తండ్రికి తగ్గ తనయుడేనా? | MK Stalin to Take Over the Reins From Karunanidhi | Sakshi
Sakshi News home page

తండ్రికి తగ్గ తనయుడేనా?

Published Thu, Aug 9 2018 3:23 AM | Last Updated on Thu, Aug 9 2018 7:08 AM

MK Stalin to Take Over the Reins From Karunanidhi - Sakshi

కరుణానిధి, స్టాలిన్‌ (ఫైల్‌ ఫొటో)

కరుణ మరణంతో స్టాలిన్‌కు పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు తండ్రికి తగ్గ తనయుడేనని స్టాలిన్‌ను అభిమానులు కీర్తిస్తున్నా ఆయన పార్టీ బాధ్యతల్ని ఎంతవరకు  మోయగలరు? కరుణ అండదండలు, సలహాలు సంప్రదింపులు లేకుండా స్టాలిన్‌ డీఎంకేని తిరిగి అధికారంలోకి తీసుకురాగలరా ? పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపై తీసుకు వచ్చే సామర్థ్యం ఆయనకు ఉందా? ద్రవిడ రాజకీయాల్లో ఇక డీఎంకే పయనమెటు? ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ..

స్టాలిన్‌ వయసు ఇప్పుడు 65 ఏళ్లు.  ఇన్నేళ్లకు ఆయనకు పూర్తిగా పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో 2014 లోక్‌సభ ఎన్నికలు, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్‌ ప్రచార బాధ్యతలు తీసుకున్నప్పటికీ జయలలిత వంటి జనాకర్షక నాయకురాలిని పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోయారు. జయ మరణానంతరం ఏఐఏడీఎంకే చీలిపోవడం, పన్నీర్‌ సెల్వం, పళనిస్వామి ప్రభుత్వాలు బలహీనంగా మారిపోవడంతో స్టాలిన్‌ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది.

అసెంబ్లీలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహరచనలో కొంతవరకు  పై చేయి సాధించగలిగారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఆయన రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో బలంగా చెప్పగలిగే స్థాయికి ఎదిగారు. కరుణానిధి మాదిరిగా అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం స్టాలిన్‌కు లేకపోయినప్పటికీ చెప్పదలచుకున్నదేదో స్పష్టంగా చెప్పగలరు. అలా నెమ్మది నెమ్మదిగా పార్టీపైనా, ప్రజల్లోనూ తన ముద్ర వేయడానికి స్టాలిన్‌ ప్రయత్నాలని చేస్తున్నారు.

ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురు దెబ్బే
జయలలిత మరణానంతరం  పార్టీ రెండుగా చీలిపోయింది. జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే చీలిక వర్గాలు రెండూ తమ అభ్యర్థుల్ని నిలబెట్టడంతో అందరూ డీఎంకేకి లాభం చేకూరుతుందని అంచనా వేశారు.  కానీ ఎవరూ ఊహించని రీతిలో శశికళ మద్దతు వర్గం అభ్యర్థి దినకరన్‌ విజయకేతనం ఎగురవేశారు.

ఎదురయ్యే సవాళ్లు
► ఒకవైపు దిగ్గజ నేతలైన జయలలిత, కరుణానిధిల మరణం, మరోవైపు రజనీకాంత్, కమలహాసన్‌ వంటి సినీ దిగ్గజాలు పొలిటికల్‌ స్టార్‌లుగా మారడం వంటి పరిణామాలతో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఊహకు అందకుండా ఉంది.  

► ఇన్నాళ్లూ కరుణ అండదండలు ఉండడంతో అళగిరి మద్దతుదారుల్ని తనవైపునకు తిప్పుకోగలిగిన స్టాలిన్‌ ఇకపై సోదురుడిని ఎదుర్కోవడం కూడా ఒక సవాలే.  ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల ఓటమి సమయంలోనే బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కిన అళగిరి అడుగులు ఎటు వేస్తారో ఇప్పుడే చెప్పలేం.  

► 1976–96 మధ్యకాలంలో డీఎంకే ఏకంగా 18 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కరుణానిధి తనకున్న నాయకత్వ పటిమతో డీఎంకే ఎక్కడా పట్టు కోల్పోకుండా చేయగలిగారు. ఇప్పుడున్న సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో మరోసారి పార్టీ ఓడిపోతే దాని భవిష్యత్‌ ఏమిటో చెప్పలేం.∙స్టాలిన్‌ మరి తనపై ఉన్న అతి పెద్ద బాధ్యతను ఎంతవరకు నెరవేర్చగలరో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలుస్తుంది.


బలాలు
► కరుణానిధి స్వయంగా వారసుడిగా ప్రకటించడం
► ప్రజల్లో విస్తృతంగా తిరగడం
► పార్టీ కేడర్‌పై పట్టు సాధించడం


బలహీనతలు
► మంచి వక్త కాకపోవడం
► ప్రజాకర్షణ అంతగా లేదు..
► తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారనే చెడ్డపేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement