న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల విచారణ వేగవంతం చేయాలని అన్ని హైకోర్టులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులపై వేధింపుల కేసులను ప్రత్యేక న్యాయస్థానాలు త్వరితగతిన విచారించాలని, వేగంగా తీర్పులను వెలువరించాలని అన్ని హైకోర్టులకు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.
లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం(పోక్సో) ప్రకారం నమోదయ్యే కేసుల్లో అనవసరంగా వాయిదాలకు అనుమతించవద్దని ట్రయల్ కోర్టులను సుప్రీం ఆదేశించింది. పోక్సో కేసుల విచారణ తీరును పర్యవేక్షించేందుకు హైకోర్టులు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచిస్తూ.. న్యాయవాది అలఖ్ అలోక్ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిల్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment