారో ఇప్పుడే చెప్పలేం. ► 1976–96 మధ్యకాలంలో డీఎంకే ఏకంగా 18 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కరుణానిధి తనకున్న నాయకత్వ పటిమతో డీఎంకే ఎక్కడా పట్టు కోల్పోకుండా చేయగలిగారు. ఇప్పుడున్న సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో మరోసారి పార్టీ ఓడిపోతే దాని భవిష్యత్ ఏమిటో చెప్పలేం.∙స్టాలిన్ మరి తనపై ఉన్న అతి పెద్ద బాధ్యతను ఎంతవరకు నెరవేర్చగలరో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలుస్తుంది. బలాలు ► కరుణానిధి స్వయంగా వారసుడిగా ప్రకటించడం ► ప్రజల్లో విస్తృతంగా తిరగడం ► పార్టీ కేడర్‌పై పట్టు సాధించడం బలహీనతలు ► మంచి వక్త కాకపోవడం ► ప్రజాకర్షణ అంతగా లేదు.. ► తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారనే చెడ్డపేరు -
ముగిసిన కరుణానిధి అంతిమ సంస్కారాలు
-
మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు
-
ప్రారంభమైన కరుణానిధి అంతిమయాత్ర
-
కరుణానిధి అంత్యక్రియలు పూర్తి
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. సాయంత్రం 6.15 గంటలకు మెరీనా బీచ్‌కు చేరుకున్న ఆయన భౌతికకాయానికి తొలుత పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆ తర్వాత త్రివిధ దళాలు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించాయి. కరుణానిధి పార్థీవదేహంపై కప్పి ఉంచిన జెండాను స్టాలిన్‌కు అందజేశారు. అనంతరం డీఎంకే జెండాను కప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కడసారి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఆ తర్వాత త్రివిధ దళాలు కరుణ పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన పేటికలో ఉంచి ఖననం చేశారు. ఆ సమయంలో భద్రత బలగాలు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ అంత్యక్రియలకు మాజీ ప్రధాని దేవేగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి పొన్ రాధకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రీన్, తమిళనాడు మంత్రి డి జయకుమార్, గులాంనబీ అజాద్, శరద్ పవార్, వీరప్ప మొయిలీతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మెరీనా బీచ్ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. రాజాజీ హాల్ నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగింది. దారి పొడువునా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కరుణానిధికి కన్నీటి నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘కరుణానిధి మృతి కలచివేసింది’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురందరుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం కరుణానిధి మరణం పట్ల అఖిల భారత నాయీ సెయిన్, సవితా, విల్లంకితుల నాయర్, ఇసాయ్ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్‌ఐయూఎఫ్) సంతాపం ప్రకటించింది. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ‘కలైంజ్ఞర్’ మరణం పూడ్చలేనిదని ఏఐఎన్‌ఐయూఎఫ్ కన్వీనర్ దుగ్యాల అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమిళ నాయీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి రాజకీయ రంగంలో శిఖరస్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మరణం తమ జాతికి శరాఘాతమని ఏఐఎన్‌ఐయూఎఫ్ ప్రతినిధి సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఓటమి ఎరుగని దురందరుడు ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి దేశ రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలిగిన కరుణానిధి మరణం తమను ఎంతగానో కలచివేసిందని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం పేర్కొన్నారు. కరుణానిధి మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. ఓటమి ఎరుగని రాజకీయ దురందరుడు కరుణానిధి అని కొనియాడారు. 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘనత ఆయకే దక్కిందన్నారు. డీఏంకే పార్టీకి ఏకధాటిగా 50 ఏళ్లు అధ్యక్షుడిగా కొనసాగారని, తమిళనాడులోనే కాక దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణ కులంలోని గొప్ప నాయకుడు అస్తమించడంతో తామంతా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయామన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నీటి నివాళులు కరుణానిధి నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, కరుణానిధి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ద్రవిద యోధుడికి కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. -
కరుణానిధికి నివాళి.. కేసీఆర్ పిడికిలి పైకెత్తి...
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థీవదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. బుధవారం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన కేసీఆర్ కరుణానిధి కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళితోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు ఆయన కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. కరుణానిధికి నివాళులర్పించిన అనంతరం కేసీఆర్ పిడికిలి పైకెత్తి కరుణానిధి అమర్‌రహే అని నినదించారు. కాగా సాయంత్రం 4 గంటలకు కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు కరుణానిధి అంత్యక్రియలు జరగనున్న మెరీనా బీచ్‌కు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. రాజాజీ హాల్లో జరిగిన తొక్కిసలాట అనంతరం మాట్లాడిన స్టాలిన్ కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
కరుణానిధికి నివాళులర్పించిన రాహుల్ గాంధీ
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థీవదేహానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం చెన్నై చేరుకున్న రాహుల్.. రాజాజీ హాల్‌కు వెళ్లారు. ఆయన కుమారుడు స్టాలిన్‌ను పరామర్శించారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా కరుణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ పి సదాశివం, కాంగ్రెస్ నాయకులు గులాంనబీ అజాద్, వీరప్ప మెయిలీ కూడా రాజాజీ హాల్‌కు చేరుకుని కరుణ పార్థీవదేహానికి నివాళులర్పించారు. -
కరుణానిధి మృతి పట్ల పార్లమెంట్ సంతాపం
-
కరుణానిధిని చూసి ఎంతో నేర్చుకున్నాం
-
రాజాజీ హాల్లో తొక్కిసలాట.. ఇద్దరి మృతి
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధిని కడసారి చూసేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. జనం రద్దీ పెరగడం, అభిమానులు బారికేడ్లను తోసుకొని రావడంతో రాజాజీ హాల్లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా, 40 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంతిమయాత్ర సజావుగా సాగేలా కార్యకర్తలు సహకరించాలని కోరారు. సీఎం పళనిస్వామిని కలసి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహిస్తామంటే సహకరించలేదని తెలిపారు. కోర్టు ద్వారా అనుమతులు సాధించామని పేర్కొన్న ఆయన దీనిని తమిళ ప్రజల విజయంగా అభివర్ణించారు. 4 గంటలకు ప్రారంభంకానున్న అంతిమయాత్ర సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. మెరీనా బీచ్‌లో ఆర్మీ బలగాలు.. కరుణానిధి అంత్యక్రియలు జరగనున్న మెరీనా బీచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటుండటంతో అక్కడ భారీగా సైనిక బలగాలను మొహరించారు. మరోవైపు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. -
కరుణానిధి మృతిపై బాలయ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాజకీయ దిగ్గజం, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణంపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. కరుణానిధి మృతి రాజకీయాలకు మాత్రమే కాకుండా.. చిత్రసీమకూ కూడా తీరని లోటని పేర్కొన్నారు. ఓ అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిది’ అని విచారం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ తెలియజేయజేశారు. మరోవైపు మోహన్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితర టాలీవుడ్ ప్రముఖులు కూడా కరుణానిధి మృతిపై సంతాపం తెలియజేస్తారు. -
కలైంగర్‌కు ప్రముఖుల నివాళి
-
విశ్వరూపం-2 వాయిదా!
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన విశ్వరూపం-2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలె ఆటంకాలన్నీ తొలగిపోవటటంతో ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తమిళనాడు దిగ్గజనేత కరుణానిధి మరణంతో చిత్రాన్ని వాయిదా వేయాలని కమల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరుణానిధి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన కమల్ హాసన్.. ఆ తర్వాత భావోద్వేగమైన సందేశాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని వాయిదా వేసేందుకే కమల్ మొగ్గు చూపుతున్నాడంట. ఆగష్టు 15న చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో కమల్ ఉన్నట్లు సమాచారం. రిలీజ్ వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. కమల్ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌తోపాటు, ఆస్కార్ ఫిలింస్ విశ్వరూపం-2 ను సంయుక్తంగా నిర్మించాయి. -
స్టాలిన్‌ను ఓదార్చిన ప్రధాని మోదీ
సాక్షి, చెన్నై: దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే కరుణానిధి భౌతిక కాయానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. బుధవారం ఉదయం చెన్నైకి చేరుకున్న ప్రధాని.. కాసేపటి క్రితం రాజాజీ హాల్‌కు వెళ్లి కలైంగర్ భౌతికా కాయానికి నివాళులర్పించారు. భావోద్వేగంతో ఉన్న కనిమొళి, స్టాలిన్లను ఈ సందర్భంగా మోదీ ఓదార్చారు. మరోవైపు ప్రధానితోపాటు రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకు కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభం కానున్నట్లు డీఎంకే వర్గాలు వెల్లడించాయి.