1994లో నగరి పర్యటనలో కరుణానిధి
చిత్తూరు, పుత్తూరు/విజయపురం: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు అన్న వార్త వినగానే నగరి ప్రాంతంలోని డీఎంకే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ద్రవిడ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే తమిళనాట నాస్తికుడిగా, అభ్యుదయ భావాలకు నిలువెత్తు రూపంగా రాజకీయ అరంగేట్రం చేసిన కరుణకు రాష్ట్ర సరిహద్దులోని నగరి ప్రాంతంలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
నగరితో ప్రత్యేక అనుబంధం..
1949వ సంవత్సరంలో పార్టీ పెట్టినప్పుడే నగరిలో డీఎంకే జెండా ఎగిరింది. ఏకాంబరకుప్పంకు చెందిన మునస్వామి నగరిలో డీఎంకే పార్టీ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి మునస్వామి మృతి చెందే వరకు ఆయనే ఆంధ్రప్రదేశ్ డీఎంకే రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. కరుణానిధి నాలుగుసార్లు నగరిలో పర్యటించారు. తొలిసారి 1952వ సంవత్సరంలో నగరిలో డీఎంకే పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. 1972లో సీఎస్‌ఐ ఆసుపత్రి వర్గాల ఆహ్వానం మేరకు నగరికి వచ్చారు. 1986లో తన రాజకీయ గురువు అన్నాదొరై విగ్రహావిష్కరణ కోసం నగరికి వచ్చారు. చివరగా 1994లో నగరి పట్టణంలోని సత్రవాడలో ఏర్పాటు చేసిన డీఎంకే పార్టీ సమావేశానికి హాజరయ్యారు. 1970లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి జ్ఞానప్రకాష్ తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు డీఎంకే నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
ఆర్థిక సాయం అందించిన కరుణానిధి..
నగరి ప్రాంతానికి చెందిన సుమారు 50 మందికి కరుణానిధి ఆర్థిక సహాయాన్ని అందించారు. నగరి ప్రాంతానికి చెందిన మునస్వామి కుటుంబంతో కరుణకు విడదీయరాని అనుబంధం ఉంది. మునస్వామి బతికి ఉన్నంత వరకు ఆయన్నే రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగించారు. గత ఏడాది మునస్వామి మృతి చెందితే కరుణానిధి కుమారుడు స్టాలిన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రస్తుతం మునస్వామి కుమారుడు మూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించి వారి కుటుంబం పట్ల ఉన్న అనుబంధాన్ని కొనసాగించారు. నగరి ప్రాంతానికి చెందిన కార్యకర్తలు కరుణను కలిసిన ప్రతిసారీ ఆప్యాయంగా పలకరించేవారని వారు గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో కరుణానిధి మేరుపర్వతం అని ఆయన అభిమానులు పోలుస్తుంటారు. కరుణ అస్తమించడం డీఎంకే శ్రేణులు జీర్ణించుకోలేకున్నాయి.
తమిళనాడుకు ఆర్టీసీ బస్సులు బంద్
తిరుపతి సిటీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత డాక్టర్ కరుణానిధి మృతితో తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను మంగళవారం రాత్రి 7 గంటల నుంచి నిలిపివేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అవాంఛనీయ సంఘటనలతో ఆర్టీసీకి నష్టం కలిగిస్తారనే ఉద్దేశంతో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు బస్సులను రద్దు చేశారు. అదే విధంగా తమిళనాడు నుంచి ఏపీలోని పలు జిల్లాలకు వ చ్చే తమిళనాడు ఆర్టీసీ బస్సులను కూడా సాయంత్రం 6గంటల నుంచే నిలిపివేశారు. తిరుపతి నుంచి వేలూరు, తిరుత్తణి, తిరువణ్ణామలై, కోయంబత్తూరు, సేలం, చెన్నై, పాండిచ్చేరీ, మధురై, కాంచీపురం తదితర పట్టణాలకు వెళ్లే బస్సులన్నింటిని పూర్తిగా రద్దు చేసినట్లు తిరుపతి ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం భాస్కర్‌రెడ్డి తెలిపారు. తమిళనాడు పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే బస్సులు నడుపుతామని అన్నారు. జిల్లా సరిహద్దు ప్రాం తాలైన ఊతుకోట, నగరి, నరహరిపేట, కుప్పం వరకు బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అవస్థలు పడ్డ ప్రయాణికులు..
తమిళనాడుకు ఆర్టీసీ బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన తమిళనాడు భక్తులు బస్సులు రద్దు కావడంతో ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలను మాట్లాడుకుని వెళ్లారు.
దక్షిణ భారత సంప్రదాయాలను కాపాడిన ఏకైక వ్యక్తి– వైఎస్సార్ సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి
తిరుపతి అన్నమ య్య సర్కిల్ : తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి 14వ ఏట నుంచి రాజకీయాల్లోకి ప్రవేశిం చారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. దేశానికి దక్షిణ భారతీయం గురించి తెలియజేసిన రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి. కేంద్ర ప్రభుత్వం ఉత్తర దేశ సంప్రదాయాలను దక్షిణ భారతీయులకు అంటగట్టాలని ప్రయత్నించినప్పుడు దరిచేరనివ్వకుండా కాపాడారు. దక్షిణ భారత సంప్రదాయాలను కాపాడిన వ్యక్తి కరుణానిధి.
సరిహద్దుల్లో అలెర్ట్
చిత్తూరు అర్బన్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత కరుణానిధి మృతి పట్ల జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాలు తమిళనాడుకు సరిహద్దులో ఉండటం వల్ల డీఎంకేకు చెందిన కార్యకర్తలు, మద్దతు దారుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని చిత్తూరు, తిరుపతి ఎస్పీలు రాజశేఖర్‌బాబు, అభిషేక్ మొహంతిలు ఆయా సబ్ డివిజన్ల డీఎస్పీలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment