సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సీజన్‌లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు పార్టీలు వరాలు, హామీలు గుప్పించడం సహజమే. ఢిల్లీ ఓటర్లకు సంజి విరాసత్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఓటర్లకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే మద్యంపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ముస్లింలకు ఈద్ రోజు ఉచితంగా మేకల పంపిణీ, మహిళలకు ఉచితంగా బంగారం వంటి పలు హామీలను ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో పొందుపరిచింది.
సంజి విరాసత్ పార్టీ అభ్యర్థి అమిత్ శర్మ ఈ హామీలతో ఏకంగా పోస్టర్లను రూపొందించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ శర్మ ఆ పార్టీ తరపున ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలో నిలిచారు. ఇక ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో మద్యంపై రాయితీ, ఉచిత మేక పధకంతో పాటు పీహెచ్‌డీ వరకూ ఉచిత విద్య, ఢిల్లీ విద్యార్థులకు మెట్రో, బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రైవేట్ స్కూల్స్‌లోనూ ఉచిత విద్య, యువతుల వివాహానికి రూ 2.5 లక్షల నగదు సాయం, నిరుద్యోగ యువతకు రూ 10,000 భృతి, వృద్ధులకు, వికలాంగులకు రూ 5000 పెన్షన్ వంటి పలు హామీలను గుప్పించింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్ధానాలకు మే 12న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment