
కరుణానిధికి నమస్కరిస్తున్న రజనీకాంత్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు రజనీకాంత్ బుధవారం డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కలుసుకున్నారు. చెన్నైలో గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లిన రజనీ ఆయనతో సుమారు 20 నిమిషాలు ముచ్చటించారు. కరుణానిధి వెంట ఆయన కొడుకు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఉన్నారు. ఆ తరువాత రజనీ మీడియాతో మాట్లాడుతూ...కరుణానిధి తనకు స్నేహితుడని, మర్యాదపూర్వకంగా కలిశానని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి రాబోతున్నందున ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. ఈనెల 14వ తేదీన రజనీకాంత్ తన పార్టీ పేరు, చిహ్నం, జెండా ప్రకటిస్తారని అంచనా వేస్తున్న తరుణంలో కరుణానిధిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ చెప్పినట్లు వెల్లడించారు. ద్రవిడ సిద్ధాంతాన్ని నిర్వీర్యం చేసేందుకే రజనీ పార్టీ పెట్టారని కొందరు చిత్రీకరిస్తున్నారని, ఇది ఎవరి వల్లా సాధ్యం కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment