‘సోషల్‌ మీడియా సన్యాసం’పై మోదీ మరో ట్వీట్‌ | PM Modi Gives Clarity On Give Up Social Media Accounts | Sakshi
Sakshi News home page

‘సోషల్‌ మీడియా సన్యాసం’పై మోదీ క్లారిటీ

Published Tue, Mar 3 2020 2:44 PM | Last Updated on Tue, Mar 3 2020 2:59 PM

PM Modi Gives Clarity On Give Up Social Media Accounts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాను వీడాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం చురుగ్గా ఉండే మోదీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వేలాది మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇక ప్రతిపక్ష నేతలు సైతం మోదీ ప్రకటనపై తమదైన శైలిలో విమర‍్శలు గుప్పించారు. పలు అనుమానాలు లేవనెత్తారు.  అయితే వీటన్నింటికీ నరేంద్ర మోదీ  మంగళవారం క్లారిటీ ఇచ్చారు. తాను ఈ ఒక్క ఆదివారం మాత్రమే సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించారు.

(చదవండి : ‘సోష‌ల్ మీడియాను బ్యాన్ చేస్తారేమో’)

తానెందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను వదిలేస్తానన్నది స్పష్టం చేస్తూ మోదీ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ‘ వచ్చే ఆదివారం .. మహిళా దినోత్సవం. మనకు స్ఫూర్తిగా నిలిచిన మహిళల కోసం నా సోషల్ మీడియా అకౌంట్లను వారికి అప్పగిస్తున్నాను. అలా చేయడం వల్ల వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుంది. మీరు అలాంటి మహిళేనా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? అయితే అలాంటి మహిళల స్టోరీస్ #SheInspireUs‌తో ట్యాగ్ చేయండి’ అని ట్వీట్ చేశారు.

(చదవండి : ప్రధాని మోదీ సోషల్‌ మీడియా సన్యాసం!)

కాగా, ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో మోదీ చాలా చురుగ్గా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. ట్విటర్‌లో మోదీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్‌ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్‌ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్‌ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, యూఎస్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement