ఇలాంటోళ్లు దేశానికి అవసరమా? | PM Slams 'Azadi' Remark, Chidambaram Says He Is 'Imagining Ghosts' | Sakshi
Sakshi News home page

ఇలాంటోళ్లు దేశానికి అవసరమా?

Published Mon, Oct 30 2017 1:26 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

PM Slams 'Azadi' Remark, Chidambaram Says He Is 'Imagining Ghosts' - Sakshi

బెంగళూరు: కశ్మీర్‌కు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న ప్రతిపాదనపై ఆలోచించాలన్న కాంగ్రెస్‌ నేత, మాజీ హోం మంత్రి చిదంబరం వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. దేశ సైనికుల త్యాగాలతో రాజకీయాలు చేస్తున్న ఇలాంటి వారి వల్ల దేశానికి  ప్రయోజనం ఉందా? ఎలాంటి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ వేర్పాటువాదులు, పాకిస్తానీయుల తరహాలో మాట్లాడుతోందని, అది కశ్మీర్లో ప్రాణత్యాగం చేసిన వేలాది మంది సైనికులను అవమానించడమేనని ఆయన దుయ్యబట్టారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నిస్సిగ్గుగా కశ్మీర్‌పై మాట మారుస్తుందని, ఈ విషయంలో ఆ పార్టీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బెంగళూరులో ఆదివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడదని మోదీ స్పష్టం చేశారు.

‘నిన్నటి వరకూ అధికారంలో ఉన్న వారు కశ్మీరీయులకు స్వాతంత్య్రం అంటూ మాట్లాడుతున్నారు. గతంలో అధికారంలో ఉండి దేశ అంతర్గత భద్రత, జాతీయ భద్రతకు  బాధ్యత వహించినవారే ఇలా మాట్లాడడంతో నేను ఆశ్చర్యపోయా’ అని చిదంబరం పేరును ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. ‘మాతృభూమి రక్షణ కోసం, కశ్మీరీయుల కోసం దేశ సైనికులు వారి ప్రాణాల్ని త్యాగం చేశారు. ఆ ప్రకటనకు కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి. దేశం కోసం తమ కొడుకుల్ని పోగొట్టుకున్న తల్లులు, సోదరుడ్ని పోగొట్టుకున్న సోదరీమణులు, తండ్రుల్ని పోగొట్టుకున్న చిన్నారులకు కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు.

సర్జికల్‌ దాడుల్ని జీర్ణించుకోలేకపోయారు
గతేడాది ఎల్వోసీ వెంట భారత్‌ జరిపిన సర్జికల్‌ దాడుల్ని ప్రధాని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆ దాడుల్ని జీర్ణించుకోలేకపోయిందని విమర్శించారు. ‘మన సైనికులు శత్రువుకు గట్టిగా సమాధానమిచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ నేత ప్రకటన చూశాక సర్జికల్‌ దాడులపై వారి ఆగ్రహం ఎందుకో నాకు అర్థమైంది. మన  సైనికుల ధైర్య సాహసాలు, భారత్‌ దౌత్య బలం, ధైర్యం, ప్రతిఘటనా సామర్థ్యాన్ని డోక్లామ్‌ ఘటనలో ప్రపంచం మొత్తం చూసింది’ అని ప్రధాని పేర్కొన్నారు.

కశ్మీర్లో అత్యధికుల ఉద్దేశం మరింత స్వయం ప్రతిపత్తే: చిదంబరం
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం కోరుతున్న కశ్మీర్‌ ప్రజల్లో అత్యధికుల అసలు ఉద్దేశం మరింత స్వయం ప్రతిపత్తి కోరడమే’ అని అన్నారు. కశ్మీర్‌ ప్రజలతో స్వాతంత్య్రం విషయమై మాట్లాడినప్పుడు ఈ అవగాహనకు వచ్చానన్నారు. తన సమాధానాన్ని ప్రధాని అర్థం చేసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.  ‘నాపై విమర్శలు చేస్తున్న వారు మొత్తం సమాధానాన్ని చదవాలి. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుందో చెప్పాలి. దయ్యాన్ని ఊహించుకుని దాడిచేస్తున్నారు’ అని ప్రధానిని విమర్శించారు.

మంజునాథ ఆలయం సందర్శన
సాక్షి, బెంగళూరు, బళ్లారి: దక్షిణ కన్నడ జిల్లాలోని ఉజిరెలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి ట్రస్ట్‌  కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మోదీ రూపే కార్డుల్ని అందచేశారు. బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో సౌందర్యలహరి పారాయణోత్సవంలో  పాల్గొన్నారు. బీదర్‌లో రూ.1500 కోట్లతో నిర్మించిన బీదర్‌–కలబుర్గి రైలు మార్గాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌– కర్ణాటక ప్రాంత సమగ్రాభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు యోచిస్తున్నట్లు మోదీ తెలిపారు. ప్రధాని ఎలాంటి ఆహారం తీసుకోకుండా ధర్మస్థలలోని మంజునాథ ఆలయాన్ని దర్శించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement