హోటెల్‌.. మోటెల్‌.. పటేల్‌! | PM Modi addresses Saurashtra Patel Cultural Samaj via VC | Sakshi
Sakshi News home page

హోటెల్‌.. మోటెల్‌.. పటేల్‌!

Published Sat, Jul 7 2018 2:03 AM | Last Updated on Tue, Aug 21 2018 2:30 PM

PM Modi addresses Saurashtra Patel Cultural Samaj via VC - Sakshi

భూటాన్‌ ప్రధాని టాబ్‌గేతో మోదీ

వాషింగ్టన్‌: హోటెల్, మోటెల్, పటేల్‌ వాలాస్‌.. అంటూ ప్రధాని నరేంద్రమోదీ గుజరాతీ పటేల్‌ వర్గం వారితో సరదా సంభాషణ జరిపారు. శుక్రవారం ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ‘సౌరాష్ట్ర పటేల్‌ కల్చరల్‌ సమాజ్‌’ సమావేశంలో పాల్గొన్న వారితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘హోటెల్, మోటెల్, పటేల్‌ వాలాలుగా మీరు ప్రసిద్ధులు కదా. మీ మోటెల్‌కు అతిథి ఎవరైనా వచ్చినప్పుడు భారత్‌ గురించి టీవీలో ఓ ఐదు నిమిషాల వీడియో క్లిప్పింగ్‌ చూపలేరా? అతిథులు టీవీ ఆన్‌ చేయగానే భారత్‌లో వారు చూడగలిగే ప్రదేశాలను తెలుసుకుంటారు.

ఆ విధంగా ఒక్కొక్కరు ఐదుగురు విదేశీయులు భారత్‌ను సందర్శించేలా చేయండి. స్వదేశంలో మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకున్నా.. ఈ ఒక్క పని చేస్తే దేశానికి గొప్ప సేవ చేసిన వారవుతారు’ అని ప్రధాని మోదీ అన్నారు. ఒక్కొక్కరు ఐదుగురు విదేశీయులను భారత్‌కు వచ్చేలా ప్రోత్సహించటం ద్వారా దేశ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ‘భారతీయ సంతతి ప్రజలున్న చోట దేశాభివృద్ధి జరుగుతుందని పరిచయమున్న ప్రతి ఒక్కరికీ తెలుసు.

మన పిల్లలు, స్కూళ్లు, కాలేజీల్లో ఎక్కడున్నా టాపర్లుగానే నిలుస్తారని, మన డాక్టర్లు నిజాయతీ పరులనీ, కష్టపడే తత్వంగల వారని ఆయా దేశాల అధికారులు కూడా నమ్ముతారు’ అని అన్నారు. భారత్‌ను అపఖ్యాతి పాలు చేసేందుకు, ఉగ్రవాదంపై తన వైఖరే సరైందని అంతర్జాతీయంగా  చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న పొరుగుదేశం (పాక్‌పై)పై విజయం సాధించటంలో ప్రవాస భారతీయులు ఎంతో తోడ్పాటు అందించారని కొనియాడారు. గుజరాత్‌కు చెందిన పటేల్‌లు అమెరికాలోని హోటెల్, మోటెల్‌ వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించారు.

2014లో ప్రఖ్యాత స్మిత్సోనియన్‌ మ్యాగజీన్‌ తన వ్యాసంలో.. ‘అమెరికాలోని మోటెళ్లలో సగం భారతీయ అమెరికన్ల యాజమాన్యంలో ఉన్నాయి’ అని పేర్కొంది. ‘అమెరికాలోని అంతర్‌ రాష్ట్ర రహదారుల పక్కన ఉండే మోటల్స్‌లో రాత్రిళ్లు బస చేయాలనుకునే వారికి తక్కువ ధరలోనే బెడ్‌లు దొరుకుతాయి. మరీ ముఖ్యంగా అది భారతీయులకు చెందిన మోటెల్‌ అయి ఉంటుంది’ అని న్యూయార్క్‌టైమ్స్‌ 1999లో తెలిపింది. యోర్క్‌ వర్సిటీ క్యాంపస్‌ డైరెక్టర్‌ రఘునాథన్‌ 2015 నాటి తన బ్లాగ్‌లో.. అమెరికాలో పటేళ్ల జనాభా 2.57లక్షలు. అమెరికాలోని టాప్‌ 500 కుటుంబాల్లో ‘పటేల్‌’ పేరు 174వ ర్యాంకులో ఉంది. అమెరికాలో 22వేల భారతీయుల హోటళ్లుండగా వాటి వ్యాపారం 8.80 లక్షల కోట్లు. వాటిలో 70శాతం గుజరాతీలవే అందుకే వారిని ‘పటేల్స్, అ లా మోటెల్స్‌’ అంటుంటారని పేర్కొన్నారు.  

నరేంద్ర మోదీతో భూటాన్‌ ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టాబ్‌గే శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వ్యూహాత్మక రంగాల్లో సహకారం బలోపేతంపై వారు చర్చించారు. భారత్, భూటా న్, చైనా సరిహద్దుల్లోని డోక్లాం అంశం కూడా చర్చకు వచ్చింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పర్యటనకు వచ్చిన త్సెరింగ్‌కు మోదీ ఘన స్వాగతం పలికారని విదేశాంగ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. వారి చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు. కాగా, భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా మోదీ నివాళులర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement