ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : వరదలతో తల్లడిల్లిన కేరళ ప్రజలకు భారత ప్రజలంతా బాసటగా నిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. వాయు, సైనిక, వైమానిక దళాలతో పాటు, బీఎస్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు కేరళలో అవిశ్రాంతంగా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయన్నారు. సంక్షోభ సమయంలో నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందిని తాను అభినందిస్తున్నానని ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పేర్కొన్నారు.
దేశ ప్రజలకు రక్షాబంధన్, జన్మాష్టమి శుభాకాంక్షలతో ప్రధాని మోదీ తన రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఇటీవల మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలను ప్రధాని కొనియాడారు. భారత రాజకీయ వ్యవస్థల్లో వాజ్‌పేయి సానుకూల మార్పులకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని దివంగత నేత కట్టుదిట్టం చేశారన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ సంఖ్యాబలంలో మంత్రుల సంఖ్య 15 శాతం మించరాదని వాజ్‌పేయి హయాంలోనే పరిమితి విధించారన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలప్రదమయ్యేలా వ్యవహరించిన పార్లమెంట్ సభ్యులను ప్రధాని అభినందించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదం కోసం వేచిచూస్తోందని, ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా దేశ ప్రజలంతా వారి పక్షాన ఉన్నారని తాను హామీ ఇస్తున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment