సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో స్వీకరించిన 1800కు పైగా జ్ఞాపికలను జనవరిలో పదిహేను రోజుల పాటు సాగిన వేలంలో విక్రయించినట్టు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ఆదివారం వెల్లడించింది. వేలం ప్రక్రియ ద్వారా సమకూరిన మొత్తాన్ని గంగా నదీ ప్రక్షాళనకు వెచ్చిస్తామని పేర్కొంది. ప్రధానికి లభించిన జ్ఞాపికల వేలం ద్వారా నిధులు ఎంతమేర వసూలయ్యాయనే వివరాలను పీఎంఓ పేర్కొనలేదు.
నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ) ఈ వేలం నిర్వహించింది. కాగా, ఈ వేలంలో ప్రత్యేకంగా చెక్కతో తయారు చేసిన బైక్ రూ 5 లక్షలు పలికింది. రూ 5000 బేస్ ధరగా నిర్ధారించిన శివుని విగ్రహం రూ పది లక్షలు పలికిందని పీఎంఓ తెలిపింది. ఇక రూ 4000 బేస్ ధరగా నిర్ణయించిన అశోకుడి స్ధూపం రూ 13 లక్షలకు వేలంలో విక్రయించామని వెల్లడించింది.
రూ 4000 ప్రామాణిక ధర కలిగిన గౌతమ బుద్ధ విగ్రహం వేలంలో రూ ఏడు లక్షలు పలికిందని పేర్కొంది. ప్రధాని మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ తనకు లభించిన మెమెంటోలను వేలం ద్వారా విక్రయించి ఆ నిధులను బాలికల విద్య కోసం కేటాయించేవారని, అదే సంప్రదాయం ఇప్పుడూ కొనసాగిస్తున్నారని పీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment