బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి
బెంగళూరు : 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమానికి ఎలాంటి పరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తేల్చి చెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కతి ప్రకారమే కాకుండా ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం బహిరంగ స్థలాల్లో అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం నేరమని ఆయన తెలిపారు.
ఈనెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడి టౌన్‌హాల్ దగ్గర 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సామాజిక కార్యకర్త రచిత తనేజా ఇప్పటికే అర్జీ సమర్పించారని అన్నారు. కాగా, కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తాము ఎలాగైనా అడ్డుకుంటామని చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసిన శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు.
**