న్యూఢిల్లీ: నలంద విశ్వవిద్యాలయం అంతర్గత వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని వర్సిటీ చాన్స్‌లర్, ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్ అన్నారు. వర్సిటీ చాన్స్‌లర్‌గా తనను మోదీ ప్రభుత్వం వద్దనుకుంటోందని.. అందుకే చాన్స్‌లర్‌గా తనకు రెండోసారి అవకాశమిచ్చే ఫైల్‌ను నెలరోజులుగా పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. వర్సిటీ హితాన్ని దృష్టిలో పెట్టుకుని తానే రేసు నుంచి తప్పుకొంటున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని మోదీని తొలి నుంచి విమర్శించే వారిలో అమర్త్యసేన్ ఒకరు. బిహార్‌లోని నలంద వర్సిటీ చాన్స్‌లర్‌గా ఉన్న అమర్త్యసేన్ పదవీకాలం జూలైలో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో పర్యాయం ఆయన్ను చాన్స్‌లర్‌గా కొనసాగించాలని వర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకుని... కేంద్రానికి ప్రతిపాదన పంపింది. కానీ దీనిపై ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రెండోసారి పోటీ నుంచి తానే స్వయంగా తప్పుకొంటున్నట్లుగా వర్సిటీ పాలకమండలికి అమర్త్యసేన్ శుక్రవారం లేఖ రాశారు. తనను రెండోసారి చాన్స్‌లర్‌గా కొనసాగించాలంటూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్‌ను పక్షం రోజుల కిందే మంత్రిత్వశాఖకు పంపారని, కానీ తనను కొనసాగించడంమోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు.
అందుకే తన కొనసాగింపునకు సంబంధించిన ఫైలును రాష్ట్రపతి ఆమోదానికి పంపలేదన్నారు. వర్సిటీ విద్యా సంబంధ అంశాల్లో ప్రభుత్వం కల్పించుకుంటోందని ఆరోపించారు. విమర్శించినందుకే ఇలా జరుగుతోందా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మీరు మోదీని విమర్శిస్తారు.. ఆయన మిమ్మల్ని చాన్స్‌లర్‌గా ఉండాలనుకోరు కదా’ అని నా భార్య నన్ను ప్రశ్నించింది. అని తెలిపారు. కాగా, ఆయన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చాన్స్‌లర్‌గా ఆయన కొనసాగింపును అడ్డుకొనే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. అమర్త్యసేన్ కొనసాగింపునకు సంబంధించి వర్సిటీ పాలకమండలి సమావేశం తీసుకున్న నిర్ణయాల ఫైలు ఇంకా మంత్రిత్వ శాఖకు అందనే లేదని చెప్పారు.