న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంస్థ రూపురేఖలు, పనితీరుపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఆదివారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మారిన దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ సంస్థ ఎలా ఉండాలన్న అంశంపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఈ భేటీలో తొలుత ప్రణాళిక సంఘం కార్యదర్శి సింధుశ్రీ ఖులార్ భవిష్యత్తులో కొత్త సంస్థ నిర్వర్తించబోయే విధుల గురించి వివరిస్తారు. అనంతరం సీఎంలు ప్రసంగిస్తారు. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబోయే సంస్థలో 8 నుంచి 10 మంది సభ్యులు ఉండొచ్చని సమాచారం. కొత్త సంస్థ రాష్ట్రాలను మరింత బలోపేతం చేసేదిగా ఉంటుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.
విమర్శనాస్త్రాలతో విపక్షాలు సిద్ధం...
ప్రణాళికా సంఘం రద్దుకు ఆతురత పడుతున్న కేంద్రం తీరుపై సీఎంల భేటీలో ఎండగట్టేందుకు విపక్ష సీఎంలు సిద్ధమయ్యారు. ప్రణాళికా సంఘం రద్దు నిర్ణయాన్ని తీసుకున్న తీరుపై తమ సమావేశంలో వ్యతిరేకిస్తుందని జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ వెల్లడించారు. అయితే, ప్రణాళికా వ్యవస్థ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించబోమని, దాని రద్దుకు చేపడుతున్న తొందరపాటు చర్యలనే వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది. తృణమూల్ కూడా అసమ్మతి తెలిపే అవకాశముంంది. ప్రస్తుత వ్యవస్థ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని, కొత్త వ్యవస్థ ఏర్పాటుచేయదలిస్తే అది కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బోలోపేతం చేసేలా ఇంకా సమర్థంగా ఉండాలని కేరళ సీఎం ఊమెన్ చాందీ అన్నారు.
నేడు సీఎంలతో ప్రధాని భేటీ
Published Sun, Dec 7 2014 2:14 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement