వసుధైక ‘యోగా’
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి సిడ్నీ హార్బర్ వరకూ యోగాడే
చండీగఢ్‌లో ప్రధాని మోదీ ఆసనాలు
ఖర్చులేని ఆరోగ్య బీమా యోగాతోనే సాధ్యం: మోదీ
- యోగాలో కృషి చేసేవారికి జాతీయ, అంతర్జాతీయ అవార్డుల ఏర్పాటు
- రాష్ట్రపతి భవన్‌లోనూ సంబరాలు
- సియాచిన్ మంచుకొండపైనా యోగా
- ఫరీదాబాద్‌లో లక్షమందితో రికార్డు
- ఐరాస సంబరాల్లో జగ్గీవాసుదేవ్
చండీగఢ్/న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా యోగా సంబరమే... ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ, ఆఫ్రికా నుంచి యూరప్ వరకూ మంగళవారం ‘యోగా’తో మైమరచిపోయాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్... పారిస్ ఈఫిల్ టవర్, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్, సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఇలా అన్ని చోట్ల ప్రాచీన భారతీయ సంప్రదాయం వెలిగిపోయింది. ఇక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నుంచి ఐక్యరాజ్యసమితి వరకూ ప్రత్యేక కార్యక్రమాలు మార్మోగాయి. దేశవ్యాప్తంగా లక్షకు పైగా కార్యక్రమాలతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 191 దేశాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నాయి. భారత్‌తో పాటు విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది యోగాసనాలతో సందడిచేశారు.
చండీగఢ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 30 వేల మంది ప్రజలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... మొబైల్ ఫోన్స్‌లాగానే యోగాను కూడా జీవితంలో భాగం చేసుకోవాలని, యోగాతో మధుమేహాన్ని నయం చేయవచ్చని చెప్పారు. ‘యోగా మత సంబంధ వ్యవహారం కాదు. మన మనసులో శాంతి పొందేందుకు, ఆరోగ్యకర శరీరం కోసం, సమాజంలో ఐకమత్యం కోసం యోగా మనకు శక్తినిస్తుంది. పైసా ఖర్చు పెట్టకుండా ఆరోగ్య బీమా అనేది ఈ ప్రపంచంలో లేదు. ఎలాంటి ఖర్చు లేకుండా యోగా మనకు ఆరోగ్య బీమా ఇస్తుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా యోగా కోసం కృషి చేసే వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డుల్ని ప్రకటించారు. దివ్యాంగులతో కాసేపు ముచ్చటించారు.
దేశమంతా ‘యోగా’మయం..
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన యోగా ఉత్సవంలో వెయ్యి మంది పాల్గొన్నారు. యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. దేశవ్యాప్తంగా 57 మంది కేంద్ర మంత్రులు పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో కలిసి ఆసనాలు వేశారు. లక్నోలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్షంలోనే యోగా చేశారు ముంబైలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌లు పాల్గొన్నారు.
సియాచిన్ మంచుకొండపై..
గడ్డకట్టించే చలిలో సియాచిన్ మంచుకొండపై 20 వేల అడుగుల ఎత్తున సైనికులు, అధికారులు ఆసనాలు వేశారు. లేహ్, కార్గిల్, సరిహద్దు వెంట ఉన్న పలు ముఖ్య ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. లేహ్ యోగాసనాల్లో 900 మంది సైనికులు పాల్గొన్నారు. యుద్ధ నౌకల్లో సిబ్బంది ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు.
వివాదాలు, నిరసనలు, గైర్హాజర్లు..
అక్కడక్కడ కొన్ని వివాదాలు, నిరసనలు కూడా చోటు చేసుకున్నాయి. తిరువనంతపురంలో సంస్కృత శ్లోకాల్ని ఉచ్చరించేందుకు కేరళ వైద్య మంత్రి కేకే శైలజ అభ్యంతరం తెలిపారు. చండీగఢ్‌లో ప్రధాని పాల్గొన్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పట్నాలో వేలమందితో కలిసి యోగా చేశారు. పుదుచ్చేరిలో ఆ రాష్ట్ర సీఎం వి.నారాయణసామి, ఇతర మంత్రులు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారు. ఢిల్లీ సంబరాల్లో 15 వేల మందికి పైగా ప్రజలు, 70 మంది దౌత్యవేత్తలు పాల్గొన్నారు. కన్నాట్ ప్లేస్ కార్యక్రమంలో 10 వేల మంది యోగాసనాలు వేశారు.
ప్రపంచవ్యాప్తంగా యోగా సంబరం
న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద వేలాది మంది ఔత్సాహికులు సోమవారం ఉదయం నుంచే యోగాసనాలు ప్రారంభించారు. సిడ్నీ హార్బర్ వద్ద యోగాసనాలు వేశారు. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్‌ల్లో వేలమంది ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత చైనా గోడ వద్ద యోగా- తాయ్ చి(మార్షల్ ఆర్ట్స్) జుగల్‌బందీ నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా సంబరాల్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు. యోగా విశ్వవ్యాప్తం అన్నారు.
నేటి నుంచి యోగాసదస్సు
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ యోగా సదస్సు జరగనుంది. 32 దేశాలనుంచి 70 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రారంభిస్తారు.