పణజీ: గోవా రాజధాని పణజీలో బ్రిక్స్ సదస్సు రెండోరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల్ శ్రీసేనాతో భేటీ అయ్యారు. అనంతరం భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గేతో కూడా మోదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు సమాచారం.
కాగా ఇవాళ బ్రిక్స్ దేశాధినేతల సమావేశం తర్వాత.. బ్రిక్స్-బిమ్స్‌టెక్(బంగాళాఖాత దేశాల సాంకేతిక, ఆర్థిక సహకార కూటమి) సభ్యదేశాల సమావేశం జరగనుంది. సార్క్ సమావేశంలో పాల్గొనేందుకు ఇందులోని నాలుగు దేశాలు విముఖత చూపిన నేపథ్యంలో బ్రిక్స్-బిమ్స్‌టెక్ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది.
మరోవైపు శనివారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమెర్స్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వేర్వేరుగా సమావేశం అయిన విషయం తెలిసిందే.