విధి విసిరిన సవాల్‌కు బెదర లేదు.. | Sakshi Special Story On A Familys Painful Story in Chittoor | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నను మరిపిస్తూ.. అనురాగం కురిపిస్తూ..

Published Thu, Feb 2 2023 8:31 AM | Last Updated on Thu, Feb 2 2023 11:08 AM

Sakshi Special Story On A Familys Painful Story in  Chittoor

విధి విసిరిన సవాల్‌కు బెదర లేదు.. ప్రకృతి ప్రకోపానికి భయపడలేదు.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా కుంగిపోలేదు. తల్లిదండ్రులు చెంతలేరని చింతించలేదు. కన్నవారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. పట్టుమని పదేళ్లు కూడా లేని తోబుట్టువులకు అన్నీ తానై ఆప్యాయతలు కురిపిస్తోంది. అమ్మలా లాలిస్తూ.. నాన్నలా అనురాగాన్ని పంచుతూ.. తనూ చదువుకుంటూ, పసివాళ్లకు కొండంత అండగా నిలుస్తోంది. అమ్మచేత గోరుముద్దలు తింటూ.. చందమామ కథలు వింటూ హాయిగా గడపాల్సిన వయసులో కుటుంబ బరువు, బాధ్యతలు మోస్తూ శభాష్‌ అనిపించుకుంటోంది. తల్లిదండ్రులు పక్క రాష్ట్రంలో కూలి పనులు చేస్తుండగా విధిలేని పరిస్థితుల్లో ఏడాదిన్నరగా చెల్లీతమ్ముడితో కలిసి మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్న తీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ చిట్టితల్లి జీవన స్థితిగతులపై‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌.. 

చిత్తూరు: మండలంలోని ముడిపల్లె ఎస్టీ కాలనీకి చెందిన సాగర్, సెల్వి దంపతుల కుమార్తె ప్రతిజ్ఞ (12) స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. బాలిక తమ్ముడు సుదీప్‌కుమార్‌ (7) 2వ తరగతి, చెల్లెలు మధుర (4) అంగన్‌వాడీ సెంటర్‌లో విద్యనభ్యసిస్తున్నారు. వీరు ముగ్గురూ ఏడాదిన్నరగా ముడిపల్లె ఏస్టీ కాలనీలో ఓ గుట్టపై ఉన్న చిన్న ఇంట్లో నివాసముంటున్నారు. 


 
అమ్మలాంటి అక్క
ప్రస్తుతం ఈ కుటుంబ పెద్ద దిక్కు ప్రతిజ్ఞ. ఉదయం ఐదింటికే నిద్రలేచింది మొదలు పడుకునేవరకు తమ్ముడు, చెల్లి ఆలనాపాలనా చూస్తోంది. ఇల్లూవాకిలీ శుభ్రం చేయడం.. పాత్రలు కడిగి తెలిసిన వరకు వంట చేయడం.. వేడినీళ్లు కాగబెట్టి తమ్ముడు, చెల్లికి స్నానాలు చేయించడం.. పౌడర్‌ కొట్టి అందంగా ముస్తాబు చేసి బడికి తీసుకెళుతోంది. సాయంత్రం బడి నుంచి వచ్చిన వెంటనే మళ్లీ ఇంటి పని చేసుకుని.. తోబుట్టువులతో హోంవర్క్‌ పూర్తి చేయించడమే కాకుండా.. తానూ చక్కగా చదువుకుంటోంది, 

బాధ్యతలన్నీ తనపైనే 
ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలన్నా.. కొత్తదుస్తులు కొనాలన్నా.. పండుగపబ్బాలకు ఏవైనా తీసుకురావాలన్నా.. అన్నీ తానై వ్యవహరిస్తోంది ప్రతిజ్ఞ. తన అత్తతో కలిసి ఐదు కిలోమీటర్ల దూరంలోని నగరి వారపు సంతకు వెళ్లి కూరగాయలు తెచ్చుకుంటోంది. తోబుట్టువులకు ఆరోగ్య సమస్యవస్తే ఆస్పత్రికి తీసుకెళ్తూ అమ్మానాన్నలా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తనకు వినికిడి సమస్య ఉన్నా, తోబుట్టువు లను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది

హైదరాబాద్‌లో తల్లిదండ్రులు 
ప్రతిజ్ఞ తండ్రి సాగర్‌ పెయింటర్‌. అరకొర సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్కడ ఒక కాంట్రాక్టరు వద్ద భార్యతో పాటు పెయింటింగ్‌ పనుల్లో కూలీగా చేరాడు. అక్కడే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరి్పంచాడు. ఇలా సాఫీగా సాగుతున్న వారి సంసారాన్ని కరోనా రక్కసి కష్టాల్లోకి నెట్టింది. ఆ తర్వాత పనుల్లేక తల్లడిల్లిపోవాల్సి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో మళ్లీ స్వగ్రామానికి రావాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాంట్రాక్టర్‌ వద్ద అప్పు తీరకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పిల్లలు ముగ్గురినీ సొంత ఊరికి పంపి.. నెలకో, రెండు నెలలకోసారి వచ్చి బియ్యం, పప్పు దినుసులు, కొంత నగదు ఇచ్చి వెళ్లిపోతున్నారు. మరో రెండేళ్లపాటు పనిచేస్తేగానీ అప్పుతీరని పరిస్థితిలో కన్నపేగును దూరం చేసి కుమిలిపోవాల్సి వస్తోంది. 

చిట్టి చేతులకు కొండంత అండ 
ఏడాది క్రితం నుంచి స్వగ్రామంలో ఉన్న ఈ చిన్నారులకు పాఠశాలలో ఒకపూట మధ్యాహ్న భోజనం అందుతోంది. ఇదిగాక యూనిఫాం, పుస్తకాలు, అంగన్‌వాడీ ద్వారా గుడ్లు, ఇతర సామగ్రి వస్తుండడం కాస్త ఆదరువుగా నిలుస్తోంది. గ్రామ వలంటీర్‌ వీరిని గుర్తించి ఇప్పటికే ఆధార్‌ కార్డు ఇప్పించారు. రేషన్‌ కార్డుకు సైతం దరఖాస్తు చేయించారు. అది వచ్చిన తర్వాత వీరి సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తు చేయనున్నట్లు సర్పంచ్‌ తెలిపారు. వచ్చే ఏడాది పిల్లల్లో ఒకరికి అమ్మఒడి అందనుంది. ఇటీవల వచ్చిన తుపానుకు చిన్నారులు ఉన్న ప్రాంతం ముంపునకు గురికావడంతో ప్రభు త్వం తరఫున కూరగాయలు, వంట సామగ్రితోపాటు ఆర్థిక సాయం అందింది. 

భయపెట్టిన తుపాను 
గత ఏడాది వచ్చిన మాండూస్‌ తుపానుతో ముడిపల్లె ఎస్టీ కాలనీ అతలాకుతలమైంది. ఇళ్లు మునిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిజ్ఞ ఉంటున్న ఇంటి పైకప్పు సైతం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా తమ్ముడు, చెల్లిని రెక్కలకింద పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. అప్పుడప్పుడూ ఇంటికి సమీపంలోనే ఉన్న మేనత్త వచ్చి సాయం అందించేది. తిండికూడా సరిగా వండుకునే పరిస్థితి లేకపోవడంతో అర్ధాకలితోనే అలమటించినట్టు ప్రతిజ్ఞ చెబుతోంది.

అమ్మలా చూసుకుంటోంది 
అక్క ప్రతిజ్ఞ ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంచేసి నన్ను నిద్ర లేపుతుంది. చదువుకోమని చెప్పి తాను స్నానం చేసి వంట సిద్ధం చేస్తుంది. నేను స్నానం చేసి వచ్చేలోపు అన్నం చేసి తినిపిస్తుంది. తనే దగ్గరుండి పాఠశాలకు తీసుకెళ్లి వదలిపెడుతుంది. మళ్లీ పాఠశాల వదిలే సమయంలో నన్ను ఇంటికి తీసుకువస్తుంది. రాత్రి పూట అన్నం తినిపిస్తుంది. జ్వరం వస్తే ఆస్పత్రికి తీసుకెళ్తుంది. అప్పుడప్పుడూ అమ్మా, నాన్న వస్తారు. అప్పటి వరకు అక్కే చూసుకుంటుంది.             –సుదీప్‌కుమార్‌ 

అక్కే స్నానం చేయిస్తుంది
నాకు అక్కే స్నానం చేయిస్తుంది. బట్టలు తొడుగుతుంది. అన్నం తినిపిస్తుంది. రాత్రిళ్లు నేను పక్క తడిపేస్తే ఆ దస్తులను కూడా తనే ఉతుకుతుంది. రాత్రిళ్లు భయపడితే పక్కనే పడుకోనిచ్చి నిద్రపుచ్చుతుంది. అక్కే అమ్మలా అన్నీ చూస్తోంది. మాకు అమ్మా నాన్న లేరనే దిగులు లేకుండా చూసుకుంటోంది.  
– మధుర 

అమ్మతో ఉంటూ అలా నేర్చుకున్నా.. 
రోజూ పెయింటింగ్‌ పనులకు వెళ్లి వచ్చి మణికట్టు, చేతుల నొప్పితో అమ్మ చాలా బాధపడేది. చేతులు ఒత్తుకుంటూ కన్నీరు పెట్టేది. ఆ బాధ చూసి ఆమెకు వంటచేసే సమయంలో, ఇతర పనుల్లో సాయంగా ఉండేదాన్ని. అలా వంటావార్పు నేర్చుకున్నా. ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసుకున్నా. తమ్ముడు, చెల్లెల్ని నేనే చూసుకుంటా. ఏవైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెబుతుంటా.   
– ప్రతిజ్ఞ, ముడిపల్లె ఎస్టీ కాలనీ  

నాలుగు నెలల్లో వచ్చేస్తాం 
హైదరాబాద్‌లో నేను, నా భర్త పెయింటింగ్‌ కాంట్రాక్టు వర్కులు తీసుకొని చేస్తున్నాం. కరోనా సమయంలో తీసుకున్న కాంట్రాక్టులు చేయలేక పోయాం. ప్రస్తుతం ఆ పనులు పూర్తి చేస్తున్నాం. నాలుగు నెలల్లో కాంట్రాక్టర్‌ వద్ద పని అయిపోతుంది. ముడిపల్లెకు వచ్చేస్తాం. పొదుపు చేసిన డబ్బులు కొంత ఇంటి నిర్మాణానికి వాడుకుంటాం. నగరి పరిసర ప్రాంతాల్లో పెయింటింగ్‌ పనులకు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాం. 
– సెల్వి, ప్రతిజ్ఞ తల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement