TR Zeliang
-
బీజేపీ చెబుతున్న మార్పు ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘మార్పు తీసుకొస్తాం, మార్పు కోసమే మా పోరాటం’ అంటూ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ–నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి వస్తుందని తేలిపోయింది. కానీ రాష్ట్రంలో మార్పు వచ్చే సూచనలు మాత్రం శూన్యమే. ఎన్డీపీపీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, 60 మంది సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో తమకు జేడీయూ, ఓ స్వతంత్య్ర అభ్యర్థితోపాటు మొత్తం 32 మంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ ప్రకటించింది. గవర్నర్ ఆహ్వానిస్తే ఎన్డీపీపీ వ్యవస్థాపక నాయకుడు నైఫ్యూ రియో ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ కంటే ముందు వరుసగా 11 ఏళ్లపాటు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్ధాంతరంగా సీఎం పదవిని వదిలిపెట్టి 2014లో ఎంపీగా లోక్‌సభకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. జెలియాంగ్ ప్రభుత్వం హయాంలో వెలుగులోకి వచ్చిన అనేక అవినీతి కుంభకోణాలు నాటి రియో ప్రభుత్వంలో ప్రారంభమైనవే. రియో పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గత శాసనసభ్యులకన్నా ఈసారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే శాసనసభ్యుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ ఓ సర్వే ద్వారా తేల్చింది. నాగాలాండ్ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తనకూ ఉందని, తనకే అవకాశం కల్పించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ రాష్ట్ర గవర్నర్‌ను కోరిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని కూడా బీజేపీ చర్చలకు పిలిచింది. జెలియాంగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు ఎన్నికల్లో 27 సీట్లు లభించాయి. 2013 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకొని ఈసారి ఏకంగా 12 సీట్లను గెలుచుకున్న బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు మద్దతిస్తే మళ్లీ జెలియాంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ప్రస్తుత జెలియాంగ్ ప్రభుత్వంలో కూడా బీజేపీ కొనసాగిన విషయం తెల్సిందే. బీజేపీ తరఫున 2013లో ఒక్కరే గెలిచినప్పటికీ ఆ తర్వాతా వారి సంఖ్య పార్టీ ఫిరాయింపులతో నాలుగుకు చేరింది. 2015 నుంచి ప్రతిపక్షంలో ఒక్కరు కూడా లేకుండానే జెలియాంగ్ ప్రభుత్వం కొనసాగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరిపోవడమే అందుకు కారణం. రియో నాయకత్వంలోని ఎన్డీపీపీతో కలిసే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోనే ధనిక ప్రభుత్వం అవుతుంది. ఇరుపార్టీలకు చెందిన శాసనసభ్యుల్లో 75 శాతం మంది కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన వారే. అవినీతి కుంభకోణాలు రియో హయాంలో ప్రారంభమై ఆ కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నందున బీజేపీ చెప్పే మార్పు ఎక్కడ వస్తుంది? ఇక జెలియాంగ్‌తో చేతులు కలిపితే మార్పు అనే పదానికే అర్థం ఉండదు. ఈసారి మార్పు వచ్చేదల్లా ఒక్కటే. బీజేపీ ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అవతలి పక్షం ప్రతిపక్షం అవుతుంది. రియో పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేసినందున ప్రభుత్వంలో ఆయన పార్టీ కూడా చేరిపోతే మళ్లీ ప్రతిపక్షం అనేది ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వ పాలన సవ్యంగా సాగుతుంది. -
బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్
-
బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్
కొహిమా: నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో మొత్తం 59 మంది సభ్యులుండగా.. జెలియాంగ్కు అనుకూలంగా 47 మంది ఓటేశారు. వీరిలో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు 36 మందితో పాటు నలుగురు బీజేపీ సభ్యులు, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. మాజీ సీఎం లీజిట్సుకు 11 ఓట్లు పడగా.. వారిలో 10 మంది ఎన్పీఎఫ్, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. ఓటింగ్‌కు ముందు చర్చలో లీజిట్సు మద్దతు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆయనను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కాగా, 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
మరో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం
కోహిమా: నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముసలం ముదిరింది. తాను పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన 10 పార్లమెంటరీ సెక్రటరీలను ముఖ్యమంత్రి డాక్టర్ షురోజిలి లీజిత్సు తొలగించడంతో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) ప్రభుత్వంలో అంతర్గత సంక్షోభం తీవ్రమైంది. మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు టీఆర్ జెలియాంగ్ ప్రయత్నిస్తుండడంతో ముసలం మొదలైంది. తనకు 33 మంది ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బలపరుస్తున్నారని గవర్నర్ పీబీ ఆచార్యకు శనివారం జెలియాంగ్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీ పదవుల నుంచి షురోజిలి లీజిత్సు తొలగించారు. వేటు పడిన వారిలో హెం, విద్యుత్, పర్యావరణ మంత్రులు ఉన్నారు. అలాగే జెలియాంగ్‌ను ఆర్థిక సలహాదారు పదవి నుంచి తప్పిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. శనివారం సమావేశమైన ఎన్పీఎఫ్ క్రమశిక్షణ సంఘం 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ ప్రాథమిక, క్రియాశీలక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు తన మద్దతు ఇస్తున్న 41 మంది ఎమ్మెల్యేలతో అసోంలోని కాజిరంగా నేషనల్ పార్క్‌లోని బార్గోస్ రిసార్ట్‌లో జెలియాంగ్ మంతనాలు జరుపుతున్నారు. జెలియాంగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని, ఆయన నిర్ణయం కోసం వేచిస్తున్నామని ఉద్వాసనకు గురైన అటవీశాఖ మంత్రి ఇమ్కాంగ్ ఎల్ ఇమ్చిన్ తెలిపారు. -
ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. సీఎం రాజీనామా!
న్యూఢిల్లీ/గువాహటి: సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురుతిరగడంతో నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన గిరిజన గ్రూపులకు మద్దతుగా ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు సీఎం జెలియాంగ్కు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జెలియాంగ్ ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఎన్పీఎఫ్ పార్టీ శాసనసభ్యుల సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారని తెలిపారు. నాగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో ఎన్పీఎఫ్ సభ్యులంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కేటాయించాలన్న సీఎం జెలియాంగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్ గిరిజన యాక్షన్ కమిటీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం తమ సంప్రదాయానికి విరుద్ధమంటూ గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో నాగాలాండ్ గతకొన్నిరోజులుగా రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు కూడా గిరిజన గ్రూపులకు మద్దతు పలుకడంతో టీఆర్ జెలియాంగ్ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. -
నాగాలాండ్ సీఎం నైపూ రియో రాజీనామా
కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రి నైపూ రియో తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అశ్వనీ కుమార్ ఆయన రాజీనామాను ఆమోదించారు. నైపూ రియో లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఆయన సీఎం పదవిని వదులుకున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేతృత్వంలోని డెమొక్రాటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) శాసన సభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా జెలియాంగ్‌ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జెలియాంగ్ ప్రస్తుతం గనులు, భూగర్భ వనరులు, ప్రణాళిక శాఖల మంత్రిగా ఉన్నారు. జెలియాంగ్ అభ్యర్థిత్వానికి డీఏఎన్లోని పక్షాలైన జేడీయూ, ఎన్సీపీ, బీజేపీ, స్వత్రంతులు పూర్తి మద్దతు ప్రకటించారు.