సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఎక్కడో పుట్టారు. ఎక్కడో పెరిగారు.. రాజకీయాల చెట్టు నీడలో కలిశారు.. ఒకే పార్టీలో ఉంటూ కరచాలనం చేసుకున్నారు.. వేర్వేరు పార్టీల్లో కత్తులూ దూసుకున్నారు.. రాజకీయ రణక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులతో ఓటర్లను ఫిదా చేసింది కొందరైతే, నిండు సభలో కవిత్వపు జల్లులతో పన్నీరులా పలకరించినవారు మరొకరు.. ఎన్నికల సభల్లో హాస్య చతురతతో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసిరి టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు ఫక్కున నవ్వేలా చేసిన నేతలు కొందరైతే.. మహిళలైనా మహారాణుల్లా వెలిగిపోయి సంక్షేమానికి మరో రూపంలా మారింది కొందరు.
కాల చక్రంలో గిర్రున అయిదేళ్లు తిరిగిపోయాయ్. జీవిత కాలం చివరి మలుపులో వీడలేమంటూ వీడుకోలంటూ ఒకనాటి రాజకీయ యోధులు ఈసారి ఎన్నికల రణక్షేత్రానికి దూరమయ్యారు. మరణం కొందరినీ, వయోభారం, అనారోగ్యం మరికొందరిని ఈ సార్వత్రిక ఎన్నికలకు దూరం చేశాయి. తమ వ్యక్తిత్వాలతో ఓటర్ల మదిలో మరపురాని తిరిగిరాని గుర్తులను వేసిన రాజకీయ దిగ్గజాలు వాజ్‌పేయి, కరుణానిధి, జయలలిత, మనోహర్ పరికార్ వంటి నేతలు లేకుండా జరుగుతున్న ఎన్నికలివి.
మై డియర్ సర్స్, మేడమ్స్, రాజకీయ ఉద్ధండుల్లారా.. రియల్లీ వి మిస్ యూ..
వాజ్‌పేయి: జోహారోయి
రాజకీయానికి – భావ కవిత్వానికి అవినాభావ సంబంధం ఉందని ఎవరైనా అనుకోగలరా? మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి సభలోకి అడుగుపెట్టాక ఆ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆయన మాటే ఒక మంత్రం.. ఆయన ఉపన్యాసం స్వరరాగ కవితా ప్రవాహం. 12 సార్లు పార్లమెంటేరియన్‌గా వాజ్‌పేయి ప్రదర్శించిన రాజనీతిజ్ఞత భావితరాలకు ఆదర్శం.
బీజేపీలో వాజ్‌పేయి దళం ఉంది. అద్వానీ దళం ఉంది అని విపక్షాలు విమర్శిస్తే, వాజ్‌పేయి ‘నేను దళ్‌దళ్ (బురద)లో లేను. కానీ బురదలో కమలదళాన్ని వికసింపజేయగలను‘ అంటూ ఎదురుదాడికి దిగిన ఘనత ఆయనది. గత ఏడాది ఆగస్టు 16న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
వాజ్‌పేయి వ్యక్తిత్వం చరిత్ర పుటల్లో ఒక పేజీగా మిగిలిపోయింది. రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీగా పేరు సంపాదించిన ఈ అజాతశత్రువు ఇక లేరని తలచుకుంటే అభిమానుల మనుసులు భారమైపోతాయి. వి మిస్ యూ అటల్‌జీ అంటూ మౌనంగా రోదిస్తాయి.
పురుచ్చితలైవి: సంచలనాలేవీ?
ఆమెను చూస్తే అమ్మ గుర్తుకు వస్తుంది. ప్రజల ఆకలి తెలుసుకొని కడుపు నింపే అమ్మ. నడిచొచ్చే సంక్షేమానికి నిలువెత్తు రూపం. కుట్రలు, కుతంత్రాలకు నిలయమైన ద్రవిడ నాట ఉక్కు మహిళ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణం ఒక మిస్టరీ. ఆమె సృష్టించారు ఒక హిస్టరీ.
రాజకీయాల్లో జయలలిత ప్రభావం, పార్టీపై ఆమె సాధించిన పట్టు ఎంత అంటే 2016లో అనుమానాస్పదంగా జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకేకి సమర్థుడైన నాయకుడు లేక పార్టీ ‘ఆకులు’ ఆకులుగా విడిపోయి ఛిన్నాభిన్నమైంది. జయ లేకుండా తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేయగలదా అన్న సందేహాలతో ఆమె అనుచరగణం కంటతడి పెడుతున్నారు.
కరుణానిధి: జ్ఞాపకాల నిధి
ద్రవిడ భాషా ఉద్యమ సూరీడు కరుణానిధి. తమిళ రాజకీయాల్లో ఈయనదీ ఒక చరిత్ర. డీఎంకే పార్టీ అధినేతగానే కాదు, పదునైన మాటలతో ఒక సినీ కవిగా ఆయన వేసిన ముద్ర తిరుగులేనిది. స్నేహానికి ప్రాణమిచ్చే కరుణ మనస్తత్వానికి ఎవరైనా తలవంచి జోహార్ అనాల్సిందే. ప్రాణమిత్రుడు ఎంజీఆర్ తన పక్కనే ఆయనకి ఒక పడక సిద్ధం చేశారేమో మరి వయోభారంతోనే నింగికెగిశారు.
నిండు జీవితాన్ని గడిపినప్పటికీ కరుణానిధి ఇక లేరన్న వార్త తమిళ తంబిల మనసుల్లో అగ్నిపర్వతాల్ని బద్దలు చేసింది. అందులోంచి లావా ఎప్పటికీ ఎగజిమ్ముతూనే ఉంటుంది. ఆయన జ్ఞాపకాల కన్నీరు ఉబికి వస్తూనే ఉంటుంది.
పారికర్: ఎక్స్‌ట్రార్డినరీ..
రాజకీయాల్లో అతి సామాన్యుడిగా బతికిన అసామాన్యుడు ఎవరైనా ఉన్నారంటే ఠక్కుమని మనోహర్ పారికర్ పేరు చెప్పొచ్చు. గోవా ముఖ్యమంత్రిగా సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లగలరు. జనంతో మనోహరంగా కలిసిపోగలరు. రక్షణ మంత్రిగా సరిహద్దుల్ని సమర్థవంతంగా కాపలా కాయగలరు. అత్యంత కష్టపడే మనస్తత్వంతో పొలిటికల్ బరిలో విజేతగా నిలిచిన ఆయన కేన్సర్ వ్యాధిని జయించలేక ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. మనోహర్ లేకపోవడం నిజంగా బీజేపీకి తీరని లోటే.
అడ్వాణీ నుంచి పవార్ వరకు రేసులో లేనివారెందరో..
- తన రథయాత్రలతో పెరిగి పెద్దదైన భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతూ కూడా అడ్వాణీని సాధారణ ఓటరుగా మార్చేసింది.
- 75 ఏళ్ల వయసు దాటిందని సాకుగా చూపించి మురళీ మనోహర్ జోషి వంటి నేతని ఎన్నికలకి దూరం చేసింది.
- ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చే సుష్మా స్వరాజ్ అనారోగ్యం వేధిస్తుంటే తనకు తానుగా ఈ రాజకీయ ప్రహసనం నుంచి తప్పుకున్నారు.
- దళిత పతాకం మాయావతి తన లక్ష్యమైన మోదీని ఓడించడానికి పోటీకి దూరంగా ఉంటూ ప్రచారానికే పరిమితమయ్యారు.రాజకీయాలను ఓ ఆటాడుకుని, క్రీడల్లోకి రాజకీయాల్ని దట్టించిన మరాఠా యోధుడు శరద్ పవార్ వయోభారం చేతో, వారసుడిని బరిలో నిలపడం వల్లో.. రేసు నుంచి తప్పుకున్నారు.
- మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఈ స్వార్వత్రిక ఎన్నికల బరిలో లేనని ప్రకటించి అభిమానుల్ని విస్మయానికి గురి చేశారు.
- బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి గంగా ప్రక్షాళన చేయడం కోసం ఎన్నికలనే విడిచి పెట్టేశారు. భారతీయ జీవన వేదమైన గంగానదిని కాపాడుకోవడం కోసం ఆమె ఏడాదిన్నర పాటు యాత్ర చేయనున్నారు.
- లోక్‌జనశక్తి నేత రామ్‌విలాస్ పాశ్వాన్‌ని అనారోగ్యం వేధిస్తోంది. ఎన్నికల్లో పోటీచేసే శక్తి లేక ఆయన కూడా దూరంగా ఉన్నారు.ఇలా అరుదైన రాజకీయ నేతలు బరిలో లేని ఎన్నికలు ఎందరో అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయి. ప్చ్.. అని నిట్టూర్చడం తప్ప ఎవరైనా ఏం చేయగలరు?.
Comments
Please login to add a commentAdd a comment