దర్శనమయ్యేదాక కదలం!
ముంబై: మహారాష్ట్రలోని శనిశింగానాపూర్ ఆలయ ప్రవేశం విషయంలో భూమాత బ్రిగేడ్ సంస్థ మళ్లీ పోరుబాట పట్టింది. భూమాత బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్ నేతృత్వంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు శని ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం.. వారిని అడ్డుకుంటూ స్థానికులు ఆందోళన నిర్వహించడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమ తమను ఆలయంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంపై తృప్తి దేశాయ్ మండిపడ్డారు. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి దర్శనం చేసుకునేదాక కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.
మహారాష్ట్రలోని ఆలయాన్నింటిలోకి మహిళలను వెళ్లేందుకు అనుమతించాలని బొంబాయి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో శని ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన భూమాత బ్రిగేడ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తృప్తి దేశాయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు రక్షణ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించగా.. అందుకు విరుద్ధంగా వారు తమను అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. తాము ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేయబోమని, ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటే మహారాష్ట్ర సీఎం, హోంమంత్రిపై కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయంలోకి వెళ్లేందుకు తమకు పోలీసులు సహకరించాలని కోరారు.
అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తృప్తి దేశాయ్ సహా భూమాత బ్రిగేడ్ కార్యకర్తలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఆందోళన నిర్వహిస్తున్న స్థానికులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.