ముఖ్యమంత్రి ఎక్కడున్నారు?
పుణే: తమను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారని భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ మండిపడ్డారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నామని చెప్పారు. తృప్తి దేశాయ్ నాయకత్వంలో త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు బయలుదేరిన మహిళలను పోలీసులు మహారాష్ట్రలోని నందూర్ షన్ గోట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 100 మంది మహిళలను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా తృప్తి దేశాయ్ మాట్లాడుతూ... తాము శాంతియుతంగా ఆలయ ప్రవేశానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, ఇది కరెక్ట్ కాదని వాపోయారు. ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. మంచి రోజులు(అచ్చే దిన్) అంటే అర్థం ఇదేనా అని నిలదీశారు. సీఎం జోక్యం చేసుకుని తమకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, త్రయంబకేశ్వర్ ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికులు భూమాత సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.