Bhumata Brigade
-
దర్శనమయ్యేదాక కదలం!
ముంబై: మహారాష్ట్రలోని శనిశింగానాపూర్ ఆలయ ప్రవేశం విషయంలో భూమాత బ్రిగేడ్ సంస్థ మళ్లీ పోరుబాట పట్టింది. భూమాత బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్ నేతృత్వంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు శని ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం.. వారిని అడ్డుకుంటూ స్థానికులు ఆందోళన నిర్వహించడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమ తమను ఆలయంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంపై తృప్తి దేశాయ్ మండిపడ్డారు. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి దర్శనం చేసుకునేదాక కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. మహారాష్ట్రలోని ఆలయాన్నింటిలోకి మహిళలను వెళ్లేందుకు అనుమతించాలని బొంబాయి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో శని ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన భూమాత బ్రిగేడ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తృప్తి దేశాయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు రక్షణ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించగా.. అందుకు విరుద్ధంగా వారు తమను అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. తాము ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేయబోమని, ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటే మహారాష్ట్ర సీఎం, హోంమంత్రిపై కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయంలోకి వెళ్లేందుకు తమకు పోలీసులు సహకరించాలని కోరారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తృప్తి దేశాయ్ సహా భూమాత బ్రిగేడ్ కార్యకర్తలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఆందోళన నిర్వహిస్తున్న స్థానికులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. -
మహిళల త్రయంబక యాత్రకు బ్రేక్
భూమాతా బ్రిగేడ్‌ను అడ్డుకున్న పోలీసులు స్వల్ప ఉద్రిక్తత సాక్షి, ముంబై/ పుణే: వివిధ ఆలయాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భూమాతా బ్రిగేడ్ ఈసారి మహాశివరాత్రి సందర్భంగా త్రయంబకేశ్వర్ ఆలయానికి తలపెట్టిన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయానికి 80 కి.మీ. దూరంలోని నందూర్శింగోటి గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. కొంత ఉద్రిక్తత తర్వాత వారిని విడుదల చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, త్రయంబకేశ్వర్‌లో ఉన్న ప్రసిద్ధ శివాలయంలో పూజలు నిర్వహించడానికి ఈ బ్రిగేడ్‌కు నాయకత్వం వహిస్తున్న తృప్తి దేశాయ్ ఆధ్వర్యంలో 150 మందికిపైగా మహిళలు సోమవారం ఉదయం పుణే నుంచి బయలుదేరారు. దేశాయ్ కొంతమంది మహిళలతో కలసి జనవరి 26న శని శింగనాపూర్ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలోలా తమను అడ్డుకోవద్దని దేశాయ్ అధికారులను కోరారు. త్రయంబకేశ్వర్ గర్భాలయంలో పూజలు చేస్తామన్నారు. ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో ఇప్పటికే త్రయంబకేశ్వర్ ఆలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు, భూమాతా బ్రిగేడ్ హెచ్చరికల నేపథ్యంలో శాంతికి విఘాతం కలగకుండా మరింత గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క వీరు గర్భగుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని మహిళా దక్షతా సమితి, శ్రద్ధా మహిళా మండల్, పురోహిత్ సంఘ్ తదితర సంస్థలు ప్రకటించాయి. మరోపక్క.. జూనా అఖాడాకు చెందిన సాధ్వి హరిసిద్ధ గిరి సోమవారం త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఆలయ అధికారులు, మహిళలు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. -
ముఖ్యమంత్రి ఎక్కడున్నారు?
పుణే: తమను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారని భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ మండిపడ్డారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నామని చెప్పారు. తృప్తి దేశాయ్ నాయకత్వంలో త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు బయలుదేరిన మహిళలను పోలీసులు మహారాష్ట్రలోని నందూర్ షన్ గోట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 100 మంది మహిళలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తృప్తి దేశాయ్ మాట్లాడుతూ... తాము శాంతియుతంగా ఆలయ ప్రవేశానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, ఇది కరెక్ట్ కాదని వాపోయారు. ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. మంచి రోజులు(అచ్చే దిన్) అంటే అర్థం ఇదేనా అని నిలదీశారు. సీఎం జోక్యం చేసుకుని తమకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, త్రయంబకేశ్వర్ ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికులు భూమాత సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.