లంచగొండితనానికి, అవినీతికీ పోలీసులు దూరంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు.
తిరువనంతపురంః లంచగొండితనానికి, అవినీతికీ పోలీసులు దూరంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బంది మోసపూరిత ప్రవర్తనను ఏమాత్రం దరికి చేరనీయకూడదంటూ అవినీతికి వ్యతిరేకంగా ఓ బలమైన సందేశాన్ని ఇచ్చారు. పోలీసులు లంచాలు తీసుకోవడం కంచే చేను మేసిన చందంగా ఉంటుందని విజయన్ ఉదహరించారు.
అవినీతి రహిత విధానాలతో ఉండే పోలీసు వ్యవస్థ రాష్ట్రానికి ఎంతో అవసరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ప్రత్యేక సాయుధ పోలీస్ క్యాంపులో శిక్షణ పూర్తి చేసిన పోలీసుల పాసింగ్ పెరేడ్ కు హాజరైన ఆయన... అవినీతికి వ్యతిరేకంగా పోలీసులు పనిచేయాలని సూచించారు. థర్డ్ డిగ్రీ టార్చరింగ్ పద్ధతిలో లంచగొండి తనాన్ని పారద్రోలాలని విజయన్ తెలిపారు. క్రిమినల్ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆయన... రాష్ట్ర పోలీసు దళాల్లో బలాన్ని, అవస్థాపన సౌకర్యాలను పెంచనున్నట్లు ప్రకటించారు.