ఆసియా ఒక్కటిగా ఎదగాలి
విభేదాలతో ఆలోచిస్తే వెనుకడుగే: మోదీ
ఆసియా నాయకత్వ సదస్సులో ప్రసంగం
మోదీతో బాన్‌కిమూన్ భేటీ..
విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ప్రధాని
సియోల్: ‘‘ఆసియా ఒక్కటిగా ఎదగాలంటే.. ఆసియా ఇకపై తన గురించి తాను ప్రాంతీయ విభేదాలతో ఆలోచించకూడదు. విభేదాలతో కూడిన ఆసియా మనల్ని వెనకపట్టు పట్టిస్తుంది. ఐకమత్యమైన ఆసియా ప్రపంచానికి రూపకల్పన చేస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం సియోల్‌లో జరిగిన ఆసియా నాయకత్వ వేదికలో ప్రసంగించారు. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్‌హై, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ తదితరులు హాజరయ్యారు. ‘‘ఆశావాదం, సుసంపన్నతతో కూడినది ఒకటి; నిరాశావాదం, లేమితో కూడుకున్నది మరొకటి.. ఇలా రెండు ముఖచిత్రాలు ఆసియాకు ఉండకూడదు. ఇది కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు, మరికొన్ని వెనుకబడుతున్న దేశాల ఖండంగా ఉండకూడదు. సుస్థిరమైన ప్రాంతాలు, దెబ్బతిన్న వ్యవస్థల ఖండంగా ఉండకూడదు’’ అని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సీమాంతర నేరాలు, ప్రకృతి విపత్తులు, వ్యాధులు అనే సామూహిక సవాళ్లను ఎదుర్కోవటానికి ఈ ప్రాంత దేశాలు ఉమ్మడిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఇందులో భారత్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తుందన్నారు. ‘‘పశ్చిమాసియాలో ఏం జరుగుతుందో.. అది తూర్పు ఆసియాపై ప్రభావం చూపుతుంది. మహాసముద్రాల్లో ఏం జరుగుతుందో అది ఆసియా భూభాగాలపై ప్రభావం చూపుతుంది. ఆసియాలో శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు సాధ్యమైన కృషి మొత్తం మనం చేయాలి’’ అని ఉద్ఘాటించారు. ఆసియా కూడలిలో ఉన్న భారతదేశం.. అంతర్గతంగా అనుసంధానమైన ఆసియాను నిర్మించటంలో తన బాధ్యతను చేపడుతుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి, అందులోని భద్రతామండలి సహా ప్రపంచ పాలనా వ్యవస్థలను సంస్కరించటానికి ఆసియావాసులు అంతా కలసి కృషి చేయాలన్నారు. ఇదిలావుంటే.. సమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ మోదీతో సమావేశమయ్యారు. భద్రతామండలి సంస్కరణలు, వాతావరణ మార్పులు వంటి కీలకాంశాలపై చర్చలు జరిపారు.
ముగిసిన విదేశీ పర్యటన
దక్షిణ కొరియాలో ప్రధాని మూడు రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది. మొత్తం ఆరు రోజుల పాటు.. చైనా, మంగోలియా, దక్షిణ కొరియాల్లో పర్యటించిన మోదీ మంగళవారం సియోల్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ‘‘రిపబ్లిక్ ఆఫ్ కొరియా పర్యటన చాలా సంతృప్తికరంగా ఉంది. కొరియా ప్రజలు, ప్రభుత్వానికి వారి ఆత్మీయ ఆతిథ్యం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని అంతకుముందు ట్విటర్‌లో పేర్కొన్నారు.
నగరం మధ్యలో ఆహ్లాదకర ప్రవాహం..
సియోల్ శివార్లలోని కీలకమైన పట్టణ పునరుద్ధరణ ప్రాజెక్టు చియోగ్యేచియోన్ ప్రవాహాన్ని(కాలువ) మోదీ సందర్శించారు. ఈ ప్రాజెక్టు కింద రాజధాని నగరంలోని ఎక్స్‌ప్రెస్ వేను(రహదారిని) తొలగించి.. అందులో కాలువను, పౌరుల కోసం ఆహ్లాదకరమైన ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పర్యటన సందర్భంగా భారతీయ ప్రజలు కొందరితో మోదీ ముచ్చటించారు. దక్షిణ కొరియాలోని భారత మిత్రుల (ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా) సంఘాన్ని మోదీ ప్రశంసించారు. ఈ దేశంలోని కళలు, సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న వారిని భారత్‌లో అవే రంగాల్లో పనిచేస్తున్న వారితో అనుసంధానించటానికి మార్గాలను అన్వేషించాల్సిన అవసరముందని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో.. ఉత్తర కొరియాలో భారీ ఎత్తున యోగా ఉత్సవాలు జరిగేలా చూడాలని కోరారు.