స్టాలిన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు పార్టీ అధ్యక్షులుగా ప్రమోషన్ లభించనుంది. పార్టీ శ్రేణులంతా కలిసి కరుణానిధి స్థానంలో ఆయనకు పట్టాభిషేకం చేయనున్నారు. ఇందుకు ఈనెల 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నాదురై మరణించడంతో పార్టీలో నంబర్ 2గా ఉన్న కరుణానిధి ఆయన స్థానంలో సులువుగా అధ్యక్షులయ్యారు. అంతేగాక ముఖ్యమంత్రి బాధ్యతలు సైతం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కరుణానిధి తరువాత పార్టీ పీఠం ఎవరిదనే విషయంలో అంతర్గత యుద్ధమే నడిచింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ సైతం 96 ఏళ్ల వృద్ధుడు కావడంతో పార్టీ పగ్గాలను తప్పనిసరిగా కరుణ సంతానానికే అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో కరుణ పెద్దకుమారుడు అళగిరి, చిన్నకుమారుడు స్టాలిన్ మధ్య పోటీ నెలకొంది. పార్టీపరంగా దక్షిణ తమిళనాడులో అళగిరి, ఉత్తర తమిళనాడును స్టాలిన్ పంచుకున్నారు. మదురై కేంద్రం చేసుకుని అళగిరి చక్రం తిప్పగా, చెన్నైలో ఉంటూ కరుణకు స్టాలిన్ చేరుయ్యారు. పార్టీ పీఠం ఇద్దరిలో ఎవరికనే అతిముఖ్యమైన అంశంపై అళగిరి సంయమనం పాటించకుండా ఆవేశానికి లోనుకావడం, పార్టీకి చేటుతెచ్చే ప్రకటనలు చేయడం ద్వారా కరుణానిధి హృదయంలో స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. ఒక దశలో విసుగుచెందిన కరుణానిధి.. అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు స్టాలిన్ పార్టీ కార్యక్రమాల పట్ల చురుగ్గా వ్యవహరిస్తూ మంచి వ్యూహకర్తగా కరుణచేతనే కితాబునందుకున్నారు.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్‌ను నియమించడం ద్వారా తన రాజకీయవారసుడు ఎవరో అనే విషయాన్ని కరుణ చెప్పకనే చెప్పారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘నమక్కు నామే’ (మనకు మనమే) పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించి కేడర్‌ను సమాయత్తం చేశారు. దీని ఫలితంగా రాష్ట్ర చరిత్రలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎన్నడూ లేని విధంగా 89 స్థానాలు సాధించిపెట్టారు. వృద్ధాప్యం మీదపడుతున్నా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కరుణ ప్రచారం చేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్ పనితీరును గమనించి సంతోషించారు. పార్టీని సమర్థవంతంగా నడిపించగల సత్తా స్టాలిన్‌కే ఉందని కరుణ ఆనాడే ప్రకటించారు. తల్లి సిఫార్సుతో మరలా తండ్రికి చేరువకావాలని, పార్టీలోకి ప్రవేశించాలని, అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అళగిరి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
స్టాలిన్‌కే పట్టం: వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఏడాదిగా చికిత్స పొందుతున్న కరుణానిధి ఈనెల7వ తేదీన కన్నుమూయడంతో వెంటనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు ఏడాదిన్నరకు పైగా స్టాలినే పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. అయితే కరుణ మరణంతో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయిందనే నిర్వేదం శ్రేణుల్లో ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత స్టాలిన్‌పై ఉంది. అంతేగాక వచ్చే ఏడాది రానున్న పార్లమెంటు ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. దీంతో ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు డీఎంకే కార్యవర్గ సమావేశాన్ని పార్టీ ప్రధాన కార్యాలయమైన చెన్నై అన్నాఅరివాలయంలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి అన్బళగన్ శుక్రవారం ప్రకటించారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కార్యవర్గ సభ్యులంతా విధిగా హాజరుకావాలని అన్బగళన్ చెప్పడంతో 14వ తేదీ నాటి సమావేశంలో స్టాలిన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని అందరూ గట్టిగా విశ్వసిస్తున్నారు. పార్టీపరంగా ఎటువంటి చిక్కులు లేకపోవడం స్టాలిన్ ఎన్నిక లాంచనమేనని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment