
పోలీసు వ్యవస్థ ‘స్మార్ట్’గా ఉండాలి
- దేశ భద్రతకు నిఘా సమాచారమే కీలకం: మోదీ
- పోలీసు అమరులను గౌరవించాలి..
- పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు రావడానికి సినిమా పరిశ్రమే కారణం
- డీజీపీల సదస్సులో ప్రధాని వ్యాఖ్యలు
గువాహటి: పోలీసు వ్యవస్థ ‘స్మార్ట్’గా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘‘స్మార్ట్‌లో ఎస్ అంటే సెన్సిటివ్ (సున్నితత్వం), ఎం అంటే మోడరన్, మొబైల్ (ఆధునికం, సంచారం), ఏ అంటే అలర్ట్, అకౌంటబుల్ (అప్రమత్తం, జవాబుదారీతత్వం), ఆర్ అంటే రిలయబుల్, రెస్పాన్సివ్ (ఆధారపడతగ్గ, స్పందనగల), టీ అంటే టెక్నో-సావీ (సాంకేతికతను వినియోగించుకునే) అని నా ఉద్దేశం’’ అని ఆయన వివరించారు. ఉత్తమ పోలీస్ వ్యవస్థను అందించాలంటే పోలీసు బలగాలు ఈ విలువలను అలవరుచుకోవాలని.. తద్వారా పోలీసు బలగాల ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు.
నిఘా సంస్థ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ఆదివారం గువాహటిలో నిర్వహించిన 49వ వార్షిక డీజీపీల సదస్సులో ప్రధాని ప్రసంగించారు. దేశ భద్రత అనేది ఆయుధాల మీద ఆధారపడివుండదని.. నిఘా సమాచార సేకరణ మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ఆయుధాల కన్నా నిఘా సమాచార సేకరణ బలంగా ఉంటే.. సైనికులు, ఆయుధాల వినియోగం ప్రధానం కాబోదు’’ అని ఆయన చాణక్యుడి మాటలను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రానంతరం దేశం కోసం, దేశ ప్రజల భద్రత, శాంతి కోసం 33 వేలమంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో బలిదానం చేశారని.. ఆ అమరవీరులను దేశం గౌరవించాల్సిన అవసరముందన్నారు.
ఈ పోలీసుల త్యాగాన్ని పౌరులు తెలుసుకునే అవకాశమే లేదని.. ఈ అమరవీరులు ఎవరో పోలీసులకూ తెలియదన్నారు. సామాన్యుడిని రక్షించేందుకు విధుల్లో మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు విభాగం పూర్తి గౌరవంతో అంత్యక్రియలను నిర్వహించే పూర్తి బాధ్యతను నిర్వర్తించేలా చూసేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ పోలీసు నియామకాలు, వారికి శిక్షణనిచ్చే పోలీసు అకాడమీల పాఠ్యాంశాల్లో.. విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల జీవితాలపై ఒక పుస్తకాన్ని తప్పనిసరిగా చేర్చాలని పేర్కొన్నారు. వారిపై ప్రతి రాష్ట్రమూ స్థానిక భాషలో ఈ-పుస్తకం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
సం‘క్షేమం’ అందించాలి... పోలీసులు తమ ప్రాణాలను ప్రమాదంలో ఉంచడం వల్ల వారి జీవితాలు పూర్తిగా ఆందోళనలతో నిండి ఉంటాయని.. వారి కుటుంబాలకు శాంతి, స్థిరత్వం అందించకపోతే పోలీసులు సమాజం కోసం పూర్తి స్థాయిలో పనిచేయలేరని.. పోలీసు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మోదీ పేర్కొన్నారు. సామాన్యుల దృష్టిలో పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు రావటానికి సినిమా పరి శ్రమే కారణమని తప్పుపట్టారు. సినిమాలు తీసేవారిని కలిసి.. పోలీసు వ్యవస్థలో ఉత్తమ గుణాన్ని చూపేలా చేయటానికి ప్రభుత్వం ఒక ప్రజాసంబంధాల సంస్థను నియమించుకోవాలన్నారు. ఉగ్రవాద దాడులకు ప్రవాస భారతీయులు కొందరు ఊతమిస్తున్నారని ఐబీ డెరైక్టర్ అసిఫ్ ఇబ్రహీం అన్నారు.
ప్రధాని ప్రసంగిస్తున్నా నిద్రలో సీబీఐ చీఫ్!
సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా వరుసగా రెండో రోజూ నిద్ర మత్తులో జోగుతూ మీడియా కంటికి చిక్కారు. శనివారం జరిగిన డీజీపీల 49వ వార్షిక సదస్సులో ఓవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తుంటే నిద్రలోకి జారుకున్న సిన్హా...ఆదివారం గువాహటిలో ఈ సదస్సులో స్వయంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నా పట్టించుకోకుండా తన ‘పని’ కానిచ్చేయడం గమనార్హం.
చొరబాటు మార్గాలను మూసివేస్తాం...
పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి అక్రమ చొరబాట్లకు ఉపయోగిస్తున్న రహదారులన్నిటినీ మూసివేస్తామని.. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బంగ్లాదేశ్‌తో భూమి బదిలీ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని మోదీ పేర్కొన్నారు. ఆయన గువాహటిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈమేరకు పేర్కొన్నారు.
మణిపూర్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ
మణిపూర్‌లో త్వరలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆదివారం మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన ‘సాంగై మణిపూర్ టూరిజం ఫెస్టివల్’ ముగింపు కార్యక్రమంలో మోదీ ఈ ప్రకటన చేశారు.