జయలలిత- కరుణానిధి (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రులుగా సేవలందిన మాజీ సీఎంలు జయలలిత, కరుణానిధిలకు దేశ అత్యున్నత పురష్కారం భారతరత్న ఇవ్వాలని అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే వ్యవస్థాపక సభ్యులు కరుణానిధికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆ పార్టీ నేత తిరుచ్చి శివ డిమాండ్ చేశారు. కరుణానిధి(94) వయోభారంతో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన రాష్ట్రానికి ఐదుసార్లు సీఎంగా వ్యవహరించారని, తన జీవితంలో 80 ఏళ్లు ప్రజాసేవకే అంకితం చేశారని శివ తెలిపారు. కరుణానిధికి భారతరత్న అవార్డును ప్రకటించి, గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. డీఎంకే ఎంపీ, కరుణా కుమార్తె కనిమొళి కూడా ఈ మేరకు ఢిల్లీలో నేతలను సంప్రదించారు.
కాగా అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలితకు భారతరత్న పురష్కారం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. దేశానికి విశేషసేవ అందించిన జయలతిత విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణంలో పెట్టాలని అన్నాడీఎంకే డిమాండ్ చేస్తోంది. జయ 2016 డిసెంబర్‌లో అనారోగ్య కారణంగా మృతి చెందారు. కాగా ఆ రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకు మాజీ సీఎం, ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్‌కు 1988లో కాంగ్రెస్ ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment