ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తొలి విడత నిధులు మంజూరు చేసింది.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తొలి విడత నిధులు మంజూరు చేసింది. నాబార్డు ద్వారా రూ. 1,981 కోట్ల నిధులు అందజేసింది. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిధులకు సంబంధించిన చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందేశారు.
ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ... తొలిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్టుకు నాబార్డు నిధులు ఇస్తోందని తెలిపారు. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలంటే నిధులు అవసరమని అన్నారు. ఇరిగేషన్ నిధులకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయపడతామని హామీయిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, ఉమాభారతి, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.