పుణె : లాక్‌డౌన్ వేళ దేశవ్యాప్తంగా పలువురు తమ పెళ్లిలను వాయిదా వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పుణెలో మాత్రం పోలీసులే దగ్గర ఉండి ఓ జంటకు పెళ్లిచేశారు. అంతేకాకుండా ఓ అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ దపంతులు.. వధువు తల్లిదండ్రులుగా వ్యవహరించి కన్యాదానం కూడా చేశారు. వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదిత్య సింగ్, వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తున్న నేహా కుష్వాహ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరి తండ్రులు కూడా ఆర్మీలో కల్నల్స్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే ఆదిత్య, నేహాల మధ్య స్నేహం ప్రేమగా మారడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వారి నిశ్చితార్థం జరిగింది. మే 2 వ తేదీన డెహ్రాడూన్‌లో వీరి పెళ్లి జరపాలని నిశ్చయించారు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో ఈ జంట పుణెలో చిక్కుకుపోయారు. మరోవైపు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో ఉండిపోయారు.
అయితే వీరి పెళ్లి తేదీ దగ్గర పడుతున్న సమయంలో వరుడి తండ్రి పుణె సిటీ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. తన కొడుకు పెళ్లి జరిపించడానికి సాయం చేయాల్సిందిగా కోరాడు. దీంతో పోలీసులు ఆదిత్య సింగ్ వివాహనికి అన్ని ఏర్పాట్లు చేశారు. వధువు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ అతని భార్యతో కలిసి కన్యాదానం చేశారు. ఈ వేడుకకు డీసీపీతో పాటుగా పలువురు పోలీసులు హాజరయ్యారు. పెళ్లి జరుగుతున్న సమయంలో వధూవరులు మాస్క్‌లు ధరించి లాక్‌డౌన్ నిబంధనలు పాటించారు. ఈ వేడుకను వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వీడియో కాల్ ద్వారా వీక్షించారు. అయితే కుటుంబ సభ్యులు హాజరుకాకపోయినప్పటికీ అనుకున్న సమయానికి తన పెళ్లి జరగడంపై వరుడు ఆదిత్య ఆనందం వ్యక్తం చేశారు.
చదవండి : ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి..
Comments
Please login to add a commentAdd a comment