ముద్దు పెట్టుకుంటే....
బెంగళూరు: నగరంలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు అధికారులు హెచ్చరించారు. చట్టాలను వ్యతిరేకించి ఎవరైనాఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తమ పని తాము చేసుకుని వెళ్తామని నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ హెచ్చరించారు. మోరల్ పోలీస్‌గిరికి వ్యతిరేకంగా ఆదివారం బెంగళూరులోని టౌన్‌హాల్ వద్ద కొంతమంది యువతీయువకులు 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం నిర్వహించదలిచిన విషయం తెలిసిందే.
అయితే ఇందుకు అనుమతి ఇచ్చేది లేదని నగర పోలీసులు తేల్చిచెప్పిన నేపథ్యంలో నిర్వాహకుల్లో ఇద్దరు శనివారం సాయంత్రం కమిషనర్ ఎం.ఎన్‌రెడ్డిని నేరుగా కలుసుకుని కార్యక్రమానికి అనుమతించాల్సిందిగా కోరారు. కార్యక్రమం వల్ల శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగదని వారు తెలిపారు. పరిశీలించి అనుమతి ఇచ్చే విషయం ఆలోచిస్తామని కమిషనర్ వారికి తెలిపారు. దాంతో ఆదివారం జరగాల్సిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం వాయిదా పడింది. అయినా టౌన్‌హాల్ దగ్గర ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.