సాక్షి, చెన్నై: 2జీ స్పెక్ట్రం కేసులో నిర్దోషులుగా తేలిన కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి శనివారం డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా 17 మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో చెన్నైకి వచ్చిన కనిమొళి, రాజా ర్యాలీగా బయలుదేరి వెళ్లి కరుణానిధిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరికి పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ స్టాలిన్, సీనియర్ నాయకులతో సహా వేలమంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
యూపీఏ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా మొత్తం 17మంది మీద సీబీఐ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు సరైన ఆధారాలను సీబీఐ సమర్పించలేదంటూ.. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామి.
గతకొంత కాలంగా డీఎంకేను 2జీ స్పెక్ట్రం కేసు వేధిస్తోంది. ఈ కేసులో రాజా సంవత్సరకాలం పాటు జైలులో గడపగా, కరుణానిధి కుమారై కనిమొళి ఏడునెలల పాటు జైలులో ఉన్నారు. ఈ కేసు కారణంగా కరుణానిధి గత ఎన్నికల్లో అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు డీఎంకేకు అనుకూలంగా తీర్పు రావడంతో పార్టీ శ్రేణులు ఆనందంతో ఉన్నారు. కరుణానిధి అనారోగ్యం కారణంగా ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కనిమొళి నిర్దోషిగా తేలడంతో ప్రత్యక్ష రాజకీయాలలో ఆమె చురుగా పాల్గొనే అవకాశముందని మద్దతుదారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment