టీఆర్ జెలియాంగ్
కోహిమా: నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముసలం ముదిరింది. తాను పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన 10 పార్లమెంటరీ సెక్రటరీలను ముఖ్యమంత్రి డాక్టర్ షురోజిలి లీజిత్సు తొలగించడంతో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్) ప్రభుత్వంలో అంతర్గత సంక్షోభం తీవ్రమైంది. మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు టీఆర్ జెలియాంగ్ ప్రయత్నిస్తుండడంతో ముసలం మొదలైంది. తనకు 33 మంది ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బలపరుస్తున్నారని గవర్నర్ పీబీ ఆచార్యకు శనివారం జెలియాంగ్ లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీ పదవుల నుంచి షురోజిలి లీజిత్సు తొలగించారు. వేటు పడిన వారిలో హెం, విద్యుత్, పర్యావరణ మంత్రులు ఉన్నారు. అలాగే జెలియాంగ్‌ను ఆర్థిక సలహాదారు పదవి నుంచి తప్పిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. శనివారం సమావేశమైన ఎన్‌పీఎఫ్ క్రమశిక్షణ సంఘం 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ ప్రాథమిక, క్రియాశీలక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది.
మరోవైపు తన మద్దతు ఇస్తున్న 41 మంది ఎమ్మెల్యేలతో అసోంలోని కాజిరంగా నేషనల్ పార్క్‌లోని బార్గోస్ రిసార్ట్‌లో జెలియాంగ్ మంతనాలు జరుపుతున్నారు. జెలియాంగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని, ఆయన నిర్ణయం కోసం వేచిస్తున్నామని ఉద్వాసనకు గురైన అటవీశాఖ మంత్రి ఇమ్‌కాంగ్ ఎల్ ఇమ్‌చిన్ తెలిపారు.