జై జవాన్.. జై కిసాన్ | PM Narendra Modi inaugurates SAUNI project in Jamnagar, Gujarat | Sakshi
Sakshi News home page

జై జవాన్.. జై కిసాన్

Published Wed, Aug 31 2016 2:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

జై జవాన్.. జై కిసాన్ - Sakshi

జై జవాన్.. జై కిసాన్

నేడు కచ్ చిట్టచివరి రైతులు, జవాన్లకు నర్మదా నీళ్లు
* గుజరాత్‌లోని సౌరాష్ట్ర నర్మదా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ప్రధాని
* సీఎంగా ఉన్నప్పుడు నీటి పరిరక్షణను ప్రోత్సహించానన్న మోదీ

జామ్‌నగర్: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రైతులకు చేరువయ్యే ప్రయత్నాల్ని ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడే మొదలుపెట్టేశారు. ప్రధాని పదవి చేపట్టాక మంగళవారం తొలిసారి గుజరాత్‌లో ఒక బహిరంగ సభలో పాల్గొన్న ఆయన పటేళ్ల వర్గానికి పట్టున్న జామ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సనోసరలో ‘సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ సాగునీటి ప్రాజెక్టు’(సౌనీ)ను ప్రారంభించారు.

అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... జై జవాన్, జైకిసాన్ నినాదంతో సౌనీ ప్రాజెక్టు కోసం కష్టపడ్డామని,  ఇప్పుడు రైతులతో పాటు జవాన్లు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గుజరాత్ మోదీ పర్యటనను తప్పుపట్టిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ..‘తాయిలాలు ఎరవేసి మీరు ఎన్నికల్లో గెలవవచ్చు. కానీ మేం వాటిని నమ్మం. మార్పు, అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 15 ఏళ్లు కష్టపడ్డాం’ అని చెప్పారు.
 
నీటి పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెప్పిన మోదీ... గుజరాత్ సీఎంగా పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలన్న తన ఆశయాన్ని ఆ సమయంలో ప్రజలు అర్థం చేసుకోలేదన్నారు. ‘ 2001లో నేను మొదటిసారి గుజరాత్ సీఎం అయ్యాక... కరెంటు సరఫరా పెంచాలనే డిమాండ్‌కు బదులు నీటి నిర్వహణపై దృష్టి పెడితే బాగుంటుందని రైతులకు తరచుగా చెప్పేవాడిని. రెండు మూడేళ్లు రైతులు అర్థం చేసుకునేలా చేయడంలో విఫలమయ్యా. ఆ సమయంలో రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నా. నేను మాత్రం నా ఆలోచనకే కట్టుబడి ఉన్నాను.

తుంపర, బిందు సేద్యం, సూక్ష్మ సాగునీటి పరికరాలు వాడుతూ నీటిని పరిరక్షించాలనే నా ఆలోచనను అంగీకరించినందుకు రైతులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నర్మదా నీళ్లు కచ్‌లోని చివరి ప్రాంతానికి కూడా చేరుతూ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. గతంలో కచ్‌లో పనిచేసే బీఎస్‌ఎఫ్ జవాన్లు ఒంటెలపై నీటిని తెప్పించుకునేవారు. ఇప్పుడు స్నానానికి కూడా వారు నర్మదా నీటినే వాడుతున్నారు’ అంటూ మోదీ  ప్రసంగించారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో పనిచేశామని, నర్మదా నీరు రైతుల జీవితాల్ని మార్చేసిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement