karunanidi
-
కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన మమత
చెన్నై: కరుణానిధి ప్రథమ వర్థంతి సందర్భంగా బుధవారం తమిళనాడుకి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడంబాక్కంలోని మురసొలి కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి సీఎం వి. నారాయణసామి తదితరులు హాజరయ్యారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా రావాల్సి ఉన్నా, చివరి నిమిషంలో రాలేకపోయారని తెలిపారు. ఫరూక్ అబ్దుల్లా తన కుమార్తె ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఏడుస్తున్న వీడియోనూ తాను నిన్న చూశానని మమతా పేర్కొన్నారు. కశ్మీర్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఆ వీడియోనే నిదర్శనమని వెల్లడించారు. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమని, ఒక రాష్ట్రంపై నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కానీ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవడం దారుణమని మమత విమర్శించారు. -
మీరు లేని ఎన్ని‘కళా’?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఎక్కడో పుట్టారు. ఎక్కడో పెరిగారు.. రాజకీయాల చెట్టు నీడలో కలిశారు.. ఒకే పార్టీలో ఉంటూ కరచాలనం చేసుకున్నారు.. వేర్వేరు పార్టీల్లో కత్తులూ దూసుకున్నారు.. రాజకీయ రణక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులతో ఓటర్లను ఫిదా చేసింది కొందరైతే, నిండు సభలో కవిత్వపు జల్లులతో పన్నీరులా పలకరించినవారు మరొకరు.. ఎన్నికల సభల్లో హాస్య చతురతతో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసిరి టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు ఫక్కున నవ్వేలా చేసిన నేతలు కొందరైతే.. మహిళలైనా మహారాణుల్లా వెలిగిపోయి సంక్షేమానికి మరో రూపంలా మారింది కొందరు. కాల చక్రంలో గిర్రున అయిదేళ్లు తిరిగిపోయాయ్. జీవిత కాలం చివరి మలుపులో వీడలేమంటూ వీడుకోలంటూ ఒకనాటి రాజకీయ యోధులు ఈసారి ఎన్నికల రణక్షేత్రానికి దూరమయ్యారు. మరణం కొందరినీ, వయోభారం, అనారోగ్యం మరికొందరిని ఈ సార్వత్రిక ఎన్నికలకు దూరం చేశాయి. తమ వ్యక్తిత్వాలతో ఓటర్ల మదిలో మరపురాని తిరిగిరాని గుర్తులను వేసిన రాజకీయ దిగ్గజాలు వాజ్‌పేయి, కరుణానిధి, జయలలిత, మనోహర్ పరికార్ వంటి నేతలు లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. మై డియర్ సర్స్, మేడమ్స్, రాజకీయ ఉద్ధండుల్లారా.. రియల్లీ వి మిస్ యూ.. వాజ్‌పేయి: జోహారోయి రాజకీయానికి – భావ కవిత్వానికి అవినాభావ సంబంధం ఉందని ఎవరైనా అనుకోగలరా? మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి సభలోకి అడుగుపెట్టాక ఆ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆయన మాటే ఒక మంత్రం.. ఆయన ఉపన్యాసం స్వరరాగ కవితా ప్రవాహం. 12 సార్లు పార్లమెంటేరియన్‌గా వాజ్‌పేయి ప్రదర్శించిన రాజనీతిజ్ఞత భావితరాలకు ఆదర్శం. బీజేపీలో వాజ్‌పేయి దళం ఉంది. అద్వానీ దళం ఉంది అని విపక్షాలు విమర్శిస్తే, వాజ్‌పేయి ‘నేను దళ్‌దళ్ (బురద)లో లేను. కానీ బురదలో కమలదళాన్ని వికసింపజేయగలను‘ అంటూ ఎదురుదాడికి దిగిన ఘనత ఆయనది. గత ఏడాది ఆగస్టు 16న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వాజ్‌పేయి వ్యక్తిత్వం చరిత్ర పుటల్లో ఒక పేజీగా మిగిలిపోయింది. రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీగా పేరు సంపాదించిన ఈ అజాతశత్రువు ఇక లేరని తలచుకుంటే అభిమానుల మనుసులు భారమైపోతాయి. వి మిస్ యూ అటల్జీ అంటూ మౌనంగా రోదిస్తాయి. పురుచ్చితలైవి: సంచలనాలేవీ? ఆమెను చూస్తే అమ్మ గుర్తుకు వస్తుంది. ప్రజల ఆకలి తెలుసుకొని కడుపు నింపే అమ్మ. నడిచొచ్చే సంక్షేమానికి నిలువెత్తు రూపం. కుట్రలు, కుతంత్రాలకు నిలయమైన ద్రవిడ నాట ఉక్కు మహిళ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణం ఒక మిస్టరీ. ఆమె సృష్టించారు ఒక హిస్టరీ. రాజకీయాల్లో జయలలిత ప్రభావం, పార్టీపై ఆమె సాధించిన పట్టు ఎంత అంటే 2016లో అనుమానాస్పదంగా జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకేకి సమర్థుడైన నాయకుడు లేక పార్టీ ‘ఆకులు’ ఆకులుగా విడిపోయి ఛిన్నాభిన్నమైంది. జయ లేకుండా తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేయగలదా అన్న సందేహాలతో ఆమె అనుచరగణం కంటతడి పెడుతున్నారు. కరుణానిధి: జ్ఞాపకాల నిధి ద్రవిడ భాషా ఉద్యమ సూరీడు కరుణానిధి. తమిళ రాజకీయాల్లో ఈయనదీ ఒక చరిత్ర. డీఎంకే పార్టీ అధినేతగానే కాదు, పదునైన మాటలతో ఒక సినీ కవిగా ఆయన వేసిన ముద్ర తిరుగులేనిది. స్నేహానికి ప్రాణమిచ్చే కరుణ మనస్తత్వానికి ఎవరైనా తలవంచి జోహార్ అనాల్సిందే. ప్రాణమిత్రుడు ఎంజీఆర్ తన పక్కనే ఆయనకి ఒక పడక సిద్ధం చేశారేమో మరి వయోభారంతోనే నింగికెగిశారు. నిండు జీవితాన్ని గడిపినప్పటికీ కరుణానిధి ఇక లేరన్న వార్త తమిళ తంబిల మనసుల్లో అగ్నిపర్వతాల్ని బద్దలు చేసింది. అందులోంచి లావా ఎప్పటికీ ఎగజిమ్ముతూనే ఉంటుంది. ఆయన జ్ఞాపకాల కన్నీరు ఉబికి వస్తూనే ఉంటుంది. పారికర్: ఎక్స్ట్రార్డినరీ.. రాజకీయాల్లో అతి సామాన్యుడిగా బతికిన అసామాన్యుడు ఎవరైనా ఉన్నారంటే ఠక్కుమని మనోహర్ పారికర్ పేరు చెప్పొచ్చు. గోవా ముఖ్యమంత్రిగా సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లగలరు. జనంతో మనోహరంగా కలిసిపోగలరు. రక్షణ మంత్రిగా సరిహద్దుల్ని సమర్థవంతంగా కాపలా కాయగలరు. అత్యంత కష్టపడే మనస్తత్వంతో పొలిటికల్ బరిలో విజేతగా నిలిచిన ఆయన కేన్సర్ వ్యాధిని జయించలేక ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. మనోహర్ లేకపోవడం నిజంగా బీజేపీకి తీరని లోటే. అడ్వాణీ నుంచి పవార్ వరకు రేసులో లేనివారెందరో.. తన రథయాత్రలతో పెరిగి పెద్దదైన భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతూ కూడా అడ్వాణీని సాధారణ ఓటరుగా మార్చేసింది. 75 ఏళ్ల వయసు దాటిందని సాకుగా చూపించి మురళీ మనోహర్ జోషి వంటి నేతని ఎన్నికలకి దూరం చేసింది. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చే సుష్మా స్వరాజ్ అనారోగ్యం వేధిస్తుంటే తనకు తానుగా ఈ రాజకీయ ప్రహసనం నుంచి తప్పుకున్నారు. దళిత పతాకం మాయావతి తన లక్ష్యమైన మోదీని ఓడించడానికి పోటీకి దూరంగా ఉంటూ ప్రచారానికే పరిమితమయ్యారు.రాజకీయాలను ఓ ఆటాడుకుని, క్రీడల్లోకి రాజకీయాల్ని దట్టించిన మరాఠా యోధుడు శరద్ పవార్ వయోభారం చేతో, వారసుడిని బరిలో నిలపడం వల్లో.. రేసు నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఈ స్వార్వత్రిక ఎన్నికల బరిలో లేనని ప్రకటించి అభిమానుల్ని విస్మయానికి గురి చేశారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి గంగా ప్రక్షాళన చేయడం కోసం ఎన్నికలనే విడిచి పెట్టేశారు. భారతీయ జీవన వేదమైన గంగానదిని కాపాడుకోవడం కోసం ఆమె ఏడాదిన్నర పాటు యాత్ర చేయనున్నారు. లోక్‌జనశక్తి నేత రామ్‌విలాస్ పాశ్వాన్‌ని అనారోగ్యం వేధిస్తోంది. ఎన్నికల్లో పోటీచేసే శక్తి లేక ఆయన కూడా దూరంగా ఉన్నారు.ఇలా అరుదైన రాజకీయ నేతలు బరిలో లేని ఎన్నికలు ఎందరో అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయి. ప్చ్.. అని నిట్టూర్చడం తప్ప ఎవరైనా ఏం చేయగలరు?. -
డీఎంకేలో తిరుగుబాటు!
సాక్షి, చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో మరో తిరుగుబాటుకు తెరలేచింది. డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో పార్టీలో ఆయన కుమారుల మధ్య వారసత్వ పోరు ప్రారంభమైంది. తాజాగా ఆయన కుమారుడు, మాజీ కేంద్రమంత్రి ఎంకే అళగిరి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వారసుల గురించి కరుణానిధి ఏమన్నారో తనకు తెలియదని, ప్రస్తుతం నిజమైన డీఎంకే కార్యకర్తలందరూ తన వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీని నడిపించడానికి తానే సరైన నాయకుడినని చెప్పుకొచ్చారు. స్టాలిన్ కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమేనని, కానీ ఆయన పని (వర్కింగ్) చేయడం లేదని విమర్శించారు. కరుణానిధి మరణంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 14న డీఎంకే కార్యవర్గ సమావేశంలో స్టాలిక్‌కు పట్టాభిషేకం చేయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అళగిరి వ్యాఖ్యాలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో కూడా అళగిరి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ నాయకుడు కరుణానిధి మాత్రమేనని, స్టాలిన్‌ను నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన వర్ణించారు. పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్నారంటూ అళగిరిని 2014 లోక్‌సభ ఎన్నికల ముందు కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అళగిరి బహిష్కరణ కుడా ఒక కారణమని పార్టీలోని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి తిరిగి పుర్వవైభవం తెచ్చేందుకు అళగిరిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని గతంలో స్టాలిన్ భావించారు. దీనికి స్టాలిన్ వర్గంలోని కొందరు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్టాలిన్ వెనుకడుగువేశారు. ప్రస్తుతం అళగిరి వ్యవహర శైలిని డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. కరుణానిధి అంత్యక్రియలు సందర్భంగా అళగిరితో బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జ్ మురళీధర్‌రావు 40 నిమిషాల పాటు ముచ్చటించిన విషయం తెలిసిందే. అదే అంశం డీఎంకే శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతోంది. దీంతో స్టాలిన్ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. స్టాలిన్‌కు పట్టాభిషేకం -
జయలలిత, కరుణానిధికి భారతరత్న?
సాక్షి, చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రులుగా సేవలందిన మాజీ సీఎంలు జయలలిత, కరుణానిధిలకు దేశ అత్యున్నత పురష్కారం భారతరత్న ఇవ్వాలని అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే వ్యవస్థాపక సభ్యులు కరుణానిధికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆ పార్టీ నేత తిరుచ్చి శివ డిమాండ్ చేశారు. కరుణానిధి(94) వయోభారంతో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన రాష్ట్రానికి ఐదుసార్లు సీఎంగా వ్యవహరించారని, తన జీవితంలో 80 ఏళ్లు ప్రజాసేవకే అంకితం చేశారని శివ తెలిపారు. కరుణానిధికి భారతరత్న అవార్డును ప్రకటించి, గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. డీఎంకే ఎంపీ, కరుణా కుమార్తె కనిమొళి కూడా ఈ మేరకు ఢిల్లీలో నేతలను సంప్రదించారు. కాగా అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలితకు భారతరత్న పురష్కారం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. దేశానికి విశేషసేవ అందించిన జయలతిత విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణంలో పెట్టాలని అన్నాడీఎంకే డిమాండ్ చేస్తోంది. జయ 2016 డిసెంబర్లో అనారోగ్య కారణంగా మృతి చెందారు. కాగా ఆ రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకు మాజీ సీఎం, ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్‌కు 1988లో కాంగ్రెస్ ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. -
స్టాలిన్‌కు పట్టాభిషేకం
సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు పార్టీ అధ్యక్షులుగా ప్రమోషన్ లభించనుంది. పార్టీ శ్రేణులంతా కలిసి కరుణానిధి స్థానంలో ఆయనకు పట్టాభిషేకం చేయనున్నారు. ఇందుకు ఈనెల 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నాదురై మరణించడంతో పార్టీలో నంబర్ 2గా ఉన్న కరుణానిధి ఆయన స్థానంలో సులువుగా అధ్యక్షులయ్యారు. అంతేగాక ముఖ్యమంత్రి బాధ్యతలు సైతం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కరుణానిధి తరువాత పార్టీ పీఠం ఎవరిదనే విషయంలో అంతర్గత యుద్ధమే నడిచింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ సైతం 96 ఏళ్ల వృద్ధుడు కావడంతో పార్టీ పగ్గాలను తప్పనిసరిగా కరుణ సంతానానికే అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కరుణ పెద్దకుమారుడు అళగిరి, చిన్నకుమారుడు స్టాలిన్ మధ్య పోటీ నెలకొంది. పార్టీపరంగా దక్షిణ తమిళనాడులో అళగిరి, ఉత్తర తమిళనాడును స్టాలిన్ పంచుకున్నారు. మదురై కేంద్రం చేసుకుని అళగిరి చక్రం తిప్పగా, చెన్నైలో ఉంటూ కరుణకు స్టాలిన్ చేరుయ్యారు. పార్టీ పీఠం ఇద్దరిలో ఎవరికనే అతిముఖ్యమైన అంశంపై అళగిరి సంయమనం పాటించకుండా ఆవేశానికి లోనుకావడం, పార్టీకి చేటుతెచ్చే ప్రకటనలు చేయడం ద్వారా కరుణానిధి హృదయంలో స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. ఒక దశలో విసుగుచెందిన కరుణానిధి.. అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు స్టాలిన్ పార్టీ కార్యక్రమాల పట్ల చురుగ్గా వ్యవహరిస్తూ మంచి వ్యూహకర్తగా కరుణచేతనే కితాబునందుకున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్‌ను నియమించడం ద్వారా తన రాజకీయవారసుడు ఎవరో అనే విషయాన్ని కరుణ చెప్పకనే చెప్పారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘నమక్కు నామే’ (మనకు మనమే) పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించి కేడర్‌ను సమాయత్తం చేశారు. దీని ఫలితంగా రాష్ట్ర చరిత్రలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎన్నడూ లేని విధంగా 89 స్థానాలు సాధించిపెట్టారు. వృద్ధాప్యం మీదపడుతున్నా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కరుణ ప్రచారం చేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్ పనితీరును గమనించి సంతోషించారు. పార్టీని సమర్థవంతంగా నడిపించగల సత్తా స్టాలిన్‌కే ఉందని కరుణ ఆనాడే ప్రకటించారు. తల్లి సిఫార్సుతో మరలా తండ్రికి చేరువకావాలని, పార్టీలోకి ప్రవేశించాలని, అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అళగిరి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్టాలిన్‌కే పట్టం: వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఏడాదిగా చికిత్స పొందుతున్న కరుణానిధి ఈనెల7వ తేదీన కన్నుమూయడంతో వెంటనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు ఏడాదిన్నరకు పైగా స్టాలినే పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. అయితే కరుణ మరణంతో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయిందనే నిర్వేదం శ్రేణుల్లో ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత స్టాలిన్‌పై ఉంది. అంతేగాక వచ్చే ఏడాది రానున్న పార్లమెంటు ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. దీంతో ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు డీఎంకే కార్యవర్గ సమావేశాన్ని పార్టీ ప్రధాన కార్యాలయమైన చెన్నై అన్నాఅరివాలయంలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి అన్బళగన్ శుక్రవారం ప్రకటించారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కార్యవర్గ సభ్యులంతా విధిగా హాజరుకావాలని అన్బగళన్ చెప్పడంతో 14వ తేదీ నాటి సమావేశంలో స్టాలిన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని అందరూ గట్టిగా విశ్వసిస్తున్నారు. పార్టీపరంగా ఎటువంటి చిక్కులు లేకపోవడం స్టాలిన్ ఎన్నిక లాంచనమేనని భావిస్తున్నారు. -
35 ఏళ్ల క్రితం కరుణానిధి సాయం
ముంబై: తమిళభాషపై అపార ప్రేమ ఉన్న కరుణానిధి, తమిళులు ఎక్కడ నుంచి సాయం కోరినా వెంటనే స్పందించేవారు. అన్నిరకాలుగా అదుకునేందుకు ప్రయత్నించేవారు. తాము కోరిన వెంటనే సమావేశానికి వచ్చిన కరుణానిధి, తమిళులకు ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ ఏర్పాటుకు సహకరించారని డీఎంకే ముంబై విభాగం చీఫ్ ఆర్.పళనిస్వామి గుర్తుచేసుకున్నారు. ‘ముంబైలో 1983లో తమిళులంతా కలసి నిర్వహించిన ఓ సమావేశానికి రావాల్సిందిగా మేము కరుణానిధిని ఆహ్వానించాం. ఆయన అందుకు అంగీకరించడమే కాకుండా మేం ఏయే కార్యక్రమాలు చేపడుతున్నామో, మాకు ఏం ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళులు గణనీయంగా ఉన్న ధారావి ప్రాంతంలో కమ్యూనిటీ స్కూల్ లేదనీ, నిధులు లేకపోవడం వల్లే దాని నిర్మాణం చేపట్టలేకపోయామని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. దీంతో స్కూల్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల్ని కరుణానిధి ఆదేశించారు. కేవలం ఆయన తీసుకున్న చొరవతో ఈ ప్రాంతంలో ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ కూడా ఏర్పాటైంది’ అని పళనిస్వామి చెప్పారు. ముంబై సమావేశానికి వచ్చిన సందర్భంగా కరుణ వేలాది మందిని కలుసుకున్నారన్నారు. 2010లోనే ఆసుపత్రి కోసం ఇల్లు దానం చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెన్నై గోపాలపురంలోని ఖరీదైన తన ఇంటిని ఆసుపత్రి స్థాపన కోసం 2010లోనే దానమిచ్చారు. ఆ ఏడాది తన 86వ జన్మదిన వేడుకల సందర్భంగా కరుణానిధి తన కొడుకులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధితోపాటు ఆయన భార్యలు కూడా చనిపోయిన తర్వాత ఈ ఆసుపత్రిని స్థాపించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కరుణానిధి తల్లి పేరిట అన్నై అంజుగమ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, కరుణ కుటుంబసభ్యులతోపాటు కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, ప్రముఖ తమిళ గేయరచయిత వైరముత్తు తదితరులు కూడా ట్రస్ట్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఆసుపత్రికి కలైజ్ఞర్ కరుణానిధి హాస్పిటల్ అని పేరుపెట్టనున్నారు. -
నీలో సగం నాకివ్వు నాన్నా!
తమిళనాడు శోకసంద్రంలో మునిగిఉన్న గత అర్థరాత్రి ఎంకె స్టాలిన్ తన తండ్రి కరుణానిధి ఆశీర్వాదాలను కోరుతూ ఆయనకు తమిళంలో రాసిన ఓ రాత ప్రతి ఫోటోని పోస్ట్ చేశారు. అప్పా అని సంభోదిస్తూ ఆ లేఖ ఉద్విగ్నభరితంగా సాగింది. ఆ లేఖ సారాంశం ఇదీ.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టినప్పుడల్లా తిరిగెప్పుడొస్తావో చెప్పిమరీ వెళ్ళే వారే! అలాంటిది ఒక్క మాటైనా నాతో చెప్పకుండా ఎలా నన్ను విడిచి వెళ్ళారు? తలైవా! ఓ నాయకుడా! మీరు నా మనస్సులోనూ, నా శరీరంలోనూ, నాలో ప్రవహించే ప్రతిరక్తబిందువులోనూ, నా ఆలోచనల్లోనూ, నా హృదయస్పందనలోనూ నాలోని అణువణువునా మీరే..నాలో భాగమైన మీరు మమ్మల్ని వీడి ఎక్కడికెళ్ళారు? ‘‘విరామం లేకుండా, అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తి ఇప్పుడిక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు’’ అంటూ సరిగ్గా ముప్ఫయ్ మూడేళ్ళ క్రితం మీ స్మృతి చిహ్నాన్ని మీరే లిఖించుకున్నారు. నిజంగా మీరు తమిళులకు చేయాల్సిందంతా చేసివెళుతున్నానన్న సంతృప్తితో వెళ్ళారా? తొమ్మిదిన్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రజాజీవితంలో మీదైన ముద్రవేసి ఎక్కడదాగుంటారు? మీరు సాధించినదానికి మించి ఎవరుచేస్తారా అని ఎదురుచూస్తున్నాం! జూన్ 3న తిరువరూర్ ఇసుకతిన్నెల్లో నీ తొంభయ్యైదవ పుట్టిన రోజు వేడుకల్లో నీలోని శక్తిని సగం నాకిమ్మని కోరాను. దానితో పాటు నీకు బహుతిగా ఇచ్చిన అన్నాదురై హృదయాన్ని కూడా నాకిస్తావా నాన్నా! అది నువ్వు నాకివ్వగలవా ఓ నా నాయకుడా! అదివ్వగలిగితే ఆ బహుమానంతో నీ కలలనూ, నీ ఆకాంక్షలనూ పరిపూర్తిచేస్తా! ఇక్కడే లక్షలాది మంది జనం మీకోసం తపిస్తున్నారు. ఆ జన హృదయ స్పందన మీకోసమే! వేనవేల వసంతాల పాటు తమిళ ప్రజల స్ఫూర్తిని సుస్థిరం చేసే ఆ మాటలను మీరు మళ్ళీ ఒక్కసారి... ఒకే ఒక్కసారి మాట్లాడండి నాన్నా! ’’ఉయైరినమ్ మేలన ఉదన్ పిరప్పు గలే ’’ నా జీవితం మొత్తంలో నిన్ను నాన్నా అని కాకుండా తలైవర్ (లీడర్) అని పిలిచిన నాకు యిప్పుడెందుకో ’నాన్నా’ అని పిలవాలనిపిస్తోంది నాన్నా! ఓ నా ప్రియతమ నాయకుడా నిన్ను ఒక్కసారి, దయచేసి ఒకేఒక్కసారి నాన్నా అని పిలవమంటారా! -
తండ్రికి తగ్గ తనయుడేనా?
కరుణ మరణంతో స్టాలిన్‌కు పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు తండ్రికి తగ్గ తనయుడేనని స్టాలిన్‌ను అభిమానులు కీర్తిస్తున్నా ఆయన పార్టీ బాధ్యతల్ని ఎంతవరకు మోయగలరు? కరుణ అండదండలు, సలహాలు సంప్రదింపులు లేకుండా స్టాలిన్ డీఎంకేని తిరిగి అధికారంలోకి తీసుకురాగలరా ? పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపై తీసుకు వచ్చే సామర్థ్యం ఆయనకు ఉందా? ద్రవిడ రాజకీయాల్లో ఇక డీఎంకే పయనమెటు? ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ.. స్టాలిన్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు. ఇన్నేళ్లకు ఆయనకు పూర్తిగా పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో 2014 లోక్‌సభ ఎన్నికలు, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ ప్రచార బాధ్యతలు తీసుకున్నప్పటికీ జయలలిత వంటి జనాకర్షక నాయకురాలిని పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోయారు. జయ మరణానంతరం ఏఐఏడీఎంకే చీలిపోవడం, పన్నీర్ సెల్వం, పళనిస్వామి ప్రభుత్వాలు బలహీనంగా మారిపోవడంతో స్టాలిన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. అసెంబ్లీలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహరచనలో కొంతవరకు పై చేయి సాధించగలిగారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో బలంగా చెప్పగలిగే స్థాయికి ఎదిగారు. కరుణానిధి మాదిరిగా అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం స్టాలిన్‌కు లేకపోయినప్పటికీ చెప్పదలచుకున్నదేదో స్పష్టంగా చెప్పగలరు. అలా నెమ్మది నెమ్మదిగా పార్టీపైనా, ప్రజల్లోనూ తన ముద్ర వేయడానికి స్టాలిన్ ప్రయత్నాలని చేస్తున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురు దెబ్బే జయలలిత మరణానంతరం పార్టీ రెండుగా చీలిపోయింది. జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే చీలిక వర్గాలు రెండూ తమ అభ్యర్థుల్ని నిలబెట్టడంతో అందరూ డీఎంకేకి లాభం చేకూరుతుందని అంచనా వేశారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో శశికళ మద్దతు వర్గం అభ్యర్థి దినకరన్ విజయకేతనం ఎగురవేశారు. ఎదురయ్యే సవాళ్లు ► ఒకవైపు దిగ్గజ నేతలైన జయలలిత, కరుణానిధిల మరణం, మరోవైపు రజనీకాంత్, కమలహాసన్ వంటి సినీ దిగ్గజాలు పొలిటికల్ స్టార్లుగా మారడం వంటి పరిణామాలతో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఊహకు అందకుండా ఉంది. ► ఇన్నాళ్లూ కరుణ అండదండలు ఉండడంతో అళగిరి మద్దతుదారుల్ని తనవైపునకు తిప్పుకోగలిగిన స్టాలిన్ ఇకపై సోదురుడిని ఎదుర్కోవడం కూడా ఒక సవాలే. ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఓటమి సమయంలోనే బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కిన అళగిరి అడుగులు ఎటు వేస్తారో ఇప్పుడే చెప్పలేం. ► 1976–96 మధ్యకాలంలో డీఎంకే ఏకంగా 18 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కరుణానిధి తనకున్న నాయకత్వ పటిమతో డీఎంకే ఎక్కడా పట్టు కోల్పోకుండా చేయగలిగారు. ఇప్పుడున్న సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో మరోసారి పార్టీ ఓడిపోతే దాని భవిష్యత్ ఏమిటో చెప్పలేం.∙స్టాలిన్ మరి తనపై ఉన్న అతి పెద్ద బాధ్యతను ఎంతవరకు నెరవేర్చగలరో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలుస్తుంది. బలాలు ► కరుణానిధి స్వయంగా వారసుడిగా ప్రకటించడం ► ప్రజల్లో విస్తృతంగా తిరగడం ► పార్టీ కేడర్‌పై పట్టు సాధించడం బలహీనతలు ► మంచి వక్త కాకపోవడం ► ప్రజాకర్షణ అంతగా లేదు.. ► తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారనే చెడ్డపేరు -
కరుణానిధిని చూసి ఎంతో నేర్చుకున్నాం
-
సాయంత్రం 4గంటలకు అంతిమయాత్ర ప్రారంభం
-
కరుణానిధికి పార్లమెంట్ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి పార్లమెంట్ ఘనంగా నివాళులర్పించింది. పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో సభ్యులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. రాజ్యసభ సైతం గురువారానికి వాయిదా వేశారు. కాగా మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణానిధి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం చెన్నైలోని మెరీనా బీచ్‌లో నిర్వహించనున్నారు. కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతిస్తూ బుధవారం ఉదయం తీర్పునిచ్చింది. -
విశ్వరూపం-2 వాయిదా!
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన విశ్వరూపం-2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలె ఆటంకాలన్నీ తొలగిపోవటటంతో ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తమిళనాడు దిగ్గజనేత కరుణానిధి మరణంతో చిత్రాన్ని వాయిదా వేయాలని కమల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరుణానిధి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన కమల్ హాసన్.. ఆ తర్వాత భావోద్వేగమైన సందేశాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని వాయిదా వేసేందుకే కమల్ మొగ్గు చూపుతున్నాడంట. ఆగష్టు 15న చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో కమల్ ఉన్నట్లు సమాచారం. రిలీజ్ వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. కమల్ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌తోపాటు, ఆస్కార్ ఫిలింస్ విశ్వరూపం-2 ను సంయుక్తంగా నిర్మించాయి. -
హైకోర్టు తీర్పు : కన్నీటి పర్యంతమైన స్టాలిన్
చెన్నై : డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగిపోయాయి. చెన్నై మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మెరీనా-అన్నా స్క్వేర్ వద్దనే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హైకోర్టు వెలువడిన అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు కేసులు, నిబంధనలు సాకుగా చూపి మెరీనా బీచ్‌లో స్థల కేటాయింపులకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై డీఎంకే నేతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిపేలా అనుమతి ఇవ్వాలని కోరారు. మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలకు స్థల కేటాయింపుపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. గతంలో జానకీ రామచంద్రన్ అంత్యక్రియల విషయంలో డీఎంకే అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. ప్రోటోకాల్ విషయంలో సిట్టింగ్, మాజీ సీఎంలు ఒకటి కాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వాదనను డీఎంకే న్యాయవాది తప్పుపట్టారు. ద్రవిడ నేతల సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుపాలని డీఎంకే న్యాయవాది కోరారు. లేదంటే ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుందని డీఎంకే న్యాయవాది తెలిపారు. అయితే సెంటిమెంట్ల ఆధారంగా నిర్ణయం తీసుకోలేమని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రాత్రికి రాత్రే మేనేజ్ చేసి, మెరీనా బీచ్‌లో పలువురి స్మారకాలపై అంతకముందు దాఖలు అయిన పిటిషన్లను డీఎంకే ఉపసంహరించేలా చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. మేనేజ్ చేశారనే వాదనపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు డీఎంకే వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ సుందర్, కరుణానిధి అంత్యక్రియలు వారం పాటు వాయిదా వేద్దామా..?అంటూ సీరియస్‌గా వ్యాఖ్యానించారు. కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగేలా తీర్పునిచ్చారు. హైకోర్టు తీర్పుపై డీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. మద్రాస్ హైకోర్టు తీర్పు విన్న అనంతరం కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. కాగ, గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి, మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు కన్నుమూశారు. కరుణానిధి మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం కరుణానిధి పార్థీవదేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం రాజాజి హాల్లో ఉంచారు. -
నగరి ప్రాంతంలో కరుణానిధి జ్ఞాపకాలు
చిత్తూరు, పుత్తూరు/విజయపురం: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు అన్న వార్త వినగానే నగరి ప్రాంతంలోని డీఎంకే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ద్రవిడ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే తమిళనాట నాస్తికుడిగా, అభ్యుదయ భావాలకు నిలువెత్తు రూపంగా రాజకీయ అరంగేట్రం చేసిన కరుణకు రాష్ట్ర సరిహద్దులోని నగరి ప్రాంతంలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. నగరితో ప్రత్యేక అనుబంధం.. 1949వ సంవత్సరంలో పార్టీ పెట్టినప్పుడే నగరిలో డీఎంకే జెండా ఎగిరింది. ఏకాంబరకుప్పంకు చెందిన మునస్వామి నగరిలో డీఎంకే పార్టీ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి మునస్వామి మృతి చెందే వరకు ఆయనే ఆంధ్రప్రదేశ్ డీఎంకే రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. కరుణానిధి నాలుగుసార్లు నగరిలో పర్యటించారు. తొలిసారి 1952వ సంవత్సరంలో నగరిలో డీఎంకే పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. 1972లో సీఎస్ఐ ఆసుపత్రి వర్గాల ఆహ్వానం మేరకు నగరికి వచ్చారు. 1986లో తన రాజకీయ గురువు అన్నాదొరై విగ్రహావిష్కరణ కోసం నగరికి వచ్చారు. చివరగా 1994లో నగరి పట్టణంలోని సత్రవాడలో ఏర్పాటు చేసిన డీఎంకే పార్టీ సమావేశానికి హాజరయ్యారు. 1970లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి జ్ఞానప్రకాష్ తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు డీఎంకే నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఆర్థిక సాయం అందించిన కరుణానిధి.. నగరి ప్రాంతానికి చెందిన సుమారు 50 మందికి కరుణానిధి ఆర్థిక సహాయాన్ని అందించారు. నగరి ప్రాంతానికి చెందిన మునస్వామి కుటుంబంతో కరుణకు విడదీయరాని అనుబంధం ఉంది. మునస్వామి బతికి ఉన్నంత వరకు ఆయన్నే రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగించారు. గత ఏడాది మునస్వామి మృతి చెందితే కరుణానిధి కుమారుడు స్టాలిన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రస్తుతం మునస్వామి కుమారుడు మూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించి వారి కుటుంబం పట్ల ఉన్న అనుబంధాన్ని కొనసాగించారు. నగరి ప్రాంతానికి చెందిన కార్యకర్తలు కరుణను కలిసిన ప్రతిసారీ ఆప్యాయంగా పలకరించేవారని వారు గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో కరుణానిధి మేరుపర్వతం అని ఆయన అభిమానులు పోలుస్తుంటారు. కరుణ అస్తమించడం డీఎంకే శ్రేణులు జీర్ణించుకోలేకున్నాయి. తమిళనాడుకు ఆర్టీసీ బస్సులు బంద్ తిరుపతి సిటీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత డాక్టర్ కరుణానిధి మృతితో తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను మంగళవారం రాత్రి 7 గంటల నుంచి నిలిపివేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అవాంఛనీయ సంఘటనలతో ఆర్టీసీకి నష్టం కలిగిస్తారనే ఉద్దేశంతో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు బస్సులను రద్దు చేశారు. అదే విధంగా తమిళనాడు నుంచి ఏపీలోని పలు జిల్లాలకు వ చ్చే తమిళనాడు ఆర్టీసీ బస్సులను కూడా సాయంత్రం 6గంటల నుంచే నిలిపివేశారు. తిరుపతి నుంచి వేలూరు, తిరుత్తణి, తిరువణ్ణామలై, కోయంబత్తూరు, సేలం, చెన్నై, పాండిచ్చేరీ, మధురై, కాంచీపురం తదితర పట్టణాలకు వెళ్లే బస్సులన్నింటిని పూర్తిగా రద్దు చేసినట్లు తిరుపతి ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం భాస్కర్‌రెడ్డి తెలిపారు. తమిళనాడు పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే బస్సులు నడుపుతామని అన్నారు. జిల్లా సరిహద్దు ప్రాం తాలైన ఊతుకోట, నగరి, నరహరిపేట, కుప్పం వరకు బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అవస్థలు పడ్డ ప్రయాణికులు.. తమిళనాడుకు ఆర్టీసీ బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన తమిళనాడు భక్తులు బస్సులు రద్దు కావడంతో ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలను మాట్లాడుకుని వెళ్లారు. దక్షిణ భారత సంప్రదాయాలను కాపాడిన ఏకైక వ్యక్తి– వైఎస్సార్ సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి తిరుపతి అన్నమ య్య సర్కిల్ : తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి 14వ ఏట నుంచి రాజకీయాల్లోకి ప్రవేశిం చారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. దేశానికి దక్షిణ భారతీయం గురించి తెలియజేసిన రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి. కేంద్ర ప్రభుత్వం ఉత్తర దేశ సంప్రదాయాలను దక్షిణ భారతీయులకు అంటగట్టాలని ప్రయత్నించినప్పుడు దరిచేరనివ్వకుండా కాపాడారు. దక్షిణ భారత సంప్రదాయాలను కాపాడిన వ్యక్తి కరుణానిధి. సరిహద్దుల్లో అలెర్ట్ చిత్తూరు అర్బన్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత కరుణానిధి మృతి పట్ల జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాలు తమిళనాడుకు సరిహద్దులో ఉండటం వల్ల డీఎంకేకు చెందిన కార్యకర్తలు, మద్దతు దారుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని చిత్తూరు, తిరుపతి ఎస్పీలు రాజశేఖర్‌బాబు, అభిషేక్ మొహంతిలు ఆయా సబ్ డివిజన్ల డీఎస్పీలను ఆదేశించారు. -
కరుణానిధికి పలువురి ప్రముఖుల నివాళి
-
‘తమిళుల బలమైన గొంతు ఆయన’
చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కరుణానిధి తన జీవితాన్ని పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తనకు చాలాసార్లు కరుణానిధితో మాట్లాడే అవకాశం దొరికిందన్నారు. ఆయన ఎప్పుడు ప్రజల సంక్షేమం గురించి, పాలన గురించే చర్చించే వారని తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తూనే, దేశాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. తమిళనాడు, తమిళుల తరపున కరుణానిధి తన గొంతును వినిపించే వారన్నారు. అంతేకాక ఎమర్జెన్సీ పరిస్థితులను ఆయన చాలా బలంగా వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నారు. Kalaignar Karunanidhi stood for regional aspirations as well as national progress. He was steadfastly committed to the welfare of Tamils and ensured that Tamil Nadu’s voice was effectively heard. pic.twitter.com/l7ypa1HJNC — Narendra Modi (@narendramodi) August 7, 2018 మోదీ గత ఏడాది నవంబర్‌లో కరుణానిధిని కలిశారు. ఒక స్థానిక పత్రిక వజ్రోత్సవ వేడుకలకు హాజరయిన మోదీ, ఆఖరు నిమిషయంలో గోపాలపురంలో ఉన్న కరుణానిధిని కలిశారు. ఆ రోజు మోదీ దాదాపు 20 నిమిషాల పాటు కరుణానిధితో ముచ్చటించారు. ఆయన భార్య దయాళు అమ్మళ్, రజథి అమ్మల్లను కలిశారని కరుణానిధి కుమార్తె కనిమొళి తెలిపారు. మోదీ ఆయనను కలవడం అదే చివరిసారి. మోదీ రేపు ఉదయం చెన్నై రానున్నట్లు సమాచారం. -
నెరవేరిన కరుణానిధి చిరకాల కోరిక
సాక్షి, చెన్నై : తమిళనాడు మధురైలోని ఓ ఆలయంలో బ్రాహ్మనేతర పూజారిని నియమించడం ద్వారా ఆలయ అధికారులు కులనిర్మూలన దిశగా ఒక ముందడుగేశారు. దీంతో తమిళ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి చిరకాల కోరిక నెరవేరినట్లయింది. ఆలయంలో బ్రాహ్మణేతర పూజారులను నియమించడం తమిళనాడులో ఇదే తొలిసారి. 1970లో కరుణానిధి సీఎంగా ఉన్నకాలంలో బీసీ (బ్రాహ్మనేతర) కులాల వారికి కూడా ఆలయ పూజారులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలోని దేవాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై 2006లో మరోసారి సమీక్ష నిర్వహించిన కరుణానిధి.. అర్చకులుగా శిక్షణ పొందేందుకు ఆరునెలల సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సు చేసిన అన్ని కులాల వారికి దేవాలయాల్లో పూజారులుగా అవకాశం కల్పించాలని భావించారు. డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి సుప్రీంకోర్టు తప్పపట్టింది. కోర్టు తీర్పుపై అప్పట్లో కరుణానిధి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కులాలకు సామాజిక న్యాయం చేకురాలనే పెరియార్ రామస్వామి ఆశయం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల డిమాండ్ మేరకు 2015లో ఆలయంలో అర్చకుల నియామకాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆగమశాస్త్రం నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు ఉండకూడదని సుప్రీం సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆరు నెలలపాటు అర్చకత్వ కోర్సులో శిక్షణపొందిన వారిని దేవాదాయశాఖ పూజారులుగా నియమించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కరుణానిధికి ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారని డీఎంకే వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
చెన్నైలో సీఎం కేసీఆర్
-
డీఎంకే అధినేత కరుణానిధి క్రికెట్ ఆడారు.
-
కరుణానిధితో రజనీకాంత్ భేటీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు రజనీకాంత్ బుధవారం డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కలుసుకున్నారు. చెన్నైలో గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లిన రజనీ ఆయనతో సుమారు 20 నిమిషాలు ముచ్చటించారు. కరుణానిధి వెంట ఆయన కొడుకు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఉన్నారు. ఆ తరువాత రజనీ మీడియాతో మాట్లాడుతూ...కరుణానిధి తనకు స్నేహితుడని, మర్యాదపూర్వకంగా కలిశానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నందున ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. ఈనెల 14వ తేదీన రజనీకాంత్ తన పార్టీ పేరు, చిహ్నం, జెండా ప్రకటిస్తారని అంచనా వేస్తున్న తరుణంలో కరుణానిధిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ చెప్పినట్లు వెల్లడించారు. ద్రవిడ సిద్ధాంతాన్ని నిర్వీర్యం చేసేందుకే రజనీ పార్టీ పెట్టారని కొందరు చిత్రీకరిస్తున్నారని, ఇది ఎవరి వల్లా సాధ్యం కాదని అన్నారు. -
నిర్దోషులుగా తేలిన తర్వాత తొలిసారి చెన్నైకి..
సాక్షి, చెన్నై: 2జీ స్పెక్ట్రం కేసులో నిర్దోషులుగా తేలిన కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి శనివారం డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా 17 మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో చెన్నైకి వచ్చిన కనిమొళి, రాజా ర్యాలీగా బయలుదేరి వెళ్లి కరుణానిధిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరికి పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ స్టాలిన్, సీనియర్ నాయకులతో సహా వేలమంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యూపీఏ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా మొత్తం 17మంది మీద సీబీఐ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు సరైన ఆధారాలను సీబీఐ సమర్పించలేదంటూ.. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామి. గతకొంత కాలంగా డీఎంకేను 2జీ స్పెక్ట్రం కేసు వేధిస్తోంది. ఈ కేసులో రాజా సంవత్సరకాలం పాటు జైలులో గడపగా, కరుణానిధి కుమారై కనిమొళి ఏడునెలల పాటు జైలులో ఉన్నారు. ఈ కేసు కారణంగా కరుణానిధి గత ఎన్నికల్లో అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు డీఎంకేకు అనుకూలంగా తీర్పు రావడంతో పార్టీ శ్రేణులు ఆనందంతో ఉన్నారు. కరుణానిధి అనారోగ్యం కారణంగా ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కనిమొళి నిర్దోషిగా తేలడంతో ప్రత్యక్ష రాజకీయాలలో ఆమె చురుగా పాల్గొనే అవకాశముందని మద్దతుదారులు భావిస్తున్నారు. -
ఘనంగా స్టార్ హీరో కూతురి వివాహం
కోలీవుడ్ హీరో ‘చియాన్’ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం సోమవారం ఉదయం చెన్నైలో పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. కెవిన్‌కేర్ గ్రూప్ అధినేత సీకే రంగనాథన్ కుమారుడు రంజిత్‌తో అక్షిత వివాహం జరిగింది. కాగా, మను రంజిత్ ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు ముత్తు మనవడు. వీరి వివాహం కరుణానిధి నివాసంలో నిరాడంబరంగా జరగడం గమనార్హం. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న అక్షిత, రంజిత్‌లు పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహ వేడుక చెన్నైలోని గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా తమిళ సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి రిసెప్షన్ మంగళవారం చెన్నైలోని మేయర్ రామనాథన్ హాల్లో జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు అవనున్నారు. #ChiyaanVikram Daughter Marriage 😍😍 pic.twitter.com/KHvTxSiZ83 — Vikram◇ Deepika♧ (@Sams0007) 30 October 2017 -
నవంబర్ 1న స్టార్ హీరో కూతురి వివాహం
కోలీవుడ్ హీరో ‘చియాన్’ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం నవంబర్ 1న జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు అవుతున్నారు. సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుటుంబానికి చెందిన మను రంజిత్, అక్షిత ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారు. కాగా, మను రంజిత్ ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు ముత్తు మనవడు. ఇప్పటికే విక్రమ్ కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. విక్రమ్ కూడా షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకొని కూతురి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. -
బాహ్య ప్రపంచంలోకి కరుణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏడాదికిపైగా ఇంటికే పరిమితమైన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి(93) గురువారం బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఏడాదిగా ఎవరినీ కలవడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరుకావడం లేదు. కరుణానిధి సోదరి భర్త మురసోలిమారన్ తన పేరుతో పెట్టిన పార్టీ పత్రిక ‘మురసొలి’ 75 వ వార్షికోత్సవ వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకూ కరుణ రాలేదు. ఈ సందర్భంగా కోడంబాక్కంలోని పత్రిక కార్యాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు గురువారం రాత్రి కరుణానిధి కార్యాలయానికి వచ్చారు. ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన కరుణానిధి మైనపు బొమ్మను ఆయన ఆసక్తిగా తిలకించి విజిటర్స్ రిజిస్టర్లో సంతకం చేశారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కరుణ వెంట వచ్చారు. -
‘కరుణ’ చూపుతారా?
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. డీఎంకే అధినేత కరుణానిధిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకే మెజార్టీ ప్రజలు మొగ్గుచూపుతున్నారని లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వే స్పష్టం చేసింది. తమిళనాడులో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు సర్వే నిర్వహిస్తున్నారు. ఎక్కువ సార్లు వీరి సర్వేకు తగినట్లుగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు, పన్పాడు మక్కల్ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజాభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే వివరాలను సోమవారం చెన్నైలో మీడియాకు వివరించారు. రాబోవు ఎన్నికలపై గత ఏడాది నవంబరు 25వ తేదీ నుంచి డిసెంబరు 25వ తేదీ వరకు సర్వే చేశారు. ఈ సర్వేలో 5176 మంది పాల్గొని ప్రజల మనోగతాలను తెలుసుకున్నారు. మద్యం అమ్మకాలు ప్రధాన సమస్యగా 25.8 శాతం మంది, ప్రభుత్వ శాఖల్లో అవినీతి 9.9 శాతంగా పేర్కొన్నారు. అలాగే తాగునీటి సమస్యపై 10.5, రోడ్డు వసతిపై 11.9 శాతం, వ్యవసాయ రుణాలపై 10.7శాతం, నిరుద్యోగంపై 15.6 శాతం స్పందించారు. ఈ స్థితిలో ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో డీఎంకే 33.9 శాతం, అన్నాడీఎంకే 31.5 శాతం, డీఎండీకే 14.4 శాతం, పీఎంకే 9.9 శాతం, ఎండీఎంకే 8.0 శాతంగా ఉన్నాయి. గత నాలుగున్నర సంవత్సరాల అన్నాడీఎంకే పాలన బాగుందని 32.5 శాతం మంది, ఘోరంగా ఉందని 39.3 శాతం మంది చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపెట్టుకుంటాయని 29 శాతం మంది, ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొట్టిపారేయలేమని 20 శాతం మంది, అవకాశం లేదని 39 మంది చెప్పారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా మరోపార్టీలు లే వని 56.4 శాతం మంది పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలోకి రావాలని 50 శాతం, మిశ్రమ పార్టీల ప్రభుత్వం రావాలని 29 శాతం మంది ఆశించారు. ముఖ్యమంత్రి బాధ్యతల నిర్వహణలో సామర్థ్యాలపై ప్రశ్నించగా కరుణానిధికి 70.99 శాతం, స్టాలిన్‌కు 69.61, జయలలిత 65.99, విజయకాంత్ 31.73, అన్బుమణి 25.70, రాందాస్ 20.45, వైగో 18.79, తిరుమావళవన్ 18.75, జీకే వాసన్ 18.24, సీమాన్ 17.38 శాతంగా చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఎవరికి ఓటువేస్తారనే ప్రశ్నకు...డీఎంకే 35.6, అన్నాడీఎంకే 33.1, డీఎండీకే 6.0, ఎండీఎంకే 3.9, పీఎంకే 3.9 బీజేపీ 3.8, కాంగ్రెస్ 2.0, చెప్పలేమని 8 శాతం మంది పేర్కొన్నారు. జయపాలన కొనసాగాలా అనే ప్రశ్నకు వద్దని 38.8 శాతం, కొనసాగాలని 10.2 శాతం బదులిచ్చారు. రాబోవు ఎన్నికల్లో మూడో కూటమి గనుక ఓట్లను చీలిస్తే అన్నాడీఎంకే అనుకూలంగా మారుతుందని తేలింది. స్టాలిన్ చేపట్టిన నమక్కు నామే పర్యటన అతనిపై ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించింది. విద్యాధికులైన యువతకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటులు ప్రత్యేకంగా పార్టీ పెడితే ఎవరిని ఆదరిస్తారనే ప్రశ్నకు రజనీకాంత్‌కు 17.2 శాతం, కమలహాసన్ 10, విజయ్ 5, సీమాన్ 1 శాతం గా బదులిచ్చారు. తమిళనాడులో ప్రధాని నరేంద్రమోడీ పాలన ప్రభావంపై 30 మంది తృప్తిగా ఉందని, అసంతృప్తిగా ఉందని 65 శాతం మంది పేర్కొన్నారు.