హోలీ బీభత్సం..75 మందిపై కేసులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ లో హోలీ పండుగ రోజు బీభత్సం వాతావరణం నెలకొంది. మహరాజ్ నగర్ గ్రామంలో హోలీ ఉత్సవాల సందర్భంగా రోడ్డు బ్లాక్ చేయొద్దు అన్నందుకు గ్రామస్తులు పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో ఒక ఎస్సై సహా నలుగురు పోలీసులు గాయపడడంతో ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి.
వివరాల్లోకి వెళితే గురువారం హోలీ సందర్భంగా గ్రామస్తులు సంబరాలకు హాజరయ్యారు. సుమారు వందలమందితో అక్కడంతా కోలాహలంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ బృందం అక్కడకు చేరుకుని రోడ్డును మూసివేయొద్దని, సజావుగా కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులపై రాళ్లతో దాడికి చేశారు. పోలీసు అవుట్పోస్ట్ ఇన్చార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ జితేందర్ సింగ్, కానిస్టేబుళ్లు గౌరవ్, జయవీర్ , ప్రవీణ్ గాయపడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకున్నారు. నిందితుల ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు.
ఈ ఘటనలో 75 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నామన్నారు.