తమిళనాడు శోకసంద్రంలో మునిగిఉన్న గత అర్థరాత్రి ఎంకె స్టాలిన్ తన తండ్రి కరుణానిధి ఆశీర్వాదాలను కోరుతూ ఆయనకు తమిళంలో రాసిన ఓ రాత ప్రతి ఫోటోని పోస్ట్ చేశారు. అప్పా అని సంభోదిస్తూ ఆ లేఖ ఉద్విగ్నభరితంగా సాగింది.
ఆ లేఖ సారాంశం ఇదీ..
ఇంటి నుంచి అడుగు బయట పెట్టినప్పుడల్లా తిరిగెప్పుడొస్తావో చెప్పిమరీ వెళ్ళే వారే! అలాంటిది ఒక్క మాటైనా నాతో చెప్పకుండా ఎలా నన్ను విడిచి వెళ్ళారు? తలైవా! ఓ నాయకుడా! మీరు నా మనస్సులోనూ, నా శరీరంలోనూ, నాలో ప్రవహించే ప్రతిరక్తబిందువులోనూ, నా ఆలోచనల్లోనూ, నా హృదయస్పందనలోనూ నాలోని అణువణువునా మీరే..నాలో భాగమైన మీరు మమ్మల్ని వీడి ఎక్కడికెళ్ళారు?
‘‘విరామం లేకుండా, అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తి ఇప్పుడిక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు’’
అంటూ సరిగ్గా ముప్ఫయ్ మూడేళ్ళ క్రితం మీ స్మృతి చిహ్నాన్ని మీరే లిఖించుకున్నారు. నిజంగా మీరు తమిళులకు చేయాల్సిందంతా చేసివెళుతున్నానన్న సంతృప్తితో వెళ్ళారా? తొమ్మిదిన్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రజాజీవితంలో మీదైన ముద్రవేసి ఎక్కడదాగుంటారు? మీరు సాధించినదానికి మించి ఎవరుచేస్తారా అని ఎదురుచూస్తున్నాం!
జూన్ 3న తిరువరూర్ ఇసుకతిన్నెల్లో నీ తొంభయ్యైదవ పుట్టిన రోజు వేడుకల్లో నీలోని శక్తిని సగం నాకిమ్మని కోరాను. దానితో పాటు నీకు బహుతిగా ఇచ్చిన అన్నాదురై హృదయాన్ని కూడా నాకిస్తావా నాన్నా! అది నువ్వు నాకివ్వగలవా ఓ నా నాయకుడా!
అదివ్వగలిగితే ఆ బహుమానంతో నీ కలలనూ, నీ ఆకాంక్షలనూ పరిపూర్తిచేస్తా!
ఇక్కడే లక్షలాది మంది జనం మీకోసం తపిస్తున్నారు. ఆ జన హృదయ స్పందన మీకోసమే!
వేనవేల వసంతాల పాటు తమిళ ప్రజల స్ఫూర్తిని సుస్థిరం చేసే ఆ మాటలను మీరు మళ్ళీ ఒక్కసారి... ఒకే ఒక్కసారి మాట్లాడండి నాన్నా!
’’ఉయైరినమ్ మేలన ఉదన్ పిరప్పు గలే ’’ నా జీవితం మొత్తంలో నిన్ను నాన్నా అని కాకుండా తలైవర్ (లీడర్) అని పిలిచిన నాకు యిప్పుడెందుకో ’నాన్నా’ అని పిలవాలనిపిస్తోంది నాన్నా!
ఓ నా ప్రియతమ నాయకుడా నిన్ను ఒక్కసారి, దయచేసి ఒకేఒక్కసారి నాన్నా అని పిలవమంటారా!
నీలో సగం నాకివ్వు నాన్నా!
Published Thu, Aug 9 2018 3:44 AM | Last Updated on Thu, Aug 9 2018 3:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment