
ప్రతినెలా 7 నుంచి టీకాల వారం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా సోమవారం ప్రారంభించారు. ఈ ఏడాది తొలివిడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిస్థాయి వ్యాధి నిరోధక టీకాలు కేవలం 55.40 శాతం మంది చిన్నారులకే అందాయి. 42.50 శాతం పిల్లలకు పాక్షికంగా అందాయి. అసలే టీకా అందని చిన్నారులు 2.10 శాతం ఉన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా కేవలం 65 శాతం మంది చిన్నారులే పుట్టిన తొలి ఏడాదిలో అన్నిరకాల వ్యాక్సిన్లు పొందగలుగుతున్నారన్నారు.