కోవింద్ అధికారులుగా మోదీ వీర విధేయులు
న్యూఢిల్లీ: దేశ 14వ రాష్ట్రపతిగా మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు భరత్ లాల్, సంజయ్ కొఠారి, అశోక్ మాలిక్‌లను సీనియర్ అధికారులుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ నియమించింది. ఈ ముగ్గురు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీర విధేయులు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన భరత్‌లాల్‌ను రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా నియమించారు. గుజరాత్‌కు చెందిన ఆయన మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడన్న విషయం అందరికి తెల్సిందే. ఆయన గుజరాత్ రెసిడెంట్ కమిషనర్‌గా 2010 నుంచి 2014 వరకు పనిచేశారు. మోదీ ప్రధాన మంత్రికాగానే ఆయన్ని ఢిల్లీకి రప్పించుకున్నారు.
కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖలో కార్యదర్శిగా పనిచేసి రిటైరైనా ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కొఠారిని ఇప్పుడు రాష్ట్రపతికి కార్యదర్శిగా నియమించారు. ప్రధాని మోదీ వద్ద అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న పీకే మిశ్రాకు కొఠారి అత్యంత సన్నిహితుడు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అశోక్ మాలిక్ కూడా మోదీకి విశ్వాసపాత్రుడనే విషయం మీడియా వర్గాల్లో అందరికి తెల్సిందే. ఆయన్ని కోవింద్ ప్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రధాన మంత్రి కార్యాలయం సిఫార్సుల మేరకే ఈ ముగ్గురి నియామకం జరిగినట్లు తెలుస్తోంది.
తనకు ఇష్టమైన అధికారులను ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్రపతికి ఉందని ఇంతకాలం ప్రణబ్ ముఖర్జీ వద్ద పనిచేసిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. తనకు ఫలానా వ్యక్తులు కావాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను కోరితే ఆ మేరకు నియామకాలు జరుపుతూ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, రాష్ట్రపతి కోరుకున్న వ్యక్తుల్లో ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగానికి అత్యవసరం అనుకున్న సందర్భాల్లో మినహా అన్ని సందర్భాల్లో రాష్ట్రపతి సిఫార్సులనే ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పరిగణలోకి తీసుకుంటుందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఆ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయం మధ్య ప్రభుత్వ వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఈ విధేయులైన వ్యక్తులు పనికిరావచ్చుగానీ, ప్రణబ్ ముఖర్జీ తన వీడ్కోలు సభలో హెచ్చరించినట్లుగా ప్రభుత్వ ఆర్డినెన్స్‌లను రాష్ట్రపతి ఆమోదిస్తూ పోతుంటేనే ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన చెప్పారు.