సాక్షి,చిత్తూరు: నగరి నియోజకవర్గంలో నగరి పట్టణం నుంచి పుత్తూరుకు వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ముక్కు కొండ ఉంది. హనుమంతుని ముక్కు ఆకారంలో ఉండటంతో కొండకు ముక్కు కొండ అన్నపేరు వచ్చింది. పుత్తూరు, నగరి జాతీయ రహదారిలో వెళ్లే వారికి సుదూర ప్రాంతం వరకు ఈ కొండ కనిపిస్తుంది. పడుకున్న మనిషి ముక్కు ఆకారంలో ఉండటంతో ఈ కొండకు ఈ పేరు వచ్చిందని నానుడి. సముద్ర మట్టానికి 855 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ వంద కిలోమీటర్ల దూరం వరకు కనబడుతుంది.
ట్రెక్కింగ్ ఇలా...
నారాయణవనం మండలం, సముదాయం గ్రామంలోని అవనాక్షమ్మ ఆలయ సమీపం నుంచి ముక్కుకొండ ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. గైడ్లు లేకుండా కొండపైకి చేరుకోలేము. వారు కూడా వెళ్లే మార్గంలో చెట్లపై గుర్తులు పెట్టుకుంటూ, రాళ్లు పేర్చుకుంటూ తీసుకెళ్లి మళ్లీ ఆ గుర్తుల ఆధారంగా క్రిందకు చేరుస్తారు. ఈ కొండపైకి వెళ్లడం సాహసంతో కూడుకున్న పని. కొండ ఎక్కడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. పైకి వెళ్లేవారు తినడానికి అవసరమైన ఆహారం, నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే దారి పూర్తిగా రాళ్లతోను, ముళ్లకంపలతోను, బోదలతోను నిండి చిట్టడవిలా ఉంటుంది.
ప్రాచీన లైట్ హౌస్
మధ్యయుగ కాలంలో ముక్కుకొండ బంగాళాఖాతంలో వచ్చే పడవలకు చెన్నై మార్గం చూపే దిక్సూచిగా ఉండేది. ఈస్టిండియా కంపెనీ వారి అభ్యర్థన మేరకు అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కార్వేటినగరం రాజుల ఈ కొండ శిఖరంపై అఖండ ధీపం వెలిగించడానికి అంగీకరించారు. కొండశిఖరంపై ఒక అఖండాన్ని ఏర్పాటుచేసి అక్కడ మంటపెట్టడానికి జంగములనే చెంచులను నియమించారు. సూచించిన సమయాల్లో వారు అఖండం వెలిగించే ప్రక్రియను కొనసాగించడానికి కొండ క్రింద వారికి భూములు కేటాయించారు.
అఖండంలో ఒక టన్ను కొయ్యలు వేసి నిప్పంటించగా అది సముద్రంలో ప్రయాణించే షిప్పులకు చిన్న దీపంలా కనిపించేది. ఇలా ముక్కుకొండపై వెలిగించే మంటలు సముద్రంలో ప్రయాణించే షిప్పులకు దారిచూపే లైట్‌హౌస్‌గా మారింది. ఈ దీపం ఆధారంగా షిప్పులు చెన్నై పోర్టుకు చేరుకునేవి. చెన్నై హార్బరులో లైట్ హౌస్ నిర్మించిన పిదప కొండపై షిప్పులకోసం దీపం వెలిగించడాన్ని ఆపేశారు. ప్రస్తుతం షిప్పులకోసం దీపం వెలిగించక పోయినా ప్రతి చిత్రాపౌర్ణమికి చెంచులు కొండపై అఖండాన్ని వెలిగిస్తారు.
ముక్కుకొండ ఊరిపేరుగా మారింది
ఈ కొండ కారణంగానే కొండ అంచున ఉన్న ప్రాంతానికి నగరి అనే పేరు వచ్చింది. ముక్కు ఆకారంలో ఉన్న ఈ కొండను ముక్కు కొండ అని నాశికగిరి అని పిలిచే వారు. నాశిక గిరి కాలక్రమేణా నగిరి అని క్రమేణా నగరి అని మారింది.
హనుమంతుడు ప్రతిష్ఠించిన గగన వినాయకుడు
కొండశిఖరంపై వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఆకాశాన్ని తాకే విధంగా ఉండటంతో ఈ వినాయకుని గగన వినాయకునిగా పిలుస్తారు. హనుమంతుడు సీతాన్వేషణ చేసే సమయంలో ఢీకొన్న కారణంగా కొండ ఇలా ముక్కు ఆకారంలో మారిందని దీంతో హనుమంతడు అక్కడ ఆగి కొండపై ఆగి వినాయకుని ప్రతిష్టించి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజున కొండపై ధీపం వెలిగిస్తే హనుమంతుడు వచ్చి ఆశీర్వదిస్తారని ఇక్కడి ప్రజల నమ్మకం.
కొండపైకి వెళ్లే వారు గగన వినాయకుని, ఆదిశేషుని ఆకారంలో ఉన్న బండను, అఖండాన్ని చూడవచ్చు. వీటితో పాటు వివిధ ఆకారాలోల్లో ఉన్న రాతి బండలను, చెట్లను చూడవచ్చు. చారిత్రక ప్రసిద్దిగాంచిన ఈ కొండపైకి ఆంద్రప్రదేవ్ టూరిజం వారు ట్రెక్కింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కొండ విశేషాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment