జమ్ము కశ్మీర్‌లోని జోజిలా పాస్ (ఫైల్ ఫొటో)
శ్రీనగర్ : భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న జోజిలా సొరంగ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు శ్రీనగర్, జమ్మూలలో పలు రోడ్డు మార్గాల నిర్మాణ కార్యక్రమాలు ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్, కార్గిల్, లేఖ్‌లను కలుపుతూ నిర్మిస్తున్న జోజిలా సొరంగ మార్గాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణానికి అనుకూలించే విధంగా నిర్మిస్తున్నారు. ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతాల్లో 14.15 కిలోమీటర్ల మేర నిర్మించనున్న జోజిలా మార్గం.. దేశంలో అత్యంత పొడవైన, ఆసియాలోని అత్యంత పొడవైన ద్విదిశాత్మక(టూ వే) సొరంగ మార్గంగా నిలవనుంది. సముద్ర మట్టం నుంచి 11,578 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ వద్ద సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం 6, 800 కోట్ల రూపాయలు వెచ్చించనుంది.
అత్యాధునిక టెక్నాలజీతో..
శ్రీనగర్, కార్గిల్, లేఖ్‌ల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్మిస్తున్న జోజిలా సొరంగ మార్గ నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. నిరంతరాయ విద్యుత్ సప్లై, ఫుల్లీ ట్రాన్స్‌వెర్స్ వెంటిలేషన్ సిస్టమ్, సీసీటీవీ మానిటరింగ్, ట్రాఫిక్ లాగింగ్ ఎక్విప్‌మెంట్, వేరయబుల్ మెసేజ్ సైన్స్, టన్నెల్ రేడియో సిస్టమ్ ద్వారా భద్రతా ప్రమాణాల స్థాయి పెంచనున్నారు.
కాగా ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా 14.15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 3 గంటల 5 నిమిషాల సమయం పడుతోంది. అయితే జోజిలా పాస్ సొరంగ మార్గ నిర్మాణం పూర్తైతే కేవలం 15 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment